రాజధాని ఫైల్స్‌కు తాత్కాలిక బ్రేక్‌

ABN , Publish Date - Feb 16 , 2024 | 05:50 AM

రాజధాని ఫైల్స్‌ సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు హైకోర్టు గురువారం ప్రకటించింది. నిబంధనల ప్రకారం తగిన కారణాలు పేర్కొని సినిమా విడుదలకు రివైజ్‌ కమిటీ సర్టిఫికెట్‌...

రాజధాని ఫైల్స్‌కు తాత్కాలిక బ్రేక్‌

  • రికార్డులు పరిశీలించాలి.. వాటిని మా ముందు ఉంచండి

  • సీబీఎ్‌ఫసీ, రివైజింగ్‌ కమిటీ అధికారులకు హైకోర్టు ఆదేశం

  • విచారణ నేటికి వాయిదా

రాజధాని ఫైల్స్‌ సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు హైకోర్టు గురువారం ప్రకటించింది. నిబంధనల ప్రకారం తగిన కారణాలు పేర్కొని సినిమా విడుదలకు రివైజ్‌ కమిటీ సర్టిఫికెట్‌ ఇచ్చిందా.. లేదా అనేది పరిశీలించాల్సి ఉందని అభిప్రాయపడింది. సినిమాకు సంబంధించి ఎగ్జామినింగ్‌ కమిటీ, రివైజింగ్‌ కమిటీల వద్ద ఉన్న రికార్డులను ఈ నెల 16లోగా కోర్టు పరిశీలనకు ఉంచాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ (సీబీఎ్‌ఫసీ), రివైజింగ్‌ కమిటీ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ను ఆదేశించింది. సినిమా విడుదలైతే పూడ్చుకోలేని నష్టం జరుగుతుందన్న పిటిషనర్‌ వాదనను పరిగణలోకి తీసుకొని సినిమా ప్రదర్శనపై శుక్రవారం వరకు స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. రికార్డులు కోర్టు ముందు ఉంచేందుకు వీలుగా విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చేలా రాజధాని ఫైల్స్‌ సినిమాను తీశారని, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ (సీబీఎ్‌ఫసీ) ధృవపత్రాన్ని రద్దు చేయాలని కోరతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీకి నిర్ణయాన్ని వాయిదా వేసింది. గురువారం సినిమా ప్రదర్శనను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

థియేటర్లలో ప్రదర్శన నిలుపుదల

రాజధాని అమరావతి రైతుల ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన ‘రాజధాని ఫైల్స్‌’ చిత్రానికి బ్రేకులు పడ్డాయి. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ చిత్ర ప్రదర్శనను నిలుపుదల చేయాలని రెవెన్యూ అధికారులు థియేటర్‌ యాజమానులను ఆదేశించారు. గురువారం రిలీజైన ఈ చిత్రాన్ని ఉమ్మడి కృష్ణాలో 26 థియేటర్లతో పాటు కొన్ని మల్లీప్లెక్స్‌ల్లోనూ విడుదల చేశారు. ఉదయం ఆట మొదలయ్యే సరికి రెవెన్యూ అధికారులు థియేటర్లకు వచ్చి.. ప్రదర్శనలను నిలుపుదల చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు వెళ్లే సరికి కొన్ని థియేటర్లలో ప్రదర్శనలు మొదలయ్యాయి. ఆయా థియేటర్లలో మాత్రం మేనేజర్లు కోర్టు తీర్పు కాపీని ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరారు. ఆ ఉత్తర్వులను టికెట్‌ కౌంటర్ల వద్ద అతికించారు. మ్యాట్నీ నుంచి పూర్తిగా నిలుపుదల చేయాలని ఆదేశించారు. ట్రెండ్‌సెట్‌లో ప్రదర్శనను మధ్యలోనే ఆపేయడంతో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. అధికారులు వారికి కోర్టు ఆదేశాలను చూపించడంతో ఆందోళన విరమించారు. కాగా, ఏలూరులోని విజయలక్ష్మి థియేటర్‌ (వి మాక్స్‌)లో ఈ సినిమా గురువారం 11 గంటలకు ప్రారంభం కాగా రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి ప్రేక్షకులను పంపించి వేశారు.

అమరావతి (ఆంధ్రజ్యోతి)

Updated Date - Feb 16 , 2024 | 05:50 AM