మీ ఫ్యామిలీకి ఇస్తున్న సమ్మర్‌ గిఫ్ట్‌ ఇది

ABN , Publish Date - Apr 04 , 2024 | 02:14 AM

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా రూపొందిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. పరశురామ్‌ పెట్ల దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మించారు...

మీ ఫ్యామిలీకి ఇస్తున్న సమ్మర్‌ గిఫ్ట్‌ ఇది

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా రూపొందిన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. పరశురామ్‌ పెట్ల దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మించారు. మంగళవారం రాత్రి దూలపల్లి మైసమ్మ గూడలోని కాలేజ్‌ ప్రాంగణంలో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో దర్శకుడు మాట్లాడుతూ ‘మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. విజయ్‌ ఇప్పటివరకూ చేసిన నటన ఒక ఎత్తయితే, ఇందులో ఇచ్చిన పెర్ఫార్మెన్స్‌ మరో ఎత్తు. అలాగే మృణాళిని కూడా అద్భుతంగా నటించింది. బ్లడ్‌ అండ్‌ సోల్‌ పెట్టి ఈ సినిమా చేశాను. దిల్‌రాజుగారి బేనర్‌లో వర్క్‌ చేయాలనే కోరిక ఈ చిత్రంతో తీరింది’ అన్నారు.

‘మీరంతా ఎగ్జామ్స్‌ రాసి పాసయిన తర్వాత నెక్ట్స్‌ క్లాస్‌లోకి వెళ్లడమే కాదు ఈ సినిమా చూసి ఫ్యామిలీ స్టార్స్‌ అవుతారు. ఈ సినిమాలో విజయ్‌ నటన అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. అతని పాత్రను దర్శకుడు పరశురామ్‌ బాగా డిజైన్‌ చేశాడు. నవ్విస్తాడు, ఫైట్స్‌ చేస్తాడు. కోపం వస్తే కొట్టమని హీరోయిన్‌తో తన్నులు తింటాడు. మీరందరూ కూడా బాగా ఎంజాయ్‌ చేస్తారు’ అని చెప్పారు దిల్‌ రాజు.

హీరోయిన్‌ మృణాళిని మాట్లాడుతూ ‘ఇందు పాత్ర పోషించడం మొదటి 15 రోజులు చాలా కష్టంగా అనిపించింది. ఆ తర్వాత ఆ పాత్రను నా కంటే గొప్పగా ఎవరూ చేయలేరన్న సంతోషం కలిగింది. ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రాన్ని మా ఫ్యామిలీ స్టార్‌ అయిన నాన్నకు అంకితం ఇస్తున్నా’ అన్నారు

‘ఆరేళ్ల క్రితం నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘గీత గోవిందం’. అదే దర్శకుడితో ‘ఫ్యామిలీ స్టార్‌’ చేశా. నా సినిమా రూ.వంద కోట్లు వసూలు చేయాలనే కల ఆ సినిమాతో తీరింది. మళ్లీ అటువంటి సినిమా నాకు రాలేదు. ‘పెళ్లిచూపులు’ నుంచి ‘ఫ్యామిలీస్టార్‌’ దాకా నేను చేసిన ప్రతి సినిమా ఏదో ఒక కొత్త విషయం నేర్పించింది. ఇబ్బందులు, అవరోధాలు, అవమానాలు ఎదురైనా వాటిని దాటుకుని అనుకున్నది సాధించాలి. అదే నమ్మకంతో నేను పనిచేస్తుంటా. మీ ఫ్యామిలీకి మా టీమ్‌ ఇస్తున్న సమ్మర్‌ గిఫ్ట్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’. చూసి ఎంజాయ్‌ చేయండి’ అన్నారు విజయ్‌ దేవరకొండ.

Updated Date - Apr 04 , 2024 | 02:14 AM