OSCAR : గెలుపు గుర్రం ఓపెన్‌హైమర్
ABN , Publish Date - Mar 12 , 2024 | 05:50 AM
ప్రపంచ వ్యాప్తంగా సినీప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురు చూసే ఆస్కార్ అవార్డుల వేడుక ఆదివారం రాత్రి లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగింది. గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడులకు నిరసిస్తూ...
జీవితంలో ఒక్కసారైనా తళుక్కున మెరవాలని, ఒక్కసారైనా గెలిచి నిలవాలని సినీ కళాకారులు కలలు కనే వేదిక.. ఆస్కార్స్. ప్రారంభమై 96 ఏళ్లు గడిచినా ఈ అవార్డులకు ఉండే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా ప్రతి ఏడాది మరింత పెరుగుతోంది. గోల్డెన్ గ్లోబ్, బాఫ్తా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటివి ఎన్నున్నా ప్రపంచ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించేది ఆస్కార్ అవార్డులే. ఎప్పటిలాగే ఈ ఏడాదీ ఎన్నో చిత్రాలు, నటీనటులు, సాంకేతిక బృందాలు ఆస్కార్ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.
అంగరంగ వైభవంగా...
ప్రపంచ వ్యాప్తంగా సినీప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురు చూసే ఆస్కార్ అవార్డుల వేడుక ఆదివారం రాత్రి లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగింది. గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడులకు నిరసిస్తూ కొంతమంది ఆందోళనకారులు డాల్బీ థియేటర్ ముందు నినాదాలు చేస్తున్న నేపథ్యంలో ఆస్కార్ అవార్డుల సందడి మొదలైంది. గత ఏడాది ఇదే వేదికపై ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డ్ సాధించి, తెలుగు సినిమా సత్తా చాటింది. ఈసారి ఆస్కార్ అవార్డుల్లో భారతీయ సినిమా మెరుపులు ఏమీ లేవు. సినిమా విడుదలైన దగ్గర నుంచి వార్తల్లో నిలిచి అందరి దృష్టినీ ఆకట్టుకొన్న ‘ఓపెన్‌హైమర్’ చిత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు అవార్డులు సాధించి, చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితో సహా ఏడు అవార్డులు సొంతం చేసుకుంది. 53 ఏళ్ల క్రిస్టఫర్ నోలన్ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు రావడం కొత్త కాదు కానీ ఒక దర్శకుడిగా మాత్రం ఆయన ఈ అవార్డ్ అందుకోవడం ఇదే తొలిసారి. ‘ఓపెన్‌హైమర్’ చిత్రం కోసం మూడేళ్లు ఎంతో కష్డపడ్డారు నోలన్. 2020లో వచ్చిన ‘టెనెట్’ చిత్రం తర్వాత మరో సినిమా జోలికి పోకుండా ‘ఓపెన్‌హైమర్’ చిత్రం మీదే ప్రత్యేక దృష్టి పెటారు నోలన్. మరో విషయం ఏమిటంటే ఆయన రూపొందించిన తొలి బయోపిక్ ఇదే. ‘అమెరికన్ ప్రొమేథియస్’: ‘ద ట్రయంప్ ఆండ్ ట్రాజెడీ ఆప్ జె రాబర్ట్ ఓపెన్‌హైమర్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు నోలన్. మూడు గంటల రన్‌టైమ్‌తో ఆయన చిత్రాల్లో తొలి స్థానంలో నిలిచిన ‘ఓపెన్‌హైమర్’ లో కిలియన్ మర్ఫీ ముఖ్య పాత్ర పోషించారు. ఉత్తమ నటుడుగా ఆయన అవార్డ్ అందుకుంటూ భావోద్వాగానికి గురై ఈ అవార్డ్‌ను శాంతికాముకులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆస్కార్ అవార్డ్ పొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 24 నుంచి జియో సినిమాలో హిందీ, ఇంగ్లీష్ వెర్షన్స్‌లో ప్రేక్షకులు చూసే అవకాశం కల్పిస్తున్నారు.
