వైరముత్తుపై పోరాటంలో వెనుకడుగే లేదు

ABN , Publish Date - Sep 04 , 2024 | 03:33 AM

ఎన్ని బెదిరింపులు వచ్చినా, పరిశ్రమ బహిష్కరణ విధించినా వెరవకుండా దక్షిణాది చిత్ర సీమలో ‘మీటూ’ ఉద్యమానికి చుక్కానిలా నిలిచారు ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద. కొన్నేళ్లుగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా...

ఎన్ని బెదిరింపులు వచ్చినా, పరిశ్రమ బహిష్కరణ విధించినా వెరవకుండా దక్షిణాది చిత్ర సీమలో ‘మీటూ’ ఉద్యమానికి చుక్కానిలా నిలిచారు ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద. కొన్నేళ్లుగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో ఆమె మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ పాటల రచయిత వైరముత్తు చేతిలో తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని, ఆ కేసులో తాను ఇంకా పోరాడుతూనే ఉన్నానని తెలిపారు. ప్రముఖ గీత రచయిత, పద్మ పురస్కార గ్రహీత, సంగీత నాటక అకాడమీ సహా పలు జాతీయ పురస్కారల విజేత అయిన సెలబ్రిటీ చేతిలో తాను వే ధింపులకు గురయ్యానంటూ చిన్మయి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాతో పాటు మరికొందరు మహిళలు స్వయంగా మీడియా ముందుకు వచ్చి నోరు విప్పినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. న్యాయం కోసం ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతున్నట్లు చెప్పారు. దీన్ని తమిళ సినీ పెద్దలందరి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని నిరసన వ్యక్తం చేశారు. వైరముత్తుకు తమిళనాడులోని రాజకీయ పార్టీల అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే ఇన్నేళ్లైనా తనకు న్యాయం జరగలేదని ఆమె ఆరోపించారు. అతను ఎలాంటి వాడో అందరికీ తెలిసిందే, అయినా ఆయనపై చర్యలు తీసుకోకపోగా నన్నే బలిపశువును చేశార’ని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


‘తమిళ చిత్ర పరిశ్రమ నా పై కక్ష గట్టింది. అప్పటి డీఎంకే నేత, ఇప్పటి బీజేపీ నాయకుడు... డబ్బింగ్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ రాధారవి నాపై బహిష్కరణ వేటు వేశార ’ని చెప్పారు. ‘మెజారిటీ తమిళ సమాజం, నా తోటి సంగీత కళాకారులు సైతం తప్పంతా నాదే అన్నట్లు దుర్భాషలాడారు. అయినా వెనకడుగు వేయకుండా, వైరముత్తు వేధింపులపై ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాను. మున్ముందూ ఇది కొనసాగిస్తాను’ అని చిన్మయి చెప్పారు.

‘ప్రేమమ్‌’ హీరోపై అత్యాచారం కేసు

జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో పలువురు మాలీవుడ్‌ ప్రముఖులపై వరుసగా అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ‘ప్రేమమ్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు నివిన్‌ పౌలీపై అత్యాచారం కేసు నమోదైంది. ఓ నటి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాల్లో అవకాశం ఇస్తానని తనను దుబాయ్‌ తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ప్రాథమిక విచారణ పూర్తి చేసిన పోలీసులు నివిన్‌ సహా మరో ఆరుగురిపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు.


తప్పుగా అర్థం చేసుకున్నారు

తమిళ అగ్రహీరో రజనీకాంత్‌ను ‘జస్టిస్‌ హేమ కమిటీ గురించి మీ అభిప్రాయం చెప్పండి’ అని మీడియా కోరగా, ‘దాని గురించి నాకేం తెలియదు, క్షమించండి’ అని బదులిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కొంతమంది మీటూ ఉద్యమకారులు, నెటిజన్లు రజనీకాంత్‌ వైఖరిని తప్పుపట్టిన నేపథ్యంలో తమిళ నటి రాధికా శరత్‌కుమార్‌ ఆయన్ని వెనుకేసుకొచ్చారు. రజనీకాంత్‌కు నిజంగానే హేమ కమిటీ గురించి ఏమీ తెలియదనీ, అందుకే ఆయన దాని గురించి మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. ఆయన మౌనాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవడం బాధాకరమన్నారు.

చిన్మయి శ్రీపాద

Updated Date - Sep 04 , 2024 | 03:33 AM