తొలి తెలుగు కామెడీ కిడ్‌ స్టార్‌ విశ్వేశ్వరరావు ఇక లేరు

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:08 AM

ప్రముఖ హాస్య నటుడు జి.విశ్వేశ్వరరావు (64) కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయన కు సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టు ఆయన పెద్ద కుమార్తె భార్గవి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు...

తొలి తెలుగు కామెడీ కిడ్‌ స్టార్‌ విశ్వేశ్వరరావు ఇక లేరు

ప్రముఖ హాస్య నటుడు జి.విశ్వేశ్వరరావు (64) కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయన కు సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టు ఆయన పెద్ద కుమార్తె భార్గవి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఆయన అంత్యక్రియలను మంగళవారం పూర్తి చేశారు. ఆయనకు భార్య వరలక్ష్మి, కుమార్తెలు భార్గవి, పూజ ఉన్నారు. తమిళం, తెలుగు భాషల్లో దాదాపు 350కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన స్వస్థలం కాకినాడ. 1967లో చెన్నైకు వచ్చిన ఆయన బాల నటుడుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. మాస్టర్‌ రాము, బేబి రాణి, మాస్టర్‌ ప్రభాకర్‌ వంటి బాల నటులు ఎక్కువ సినిమాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంటున్న తరుణంలో ప్రవేశించిన మాస్టర్‌ విశ్వేశ్వరరావు కొద్ది కాలంలోనే తన ప్రతిభ చాటుకున్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కాంతారావు, హరనాథ్‌, జగ్గయ్య వంటి వారు హీరో పాత్రలు చేస్తుంటే రేలంగి, పద్మనాభం, చలం, రాజబాబు హాస్య పాత్రలు పోషించేవారు. ఈ హాస్య నటుల చిన్నప్పటి వేషాలు విశ్వేశ్వరరావు వేసేవారు. బాల తారలతో తీసిన ‘బాల భారతం’లో విశ్వేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. తెలుగు సినిమాల వరకూ తొలి కామెడీ కిడ్‌ స్టార్‌ ఈయనే. చిన్నప్పుడు హాస్య నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నారో పెరిగి పెద్దయ్యాక ఆ స్థాయిలో గుర్తింపు పొందలేక పోయారు. ‘ముఠామేస్త్రి’, ‘ప్రెసిడెంట్‌గారి పెళ్లాం’, ‘ఆయనకు ఇద్దరు’, ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’, ‘రిక్షావోడు’ వంటి చిత్రాల్లో ఏవో చిన్న వేషాలు వేశారు కానీ పూర్తి స్థాయి కమెడియన్‌గా ఆయన నిలదొక్కుకోలేక పోయారు. సినిమాల్లోనే కాకుండా, అనేక టీవీ సీరియల్స్‌లో కూడా విశ్వేశ్వరరావు నటించారు.. అవకాశాలు తగ్గిన సమయంలో సొంతంగా ‘విస్సు టాకీస్‌ పేరుతో యూ ట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహిస్తూ తన అనుభవాలను వివరించేవారు.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Apr 03 , 2024 | 03:08 AM