ఉత్తమ నటుడు: కిలియన్ మర్ఫీ
టెలివిజన్ సిరీస్ పీకీ బ్లైండర్స్‌లో థామస్ షెల్బీగా కిలియన్ మర్ఫీ అందరికీ సుపరిచితమే. ఈ నటుడు క్రిష్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన బ్యాట్‌మెన్ ట్రయాలజీ, ఇన్‌సెప్షన్, డన్‌కిర్క్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. ఓపెన్‌హైమర్‌లో అణు బాంబు తయారు చేసిన థీరియాటికల్ ఫిజిసిస్ట్ జె రాబర్ట్ ఓపెన్‌హైమర్ పాత్రను పోషించారు మర్ఫీ. అణు బాంబు విస్పోటనం జరిగే సందర్భాల్లో ఆయన కనబరిచిన భావోద్వేగాలు గొప్పగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో కిలియన్ మర్ఫీ నటన సినీ ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా మిగిలిపోతుంది. ఉత్తమ నటుడిగా నిలిచిన కిలియన్ మర్ఫీ, ఆస్కార్ అందుకున్న తొలి ఐరిష్ సంతతి నటుడిగానూ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు కోసం కిలియన్ మర్ఫీతో బ్రాడ్లీ కూపర్ (మేస్ట్రో), కోల్మన్ డొమింగో (రస్టిన్) పాల్ జియామటి (ది హోల్డోవర్స్), జెఫ్రీ రైట్ (అమెరికన్ ఫిక్షన్)లు పోటీపడ్డారు.
ఉత్తమ నటి: ఎమ్మాస్టోన్
లాలా ల్యాండ్, అమేజింగ్ స్పైడర్ మ్యాన్, బర్డ్ మ్యాన్ వంటి సినిమాల్లో ఉత్తమ నటన కనబరిచి అందరినీ మెప్పించిన నటి ఎమ్మాస్టోన్. తాజాగా ఈమె ‘పూర్ థింగ్స్’ అనే చిత్రంలో తన నటనతో అందరి హృదయాలను గెలుచుకోవడమే కాక ఉత్తమ నటి అవార్డునూ కొల్లగొట్టింది. ఉత్తమ నటి పురస్కారానికి ఎమ్మాస్టోన్‌కు అన్నెతె బెన్నింగ్ (నయాడ్), లిల్లీ గ్లాడ్‌స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్), సాండ్రా హూల్లర్(అనాటమీ ఆఫ్ ఏ ఫాల్) నుంచి గట్టి పోటీ ఎదురైనా అవార్డును ఈ నటి ఎగరేసుకుపోవడం విశేషం.
వేదికపైకి నగ్నంగా..
సరిగ్గా 50 ఏళ్ల క్రితం జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో ఎలిజిబెత్ టైలర్‌ను వేదికపైకి ఆహ్వానించినప్పుడు ఓ వ్యక్తి హఠాత్తుగా నగ్నంగా వేదికపైకి వచ్చాడు. అప్పట్లో ఆ సంఘటన సంచలనం సృష్టించింది. మళ్లీ ఇన్నాళ్లకు 96వ అవార్డుల వేదికపైకి ఓ సూపర్‌స్టార్ అలా నగ్నంగా వచ్చి బెస్ట్ కాస్ట్యూమ్స్ డిజైనర్ అవార్డ్ విజేతను ప్రకటించడం విశేషం. ఆ సూపర్‌స్టార్ మరెవరో కాదు.. రెజ్లర్ జాన్ సీనా. నగ్నంగా వేదికపైకి రావడం తనకు ఇష్టం లేదని, మగవాడి శరీరం జోక్ కాదని ఆయన చెప్పారు. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్ అతని చేతికి ఓ కవర్ ఇచ్చి విజేత పేరు నువ్వే ప్రకటించు.. అని వెళ్లిపోయారు. ఆ కవర్ అడ్డం పెట్టుకుని నగ్నంగానే మైకు ముందుకు వచ్చి ఆ కవర్‌ను తను ఓపెన్ చేయలేనని చెప్పారు. అప్పుడు మళ్లీ జిమ్మీ వేదికపైకి వచ్చి విజేత పేరు ప్రకటించారు.
