కామన్ మ్యాన్ కథ
ABN , Publish Date - Oct 29 , 2024 | 02:06 AM
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించారు. ఈనెల 31న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో...
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించారు. ఈనెల 31న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు నటి మీనాక్షి చౌదరి. ‘1980 -90 నేపథ్యంలో సాగే కథ. ఈ మూవీలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఇందులో నేను మధ్య తరగతి గృహిణిగా నటించా. సవాల్ విసిరిన పాత్ర ఇది. డబ్బు కారణంగా మధ్యతరగతి మనిషి జీవితంలో, అతని కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే దాని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నేను మొదటిసారి తల్లి పాత్ర పోషించాను. ఇది నాకు కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించింది. నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకొని, అందుకు తగ్గట్టుగా పాత్రలో ఒదిగిపోయాను. ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది. ఫలానా పాత్రే చేయాలి...నా వయసుకు తగ్గ పాత్రలే చేయాలనే రూల్ పెట్టుకోలేదు. మంచి సినిమాలో భాగం కావాలి. దక్కిన పాత్రకు న్యాయం చేయాలి. ఇదే మొదటి నుంచి నేను ఫాలో అయ్యేది.
మొదటి నుంచి నా ఆలోచన ఏంటంటే మంచి కథలు చేయాలి, మంచి టీమ్‌తో పనిచేయాలి. వయసుకు తగ్గ పాత్రలే చేయాలనే పరిమితిని నటులు పెట్టుకోకూడదు. ఒకే తరహా పాత్రలు చేస్తే నటులకే కాదు, ప్రేక్షకులకు కూడా బోర్ కొడుతుంది. అందుకే నటిగా పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపించాలని అనుకుంటున్నాను. అందుకు తగ్గట్టుగానే సినిమాలను ఎంచుకుంటున్నా. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. భాస్కర్ దగ్గర ఏమీ లేనప్పుడు తనని తనుగా ఇష్టపడుతుంది సుమతి. ప్రేమను పంచే కుటుంబం, బతకడానికి అవసరమైన డబ్బు ఉంటే చాలు అనుకునే స్వభావం తనది. అయితే దురాశ, డబ్బు కారణంగా భాస్కర్-సుమతి మధ్య ఏం జరిగిందనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. చిత్రంలో ఎమోషన్స్ బాగుంటాయి, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరికీ సినిమా కనెక్ట్ అవుతుంది. ఇదొక కామన్ మ్యాన్ కథ. ఈ సినిమాతో నాకు నటిగా మంచి గుర్తింపు వస్తుందని, మరిన్ని మంచి కథలు వస్తాయని భావిస్తున్నా’ అని చెప్పారు మీనాక్షి చౌదరి.