Vijayadevarakonda : ఈ ప్రచారాన్ని.. అరికట్టాల్సిందే!

ABN , Publish Date - Apr 12 , 2024 | 05:44 AM

తెలుగు సినీ పరిశ్రమలోని అగ్రనిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. ఇటీవల ఆయన నిర్మించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా విడుదలయింది. చాలా ప్రాంతాల్లో సినిమా చూసి ఎంతో మంది బాగుందన్నారు. కానీ సినిమా విడుదలకు...

Vijayadevarakonda : ఈ ప్రచారాన్ని.. అరికట్టాల్సిందే!

తెలుగు సినీ పరిశ్రమలోని అగ్రనిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. ఇటీవల ఆయన నిర్మించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా విడుదలయింది. చాలా ప్రాంతాల్లో సినిమా చూసి ఎంతో మంది బాగుందన్నారు. కానీ సినిమా విడుదలకు ముందే కొన్ని యూట్యూబ్‌ రివ్యూలు వచ్చేశాయి. సినిమా బాగోలేదనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ఈ కారణంగా సినిమా ఓపెనింగ్స్‌ దెబ్బ తిన్నాయి. దీంతో దిల్‌రాజే స్వయంగా మైక్‌ పట్టుకొని- ‘పబ్లిక్‌ ఓపినియన్‌’ అడిగి సోషల్‌ మీడియాలో పెట్టారు. తమను కావాలని టార్గెట్‌ చేశారని- ఫ్యామిలీ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ మేనేజర్‌ అనురాగ్‌ పర్వతనేని పోలీసు కేసు కూడా పెట్టారు. నిజంగా ఒక సినిమా జయాపజయాలను ప్రభావితం చేసే శక్తి సోషల్‌ మీడియాకు ఉందా? ఎవరైనా కావాలని సోషల్‌ మీడియాలో ఇలాంటి పనులు చేస్తే ఏం చేయాలి? ఈ అంశాలపైనే ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

సినిమా విడుదలకు ముందు ఫ్యాన్స్‌ వార్స్‌ జరగటం మామూలే! కొన్ని సెటైర్లు.. కొన్ని నెగెటివ్‌ కామెంట్స్‌.. రికార్డులు తవ్వితీయ్యడాలు సోషల్‌ మీడియాలో జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఈ దాడులు మరింతగా పెరిగిపోయాయి. ఒకప్పుడు సినిమా విడుదలకు ముందు ఇంత హడావిడి ఉండేది కాదు. పైగా పత్రికలు, ఛానల్స్‌, వెబ్‌సైట్స్‌ సంఖ్య చాలా పరిమితంగానే ఉండేది. వాటిలో వచ్చే రివ్యూలు చాలా పాజిటివ్‌గానే ఉండేవి. సోషల్‌ మీడియా విస్తృతి బాగా పెరగటం.. అందరికీ ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావటంతో పరిస్థితులు మారాయి. ‘‘ఫ్యాన్స్‌ మధ్య వార్స్‌కు మేము వ్యతిరేకం కాదు. సరదాగా వచ్చే ట్రోల్స్‌కు కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ సినిమా విడుదల కాకముందే- సినిమా పోస్టర్‌ ముందు నిలబడి- సినిమా బాగోలేదని యూట్యూబ్‌ రివ్యూలు ఇవ్వటం ఇప్పటి దాకా జరగలేదు. అందుకే మేము వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులను అప్రోచ్‌ అయ్యాం. దీనికి కారణమయిన వారిని శిక్షించమని కోరాం’’ అని విజయ్‌ దేవరకొండ మేనేజర్‌ అనురాగ్‌ పర్వతనేని పేర్కొన్నారు. ఇలా రివ్యూలు ఇచ్చిన వారిని, వారి ఛానల్స్‌ను గుర్తించటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.

ప్రభావితం చేస్తున్నారు..