మంత్రముగ్థుల్ని చేసిన మెస్సీ
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అతిరథ మహారథులతో పాటూ ఆస్కార్ వేడుకల్లో మరో విశిష్ట అతిథి మెరిసింది. ఆ అతిథి ఎవరో కాదు.. ‘అనాటమీ అఫ్ ఏ ఫాల్’ చిత్రంలో నటించిన మెస్సీ అనే కుక్క. ఈ వేడుకకు ముస్తాబై వచ్చిన మెస్సీ తన సపోర్టింగ్ నేచర్‌తో అందర్నీ మంత్రముగ్థుల్ని చేసి మంచి మార్కులు కొట్టేసింది. అవార్డులను ఇస్తున్నప్పుడు డాల్బీ థియేటర్‌లోని ప్రేక్షకుల కరతాళధ్వనులు ఒక ఎత్తయితే.. విజేతలను అభినందిస్తూ మెస్సీ చేసిన హంగామా మరో ఎత్తు. వేడుకకు వచ్చిన ప్రముఖలంతా మెస్సీతో సెల్ఫీ దిగారు. ప్రతీ ఏడాదీ ఆస్కార్ వేడుకల్లో ఏదో ఒక విషయం హైలైట్‌గా నిలిచినట్లే.. ఈ ఏడాది మెస్సీ నిలిచిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఆస్కార్ వేదికపై మరోసారి మెరిసిన ఆర్‌ఆర్‌ఆర్
దర్శకదిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందడమే కాకుండా ఇందులోని ‘నాటునాటు’ పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఎన్నికై ప్రతి తెలుగు వాడు కాలర్ ఎగరేసేలా చేసింది. ఈ సినిమాతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ గ్లోబర్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. విదేశాల్లోనూ అభిమానుల సంఖ్య పెంచుకున్నారు. కోట్లాదిమంది భారతీయుల కలను నిజం చేసిన ‘నాటునాటు’ పాటను తాజా ఆస్కార్ అవార్డ్స్ వేదిక మరోసారి గుర్తు చేసింది. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్‌ను ప్రకటించే క్రమంలో తెరపై ‘నాటునాటు’ పాట బిట్‌ను ప్రదర్శించేసరికి టీవీలు చూస్తున్న భారతీయ ప్రేక్షకులు ఆనందపరవశులై నృత్యాలు చేశారు. అలాగే ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించి ఓ వీడియో ప్రదర్శిస్తూ అందులో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని రెండు యాక్షన్ షాట్స్ ప్రదర్శించడం మన సినిమాకు మరోసారి దక్కిన గౌరవం.
ఉత్తమ దర్శకుడు: క్రిస్టఫర్ నోలన్
అనూహ్యమైన చిత్ర కథనాలతో ప్రేక్షకుల మెదడుకు పదును పెట్టి, వారిని సంభ్రమాశ్యర్యాల్లో ముంచెత్తే దర్శకుడు క్రిస్టఫర్ నోలన్. ఆయన తెరకెక్కించిన చిత్రాలు వేటికవే విభిన్నంగా నిలుస్తుంటాయి. ప్రతీ చిత్రానికి ఒక సరికొత్త జానర్‌ను ఎన్నుకుని దానిని మరింత నూతనంగా తెరపై ఆవిష్కరించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇప్పటివరకూ సినీ చరిత్రలో నిలిచిపోయే ఎన్నో చిత్రాలను ఆందించిన ఆయన తొలిసారి ఈ అవార్డును అందుకోవడం విశేషం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణు బాంబు తయారు చేసిన థీరియాటికల్ ఫిజిసిస్ట్ జె రాబర్ట్ ఓపెన్‌హైమర్ అనే వ్యక్తి జీవిత కథ ‘అమెరికన్ ప్రొమేథియస్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నోలన్. ఆయన దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తొలి బయో పిక్ ఇదే కావడం మరో ఆసక్తికర విషయం. ఉత్తమ దర్శకుడు విభాగంలో జస్టిన్ ట్రిఎట్ (అనాటమీ ఆఫ్ ఏ ఫాల్), మార్టిన్ స్కోర్స్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్), యోర్గోస్ లాంతిమో్‌స(పూర్ థింగ్స్), జొనాతన్ గ్లేజర్ (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్) పోటీగా నిలిచారు.
