Tollywood: సినిమా కొంపముంచిన రాజకీయం, 40 ఏళ్లలో ఇదే వరస్ట్

ABN , Publish Date - May 15 , 2024 | 04:07 PM

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నెలలముందే ప్రకటించడంతో చాలామంది ఆ అభ్యర్థుల ప్రచారానికి వెళ్ళిపోవటం, దానికి తోడు ఐపీఎల్ కూడా అదే సమయంలో ఉండటం వలన, ప్రేక్షకులు సినిమా హాల్స్ కి రాకపోవటానికి ప్రధాన కారణాలు. గత 40 ఏళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం సినిమా థియేటర్స్ కి ప్రేక్షకుల రాకపోవటం వరస్ట్ అని చెప్పారు ప్రసన్న కుమార్.

Tollywood: సినిమా కొంపముంచిన రాజకీయం, 40 ఏళ్లలో ఇదే వరస్ట్
Single screen theaters are closing for few days in Telangana and Andhra

ఐపీఎల్ క్రికెట్ గత కొన్ని సంవత్సారాలుగా ఉందని, అయితే ఈసారి క్రికెట్ కు ఎన్నికలు కూడా తోడయ్యాయని అందువలన ప్రేక్షకులు సినిమా చూడటానికి సినిమా హాలుకు రావటం తగ్గించేశారని చెపుతున్నారు ప్రసన్న కుమార్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ. మామూలుగా ఎన్నికల్లో అభ్యర్థులను కొన్ని రోజుల ముందు ప్రకటిస్తారు, కానీ ఈసారి కొన్ని నెలలముందు ప్రకటించడంతో, ప్రతి అభ్యర్థి తమ ప్రచారానికి చాలామందిని తీసుకువెళ్లి, వాళ్ళకి రోజువారీ వేతనం ఇచ్చారని, చాలామంది అటువైపు మొగ్గు చూపారని, అందువలన ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పారు ప్రసన్న కుమార్. రెండు రాష్ట్రాల్లో ప్రజలకి రాజకీయాలతో ఎక్కువ ముడిపడి ఉండటం వలన అటువైపు ఎక్కువమంది వెళ్లారని, అందువలన ప్రేక్షకుల సంఖ్య బాగా పడిపోయిందని చెప్పారు.

కొన్ని పెద్ద సినిమాలు 'కల్కి 2898 ఏడి', 'దేవర', 'డబుల్ ఇస్మార్ట్', 'పుష్ప' లాంటి సినిమాలు వాయిదా పడటం జరిగిందని, అందువలన సినిమా హాల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయని చెప్పారు. ఐపీఎల్, ఎన్నికలు కలిసి రావటం ప్రధాన కారణం అయిందని చెప్పారు ప్రసన్న. అయితే ఈ సంవత్సరం వచ్చినంత దారుణంగా ఎన్నడూ లేదని అన్నారు. "నేను గత నలభై సంవత్సరాల నుండి చూస్తున్నాను, ఈ సంవత్సరం వచ్చినంత వరస్ట్ పరిస్థితి ఎప్పుడూ రాలేదు," అని చెప్పారు ప్రసన్న.

sudharshanone.jpg

ఆంధ్రాలో చాలా సినిమా హాల్స్ ఎప్పుడో మూసేశారని, అయితే వారు అధికారికంగా చెప్పలేదని కూడా ప్రసన్న చెప్పారు. "ఈమధ్యకాలంలో చాల చిన్న సినిమాలు విడుదలయ్యాయి, అయితే ప్రేక్షకులు లేక 'నో షో' అని పెట్టేవారు, అంటే అక్కడ షో లేనట్టే కదా, అలా చాలా సినిమా హాల్స్ కొన్నిసార్లు షో వెయ్యకుండా మూసేసారు," అని చెప్పారు ప్రసన్న. ఒక్క ఆంధ్ర, తెలంగాణాలో మాత్రమే ఈ సమస్య రాలేదని, ముంబై లో కూడా ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పారు ప్రసన్న.

ఇవన్నీ ఒక ఎత్తయితే, సినిమా టికెట్ ధరలు విపరీతంగా పెరగటం, దానికితోడు సినిమా హాల్స్ లో తినుబండారాల ధరలు కూడా ఎక్కువ అవటంతో, సామాన్య ప్రేక్షకుడు సినిమా హాల్ లో సినిమా చూడటానికి దూరం అయ్యారు అని చెప్పారు. టికెట్ ధరలు పెంచి సామాన్య ప్రేక్షకుడిని దూరం చేసుకున్నామని, డబ్బులుండేవాళ్లు వారి స్నేహితులతో హోమ్ థియేటర్ అంటూ ఇంట్లోనే స్నేహితులతో చూస్తున్నారని, ఇలా చాలామంది ప్రేక్షకులని పరిశ్రమ దూరం చేసుకుందని చెప్పారు ప్రసన్న.

సింగిల్ స్క్రీన్ థియేటర్ వున్న యజమానికి కరెంటు బిల్లు చాలా ఎక్కువ వస్తోందని, ఎందుకంటే థియేటర్ లో షో వేసినా, వేయకపోయినా బిల్లు కట్టేయాలని, అది యజమాని భరించటం కష్టంగా ఉంటోందని చెప్పారు. కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కరెంట్ బిల్లుల గురించి మాట్లాడమని, ముఖ్యమంత్రి అప్పుడు సానుకూలంగా మాట్లాడరారని, ఈ ఎన్నికలు అయిన తరువాత ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావిస్తామని చెప్పారు ప్రసన్న. వీటన్నిటికీ తోడు రెండు రాష్ట్రాల్లో థియేటర్ యజమానులు, సినిమా డిజిటల్ ప్రింట్ కోసమని క్యూబ్ కి అద్దె కట్టాల్సి ఉంటుందని, అది చాలా ఎక్కువగా ఉందని అది కూడా సినిమాల్స్ మూసివేతకు ఒక కారణం అని చెప్పారు ప్రసన్న. ఇన్ని కారణాలతో ఈసారి సింగిల్ స్క్రీన్ సినిమా హాల్స్ కొన్ని రోజులపాటు మూసివేశారు, అయితే మళ్ళీ ఒక పెద్ద సినిమా పడితే అన్నీ సర్దుకుపోతాయని కూడా చెపుతున్నారు.

-- సురేష్ కవిరాయని

Updated Date - May 16 , 2024 | 10:50 AM