సాధారణంగా మన కంటే అమెరికాలో షోలు ముందుగా వేస్తారు. దీని వల్ల అమెరికాలో సినిమా చూసిన వారు వెంటనే రివ్యూలు పోస్ట్‌ చేస్తుంటారు. . ఈ రివ్యూలతో పాటుగా- బుక్‌మై షో వంటివి కూడా ప్రేక్షకుల దగ్గర నుంచి రేటింగ్స్‌ను కలెక్ట్‌ చేస్తూ ఉంటాయి. ఈ రెండింటిని నచ్చినట్లు నియంత్రించగలిగితే- దాని ప్రభావం కలెక్షన్లపై పడుతుంది. ఉదాహరణకు అమెరికాలో షో పూర్తయ్యే సమయానికి - మన దేశంలో షోలు పడుతూ ఉంటాయి. సినిమా బాగోలేదని ట్విట్టర్‌లో నెగెటివ్‌ రివ్యూలు వరసగా రావటం మొదలైతే - వాటి ప్రభావం ప్రేక్షకులపై పడుతుంది. సినిమాకు వెళ్లాలనుకున్నవారు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. మన దేశంలో షోలు పూర్తయిన తర్వాత నెగెటివ్‌ రివ్యూలు రావటం మొదలుపెడితే- సినిమా ప్లాప్‌ అనే భావన బాగా పెరుగుతుంది. కొందరు- బుక్‌మై షో వంటి అప్లికేషన్స్‌లో టిక్కెట్లు కొనుక్కొవాలనుకుంటారు. అలాంటి అప్లికేషన్లలో కూడా రేటింగ్స్‌ తక్కువ ఉంటే సినిమాకు వెళ్లరు. ‘‘గతంలో ‘గుంటూరు కారం’ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు మా ‘ఫ్యామిలీస్టార్‌’ విషయంలో కూడా అదే జరిగింది. కొందరు బోట్స్‌ ద్వారా తక్కువ రేటింగ్స్‌ ఇప్పిస్తున్నారు. ఉదాహరణకు ఒకే సారి పదివేల నెగెటివ్‌ రివ్యూలు వస్తే- సినిమా రేటింగే పడిపోతుంది’’ అని చెప్పారు అనురాగ్‌. ఈ విషయంపై తాము బుక్‌ మైషోకు ఒక ఉత్తరం రాశామని.. సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

అసలు కారణాలేమిటి?

ప్రస్తుతం తెలుగు సినిమాలకు విదేశాలలో మార్కెట్‌ బాగా పెరిగింది. అక్కడ మంచి కలెక్షన్లు వస్తే- సినిమాకు ఇబ్బంది ఉండదు. కానీ అక్కడ కలెక్షన్లలో కోత పడితే- నిర్మాతకు నష్టం వస్తుంది. దీనిని గమనించి కొందరు కావాలనే నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా బావుండనప్పుడు- ఎంత గొప్ప రివ్యూ రాసినా ప్రేక్షకులు వెళ్లరు. కానీ సినిమా బావున్నా- బాగోలేదని రివ్యూలు వస్తే- ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఈ సున్నితమైన అంశాన్ని కొంతమంది తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ‘‘సినిమా విడుదల సమయంలో నిర్మాత చాలా ఒత్తిడిలో ఉంటాడు. దాన్ని కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటారు అని సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్న ఒక నిర్మాత విశ్లేషించారు. ఒక ప్రముఖ వెబ్‌సైట్‌- అట్టర్‌ ప్లాప్‌ అయిన యాత్ర అనే సినిమాకు 4 రేటింగ్‌ను.. అదే సమయంలో విడుదలయిన గుంటూరు కారం సినిమాకు అతి తక్కువ రేటింగ్‌ను ఇచ్చింది. మనవాడైతే ఒక రేటింగ్‌.. కాకపోతే ఇంకో రేటింగ్‌.. ఇలాంటి సంఘటనలెన్నో’’ అంటారాయన.

పరిష్కారమేమిటి?

ఈ మధ్యకాలంలో ఈ తరహా సంఘటనలు పెరిగిపోతూ ఉండటంతో- ఛాంబర్‌ తరపున కొన్ని నియంత్రణ చర్యలు తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా గతంలో పోలీసు డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఉన్నత అధికారులతో కూడా చర్చలు జరిపారు. ‘‘ఇది ఒక విష సంస్కృతికి దారి తీస్తోంది. దీని వల్ల మొత్తం పరిశ్రమే దెబ్బతింటోంది. ఈ సారి నాకు నష్టం జరగవచ్చు. కానీ ఇదే కొనసాగితే ఇతరులకు కూడా నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ సంఘటితంగా ఉండాల్సిన అవసరముంది’’ అని దిల్‌రాజు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇదొక విష సంస్కృతి.. బావున్న సినిమాను కూడా బాగోలేదని ప్రచారం చేయటం.. కలెక్షన్లు రాకుండా అడ్డుకోవటం తగని పని. దీని వల్ల వ్యక్తుల కన్నా- సినీ పరిశ్రమకు ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ సమస్యను సృష్టిస్తున్నవారిని గుర్తించాలి. కఠినంగా శిక్షించాలి. ఈ సమస్యను అందరూ కలిసికట్టుగా ఎదుర్కొవాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది..

దిల్‌ రాజు

Updated Date - Apr 12 , 2024 | 05:44 AM