మా మధ్య అసూయ లేదు

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:13 AM

తమిళ నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వెండితెరపై కలసి నటిస్తే చూడాలని కోరుకోని అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. ఈ నెల 12న విడుదలవుతున్న ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్‌లో ఉన్న కమల్‌ను....

తమిళ నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వెండితెరపై కలసి నటిస్తే చూడాలని కోరుకోని అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. ఈ నెల 12న విడుదలవుతున్న ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్‌లో ఉన్న కమల్‌ను.. ఓ ఆంగ్ల మీడియా విలేఖరి ‘ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత పాపులర్‌ నటులయిన మీ ఇద్దరూ కలసి నటించి ఎన్నో ఏళ్లు అవుతోంది. మళ్లీ మిమ్మల్ని ఒకే తెరపై చూసే అవకాశం ఉందా.. ఒకరి సినిమాల్లో ఒకరు కనిపించే ఆలోచనలు ఉన్నాయా?’ అని ప్రశ్నించారు. దీనికి కమల్‌ సమాధానమిస్తూ ‘మాది కొత్త కాంబినేషన్‌ అయితే కాదు. కెరీర్‌ కొత్తలో మేమిద్దరం ఎన్నో సినిమాల్లో కలసి నటించాం. ఆ సమయంలోనే ఇక కలసి ఒకే సినిమాలో కనిపించకూడదని నిర్ణయించుకున్నాం.


మేం ఇద్దరం ఏ విషయంలో పోటీపడలేదు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదు. అప్పుడూ.. ఇప్పుడూ. ఎందుకంటే మేం ఇద్దరం ఒకే గురువు కె.బాలచందర్‌ దగ్గర శిక్షణ పొందాం. మా మధ్య అసూయకు తావు లేదు. ఒకరి ఎదుగుదలను ఇంకొకరం స్పోర్టివ్‌గా తీసుకుని ముందుకు సాగుతున్నాం. ఇదే మా మధ్య ఉన్న బలమైన అనుబంధానికి నిదర్శనం. మాకు 20 ఏళ్లు ఉన్నప్పటి నుంచే ఇలాంటి అవగాహనతో కెరీర్‌లో ముందుకు సాగుతున్నాం’ అని రజనీతో ఉన్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. కాగా, కమల్‌,రజనీ కలసి దాదాపు 16 చిత్రాల్లో నటించారు. ఆఖరిగా, 1985లో తెరకెక్కిన అమితాబ్‌ బచ్చన్‌ చిత్రం ‘గిరఫ్తార్‌’లో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 03:13 AM