అన్ని రంగాల్లో ఉన్నదే సినీ పరిశ్రమలోనూ జరుగుతోంది
ABN , Publish Date - Sep 01 , 2024 | 05:39 AM
‘సమాజంలో సినీరంగం కూడా ఒక భాగం. అన్ని రంగాల్లో ఉన్నట్లే సినీ రంగంలోనూ లైంగిక వేధింపులు ఉన్నాయి. పరిశ్రమలో తలెత్తే ప్రతి సమస్యకు బాధ్యత వహించాల్సిన అవసరం అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టి్‌స్ట్స)కు లేదు’...
లైంగిక వేధింపులపై మోహన్‌లాల్ స్పందన
నేనెవరికీ వత్తాసు పలకలేదు
‘సమాజంలో సినీరంగం కూడా ఒక భాగం. అన్ని రంగాల్లో ఉన్నట్లే సినీ రంగంలోనూ లైంగిక వేధింపులు ఉన్నాయి. పరిశ్రమలో తలెత్తే ప్రతి సమస్యకు బాధ్యత వహించాల్సిన అవసరం అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టి్‌స్ట్స)కు లేదు’ అని మలయాళ అగ్రహీరో మోహన్‌లాల్ అన్నారు. ‘అమ్మ’కు రాజీనామా చేశాక శనివారం ఆయన తొలిసారి మీడియా ముందుకొచ్చారు. ‘హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం, కేరళ ప్రభుత్వం, పోలీసులు నివేదికపై దర్యాప్తు చేస్తున్నందువల్ల నిజం తేలేవరకూ ఓపికపట్టాలి, పరిశ్రమ పేరును చెడగొట్టొద్దు’ అని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. ‘ఫిల్మ్ ఇండస్ట్రీలోని పవర్ గ్రూప్ గురించి నాకు తెలియదు. ఇలాంటిది ఒకటుందని హేమ కమిటీ చెబితేనే విన్నాను. ఏ పవర్ గ్రూప్‌తోనూ నాకు సంబంధం లేదు. సినీ పెద్దలకు అండగా నిలుస్తున్నట్లు నాపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాల్సిందే, ఆ విషయంలో పోలీసులకు సహకరిస్తాం’ అని స్పష్టం చేశారు. పరిశ్రమలో ఎన్నో అసోషియేషన్లు ఉండగా, ఏం జరిగినా ‘అమ్మ’పైన రుద్దేప్రయత్నం చేస్తుండడం దురదృష్టకరమన్నారు. మహిళలపై వే ధింపుల విషయంలో మొత్తం చిత్ర పరిశ్రమ బాధ్యత తీసుకోవాలి కానీ కావాలనే అమ్మను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.
‘వేలాది మందికి ఉపాధిని కల్పిస్తోన్న మలయాళ చిత్ర పరిశ్రమ కుటుంబం లాంటిది. దయచేసి దాన్ని లక్ష్యంగా చేసుకోవద్దు. పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందరూ సంయమనం పాటించాలి’ అని మోహన్‌లాల్ కోరారు. ‘అమ్మ’ కార్యవర్గం రాజీనామా వైఫల్యం కాదు, బాధ్యతల నుంచి మేం పారిపోలేదు. మా స్థానంలో కొత్త కార్యవర్గం వచ్చి అమ్మను సమర్థవంతంగా నడుపుతుంది’ అని తెలిపారు. బాధ్యతల నుంచి నేనెప్పుడూ పారిపోలేదు, అత్యవసర పనుల వల్ల ఇప్పటివరకూ మీడియా ముందుకు రాలేకపోయాను అని మోహన్‌లాల్ చెప్పారు.
సీక్రెట్ కెమెరాలు పెట్టారు - నటి రాధిక ఆరోపణ
మాలీవుడ్‌లో కేరవాన్‌లలో రహస్య కెమెరాలు అమర్చి హీరోయిన్లు దుస్తులు మార్చటాన్ని వీడియో తీసిన ఘటనలు జరిగాయని, అలాంటి వీడియోలను సినీ యూనిట్ సభ్యులు వీక్షించడాన్ని తాను స్వయంగా గమనించానని సీనియర్ సినీనటి రాధిక శరత్‌కుమార్ ఆరోపించారు. కేరవాన్‌లలో కెమెరాలు అమర్చుతున్నారని తెలిసిన తర్వాత తాను హోటల్ గదుల్లో దుస్తులు మార్చుకున్నానని చెప్పారు. ఆమె ఓ తమిళ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ విధానమే సక్రమంగా లేదని, మగవారెవరూ హీరోయిన్లకు, నటీమణులకు మద్దతుగా మాట్లాడటం లేదని వాపోయారు. హీరోయిన్ల గది తలుపులు తట్టే పరిస్థితులు అన్ని సినీ విభాగాల్లో ఉన్నాయన్నారు. లైంగిక వేధింపులను ఎదుర్కొనే ధైర్యాన్ని మహిళలు మరింత పెంచుకోవాలని ఆమె సూచించారు.
నాకు ఎవరూ ఫొటోలు పంపలేదు
సజీర్ అనే వ్యక్తి నగ్న చిత్రాలను పోన్‌లో చిత్రీకరించి వాటిని నటి రేవతికి పంపినట్లు మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సినిమాల్లో అవకాశం ఇస్తానని తనపై దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ లైంగిక దాడికి పాల్పడినట్లు సజీర్ అనే వ్యక్తి ఇటీవలే ఆరోపించాడు. ఆ సంఘటన జరిగిన రోజు నటి రేవతి కూడా హోటల్ రూమ్‌లో ఉన్నట్లు రంజిత్ చెప్పినట్లు సజీర్ తెలిపాడు. ఈ ఆరోపణలపై రేవతి స్పందించారు. మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తనకు ఎవరూ ఎలాంటి ఫొటోలను పంపలేదని స్పష్టం చేశారు. మరోసారి దీని గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని రేవతి పేర్కొన్నారు.