ఈ గడ్డ కోసం పోరాడిన వాళ్ల కథ
ABN , Publish Date - Feb 13 , 2024 | 06:01 AM
‘ఎంతో మంది త్యాగాలు చేస్తే మనం ఈ రోజు ప్రశాంతంగా ఉన్నాం. ముఖ్యంగా సర్దార్ వల్లభ బాయ్ పటేల్ లేకపోతే మనం ఈ రోజు ఇలా ఉండేవాళ్లం కాదు. చరిత్రను ఇలా దృశ్యరూపంలో చూపిస్తే మరింత అర్థమవుతుంది...
‘ఎంతో మంది త్యాగాలు చేస్తే మనం ఈ రోజు ప్రశాంతంగా ఉన్నాం. ముఖ్యంగా సర్దార్ వల్లభ బాయ్ పటేల్ లేకపోతే మనం ఈ రోజు ఇలా ఉండేవాళ్లం కాదు. చరిత్రను ఇలా దృశ్యరూపంలో చూపిస్తే మరింత అర్థమవుతుంది. ఈ ట్రైలర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నా శిష్యుడు సత్యనారాయణ అద్భుతంగా సినిమా తీశాడు. సుద్దాల అశోక్ తేజ రక్తంతో పాటలు రాస్తారా అనిపిస్తుంది. ‘రజాకార్’ చిత్రం విజయం సాధించాలి’ అన్నారు సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన ‘రజాకార్’ చిత్రం మార్చి ఒకటిన విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. దర్శకుడు యాటా సత్యనారాయణ మాట్లాడుతూ ‘ఇటువంటి సినిమాలు తీస్తున్నప్పుడు బెదిరింపు కాల్స్, నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయి. అయినా లెక్క చేయకుండా మా చరిత్ర, మా పూర్వీకుల బాధలు, త్యాగాలు, ఈ గడ్డ కోసం పోరాడిన వాళ్ల గురించి చెప్పడానికే ఈ సినిమా తీశాను. ప్రపంచంలో అణిచివేతకు గురైన ప్రతి ఒక్కరికీ ‘రజాకార్’ చిత్రం అంకితం. రజాకార్లు చేసిన అన్యాయాన్ని చెప్పడానికే ఈ సినిమా తీశాం’ అన్నారు. ‘సెప్టెంబర్ 17 ప్రాముఖ్యం గురించి చాలా మందికి తెలీదు. మళ్లీ రజాకార్లు పుట్టొద్దు. అందుకే ఆ చరిత్రను చరిత్రగానే తీశాం. ఈ సినిమా కోసం ఎంతో ఖర్చు పెట్టాం. మూడు రెట్లు బడ్జెట్ పెరిగినా, నా ఆస్తులు అమ్మి అయినా మన చరిత్రను అందరికీ చూపించాలని ‘రజాకార్’ చిత్రాన్ని తీశాం’ అని తెలిపారు నిర్మాత గూడురు నారాయణరెడ్డి. ఇటువంటి చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉందని అనసూయ చెప్పారు. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే తదితరులు నటించిన ‘రజాకార్’ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠి భాషల్లో విడుదల చేస్తున్నారు.