పవన్‌కల్యాణ్‌ను కలసిన తెలుగు సినిమా నిర్మాతలు

ABN , Publish Date - Jun 25 , 2024 | 01:07 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను సినీ పరిశ్రమ తరఫున అభినందించేందుకు అపాయింట్‌మెంట్‌ కోరడానికి వచ్చామని నిర్మాత అల్లు అరవింద్‌ తెలిపారు...

పవన్‌కల్యాణ్‌ను  కలసిన తెలుగు సినిమా నిర్మాతలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను సినీ పరిశ్రమ తరఫున అభినందించేందుకు అపాయింట్‌మెంట్‌ కోరడానికి వచ్చామని నిర్మాత అల్లు అరవింద్‌ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో పలువురు నిర్మాతలు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై వారు చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ తరఫున పవన్‌ కల్యాణ్‌ను అభినందించడానికి అపాయింట్‌మెంట్‌ కోరడానికి వచ్చామన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబుతో భేటీ కావడానికి అపాయింట్‌ ఇప్పించాలని కోరినట్టు తెలిపారు. దీనిపై చంద్రబాబుతో మాట్లాడి చెబుతానని పవన్‌ కల్యాణ్‌ తెలిపినట్టు వివరించారు.


తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించ లేదని, త్వరలోనే మరోసారి కలసి చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, నిర్మాతలు సి.అశ్వనీదత్‌, ఎ.ఎం.రత్నం, డి.సురేష్‌ బాబు, ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు), దిల్‌రాజు, భోగపల్లి ప్రసాద్‌, డి.వి.వి.దానయ్య, సుప్రియ, ఎన్‌.వి.ప్రసాద్‌, బన్నీ వాసు, నవీన్‌ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్‌, వంశీకృష్ణ, వై.రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

అమరావతి (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 25 , 2024 | 01:07 AM