రాజకీయ నేపథ్యంలో సినిమా చేస్తా

ABN , Publish Date - Nov 02 , 2024 | 07:03 AM

‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటించిన హ్యాట్రిక్‌ చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌.

‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటించిన హ్యాట్రిక్‌ చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అక్టోబరు 31న విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ లభించింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. నాగవంశీ మాట్లాడుతూ‘సోషల్‌ మీడియాలో ఎక్కడా సినిమా గురించి ఒక్క నెగెటివ్‌ కామెంట్‌ కూడా కనిపించలేదు. అందుకే ప్రేక్షకులకు థాంక్స్‌ చెప్పేందుకు మీడియా ముందుకి వచ్చాం. థాంక్స్‌ అనేది చాలా చిన్న మాట. సినిమా పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలుగుతోంది. బాలకృష్ణ ‘ఎన్‌బికె 109’ టీజర్‌, విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్‌ వారం రోజుల్లో ఇస్తాం. ప్రస్తుతం మా బేనర్‌లో పలు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఒక భారీ రాజకీయ నేపథ్యమున్న సినిమా చేసే ఆలోచన ఉంది’ అని అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘ప్రీమియర్‌ షోల నుంచే సినిమాకి ఎంతో మంచి టాక్‌ వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా ఇంత మంచి పేరు రావడం చాలా అరుదైన విషయం. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని సినిమా చూసిన ప్రేక్షకులు సంతృప్తి చెందుతున్నారు. సంభాషణలకు మంచి పేరు వస్తుండటం సంతోషంగా ఉంది. మణిరత్నం, త్రివిక్రమ్‌ స్ఫూర్తితోనే నేను సినీ పరిశ్రమలోకి వచ్చాను. నా సంభాషణల్లో త్రివిక్రమ్‌ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.’ అని అన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 07:03 AM