ఉత్తమ ఇంటర్నేషనల్ చిత్రం: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
మార్టిన్ అమిస్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ హిస్టారికల్ డ్రామాను జొనాథన్ గ్లేజర్ తెరకెక్కించారు. ‘‘మనం తీసుకున్న నిర్ణయాలు మన జీవితాలని ప్రతిబింబిస్తాయి’’ అని అవార్డు అందుకునేటప్పుడు ఈ చిత్ర దర్శకుడు అన్నారు. 1943లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ కాన్‌సన్‌ట్రేషన్ క్యాంపులో (హాలోకాస్ట్) జరిగిన ఆరాచకాలను ఓ కుటుంబ కథ నేపథ్యంగా ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
నితిన్ దేశాయ్‌కు నివాళి
అంతకుముందు సంవత్సరంలో మరణించిన సినీ ప్రముఖులను ప్రస్తుతం జరుగుతున్న వేడుకలో స్మరించుకుని నివాళి ఘటించడం ఆస్కార్ ఫంక్షన్‌లో ఓ సంప్రదాయం. దానిని పాటిస్తూ గత ఏడాది మరణించిన ఆర్ట్ డైరెక్టర్, నిర్మాత నితిన్ చంద్రకాంత్‌దేశాయికి నివాళులు అర్పించింది ఆస్కార్ వేదిక. మూడు పదుల తన సినీ జీవితంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘లగాన్’ చిత్రంతో సహా పలు భారీ చిత్రాలకు నితిన్ దేశాయి కళాదర్శకుడిగా పనిచేశారు. ఆయన గొప్పతనాన్ని, పని చేసిన చిత్రాల గురించి వివరిస్తూ ఓ వీడియోను ఆస్కార్ వేదిక తెరపై ప్రదర్శించారు.
భారతీయ చిత్రానికి నిరాశ
భారత సంతతికి చెందిన కెనడియన్ ఫిల్మ్‌మేకర్ నిషా పహుజా దర్శకత్వం వహించిన ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రానికి ఆస్కార్ వేడుకలో నిరాశ ఎదురైంది. మన దేశం నుంచి ఈ ఏడాది నామినేషన్ పొందిన ఏకైక చిత్రం ఇదే. 13ఏళ్ల నిషా అనే చిన్నారికి జరిగిన అన్యాయంపై పోరాడిన తల్లిదండ్రుల కథే ఈ చిత్రం .జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రం కచ్చితంగా అవార్డును తెస్తుందన్న నమ్మకం కలిగించింది. అయితే ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం విభాగంలో ‘20 డేస్ ఇన్ మరియాపోల్’ అనే చిత్రం పోటీగా నిలిచి అవార్డ్ గెలుచుకోవడంతో ‘టు కిల్ ఏ టైగర్’ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఉక్రెయిన్ ఫిల్మ్‌మేకర్, జర్నలిస్ట్ మిస్టిస్లావ్ చెర్నోవ్ ‘20 డేస్ ఇన్ మరియాపోల్’ చిత్రాన్ని రూపొందించారు. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత 20 రోజుల పాటు మారియో పోల్ సిటీలో జరిగిన సంఘటనలే ఈ చిత్ర కథాంశం. ‘‘ఇది ఉక్రెయిన్ చరిత్రలోనే తొలి ఆస్కార్ అవార్డు అనుకుంటా. ఉక్రెయిన్ మీద రష్యా దాడులు విరమించుకుంటే ఈ ఆస్కార్ అవార్డు వారికివ్వటానికి సిద్ధం’’ అని ప్రకటించారు మిస్టిస్లావ్.