హేమ కమిటీ లాంటిది అవసరం లేదు
ABN , Publish Date - Sep 19 , 2024 | 07:01 AM
‘పరిశ్రమలో ఇప్పటివరకూ నేను లైంగిక వేధింపుల బారిన పడలేదు. నాకు తెలిసినంతవరకూ తమిళ చిత్రపరిశ్రమలో అలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవు. కాబట్టి మాలీవుడ్‌లో ఏర్పాటు చేసిన హేమ కమిటీ...
ఐశ్వర్యా రాజేశ్
‘పరిశ్రమలో ఇప్పటివరకూ నేను లైంగిక వేధింపుల బారిన పడలేదు. నాకు తెలిసినంతవరకూ తమిళ చిత్రపరిశ్రమలో అలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవు. కాబట్టి మాలీవుడ్‌లో ఏర్పాటు చేసిన హేమ కమిటీ లాంటిది కోలీవుడ్‌లో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను’ అని దక్షిణాది నటి ఐశ్యర్యా రాజేశ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె పై వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ నిజంగా ఎవరైనా లైంగిక వేఽధింపుల బారిన పడితే, దానికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి, మహిళల రక్షణే ముఖ్యం అని ఐశ్వర్య చెప్పారు.
మరో కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ తాను లైంగికవేధింపుల బారిన పడలేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నాను. నా చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండేదాన్ని. అప్రమత్తతో ఉండడం వల్లే నాకు వేఽధింపులు ఎదురుకాలేదు. మలయాళ చిత్రపరిశ్రమలో చాలా సినిమాలు చేశాను. అక్కడ మంచి వాతావరణమే ఉంది. పరిశ్రమలో కన్నా బయట ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. అక్కడ మహిళలకు రక్షణ కరవైందని’ శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు.
న్యాయం జరగాలి : అనసూయ
లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ఎవరికీ భయపడకుండా, వెంటనే బయటపెట్టాలని నటి అనసూయ సూచించారు. జానీ మాస్టర్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన మహిళా కొరియోగ్రాఫర్‌తో పలు సందర్భాల్లో కలసి పనిచేసినట్లు ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. ‘పుష్ప’ చిత్రం సెట్స్‌లో ఆమె పనితీరు చూశాను, ప్రతిభావంతురాలు అని కితాబునిచ్చారు. ఆమెకు న్యాయం జరగాలని అనసూయ ఆకాంక్షించారు. మహిళలపైన సానుభూతి చూపడానికి పరిమితం కాకుండా వారికిఅండగా నిలవాలని ఆమె ప్రజలను కోరారు.