మానవసంబంధాలతో కూడిన కథ ఇది

ABN , Publish Date - Jan 14 , 2024 | 03:28 AM

స్నేహం, ప్రేమ, త్యాగం, విశ్వాసం.. ఇలా మానవ సంబంధాలతో కూడిన అద్భుతమైన కథ ‘నా సామిరంగ’ . అని అక్కినేని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మించిన...

మానవసంబంధాలతో కూడిన కథ ఇది

స్నేహం, ప్రేమ, త్యాగం, విశ్వాసం.. ఇలా మానవ సంబంధాలతో కూడిన అద్భుతమైన కథ ‘నా సామిరంగ’ . అని అక్కినేని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా ఈ ఆదివారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున విలేకరులతో ముచ్చటించారు.

  • ప్రీప్రొడక్షన్‌ పక్కాగా చేసుకున్నాం కాబట్టే సినిమాను వేగంగా పూర్తిచేయగలిగాం. కీరవాణి షూటింగ్‌కు ముందే మూడు పాటలు ఇచ్చేశారు. అలాగే ఫైట్స్‌ సీక్వెన్స్‌కి నేపథ్య సంగీతాన్ని కూడా ఇచ్చేశారు. ఆ నేపథ్య సంగీతం పెట్టుకొని ఫైట్‌ షూట్‌ చేశాం. ఓ విధంగా ఇంత వేగంగా సినిమా పూర్తవ్వడానికి కీరవాణిగారు కూడా కారకులే.

  • భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు పండగల నేపథ్యంలో జరిగే కథ ఇది. మన సంక్రాంతి శోభ మొత్తం ఈ సినిమాలో ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు కృష్ణయ్య, నాది టిపికల్‌ లవ్‌స్టోరీ. నాపాత్రకూ హీరోయిన్‌ అశికా రంగనాథ్‌ పాత్రకూ మధ్య ప్రేమకథ 12ఏళ్లు నడుస్తుంది. అది కూడా వ్యక్తపరచుకోకుండానే.

  • దర్శకుడు విజయ్‌ బిన్నీకి మంచి విజువల్‌ సెన్స్‌ ఉంది. తను కొరియోగ్రఫీ చేసిన పాటల్ని కూడా కేవలం స్టెప్పులతోనే కాకుండా ఒక కాన్సె్‌ప్టగా తీర్చిదిద్దుతాడు. అందుకే అతనికి అవకాశం ఇచ్చాను. ఈ కథను అతను తీర్చిదిద్దిన విధానం అందరికీ నచ్చింది. కెమెరా డిపార్ట్‌మెంట్‌తో కలిసి రౌండ్‌ క్లాక్‌ పనిచేశాడు. అలాగే పోస్ట్‌ ప్రొడక్షన్‌ టైమ్‌లో కూడా అందరినీ సమన్వయపరచుకుంటూ పనిచేయించుకున్నాడు. చక్కని క్లారిటీ ఉన్న దర్శకుడు తను.

  • నరేశ్‌, రాజ్‌తరుణ్‌ పాత్రలు కథలో చాలా కీలకమైనవి. ఇద్దరూ అద్భుతంగా నటించారు. సాంకేతికంగా అబ్బురపరిచేలా ఉంటుందీ సినిమా. నిర్మాత శ్రీనివాస్‌ చిట్టూరి ఏ విషయంలోనూ వెనుకడుగు వేయలేదు. అందరూ మనసుపెట్టి పనిచేశారు. ఈ సినిమా తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్నాను.

Updated Date - Jan 14 , 2024 | 03:28 AM