అబ్బురపరిచే చందమామకథలా విశ్వంభర

ABN , Publish Date - Jan 05 , 2024 | 07:04 AM

చిరంజీవి సినిమా అంటే విందుభోజనంలా ఉండాలి. పిల్లల దగ్గర్నుంచి పెద్దలదాకా అందరికీ నచ్చేలా ఉండాలి. పాటలు, డాన్సులు, ఫైట్లు, కథ, కథనం, కామెడీ అన్నీ ఓ రేంజ్‌లో ఉండాలి...

అబ్బురపరిచే చందమామకథలా విశ్వంభర

చిరంజీవి సినిమా అంటే విందుభోజనంలా ఉండాలి. పిల్లల దగ్గర్నుంచి పెద్దలదాకా అందరికీ నచ్చేలా ఉండాలి. పాటలు, డాన్సులు, ఫైట్లు, కథ, కథనం, కామెడీ అన్నీ ఓ రేంజ్‌లో ఉండాలి. మొత్తంగా ఓ చందమామకథలా ఉండాలి. చిరంజీవిని జగదేకవీరుడిగా చూపిస్తేనే జనం ఇష్టపడతారు. అప్పుడే అది పూర్తిస్థాయి చిరంజీవి సినిమా. దర్శకుడు వశిష్ఠ ఈ విషయాన్ని పూర్తిగా అవగతం చేసుకొని తయారు చేసుకున్న కథే ‘విశ్వంభర’. అబ్బురపరిచే చందమామకథలా ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. యముడుకి మొగుడు, జగదేకవీరుడు-అతిలోకసుందరి, అంజి గతంలో చిరంజీవి చేసిన ఫాంటసీ చిత్రాలు. వాటిని మించే స్థాయిలో, ఊహించని మలుపులతో ఊహకందని కేరక్టరైజేషన్స్‌తో మరోలోకంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం. అందుకే అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. సునీల్‌ ప్రత్యేకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా ఎంపికయ్యారు. కథానుగుణంగా ఇంకొందరు కథానాయికలు ఈ సినిమాకు అవసరం. వారి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఇందులో విలన్‌గా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నటించనున్నాడు. సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్న విషయం తెలిసిందే.

డిప్యూటీ సీఎం భట్టితో చిరంజీవి భేటీ

సినీ నటుడు చిరంజీవి గురువారం డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ప్రజాభవన్‌కు వెళ్లి, భట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. కశ్మీర్‌ నుంచి తెప్పించిన శాలువాతో భట్టిని సత్కరించారు. చిరంజీవి దంపతులకు డిప్యూటీ సీఎం పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు.

Updated Date - Jan 05 , 2024 | 09:43 AM