టెడ్డీ బేర్ యాక్షన్ ఎంటర్‌టైనర్
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:21 AM
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లు. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జులై 26న...

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లు. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జులై 26న విడుదల కానుంది. మంగళవారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ‘గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు ‘ప్రేమ కథాచిత్రమ్’ను తమిళంలోకి రీమేక్ చేశాం. జీవీ ప్రకాశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే ‘బడ్డీ’ తీస్తున్నాం. నేను కథ కంటే శామ్‌నే ఎక్కువగా నమ్మాను. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ ఇచ్చిన సంగీతం చిత్రానికి ప్రాణం. అల్లు శిరీష్ మా కుటుంబ సభ్యుడు. ‘బడ్డీ’లో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంటుంది.
జులై 26న సినిమాను విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు. ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ ‘నా స్నేహితుడు జ్ఞానవేల్ రాజా ఎన్నో తమిళ చిత్రాలు తెలుగులోకి తీసుకువచ్చి విజయం సాధించారు. ‘బడ్డీ’తో ఆయన తెలుగులో స్ట్రయిట్ చిత్రం చేయడం ఆనందంగా ఉంది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’ అన్నారు. ‘నేను రాజమౌళిగారి అభిమానిని. ఆయన తీసిన ‘ఈగ’ చిత్రం ఈ ‘బడ్డీ’కి ప్రేరణ. సీజీ వర్క్ చేస్తున్నప్పుడు ‘ఈగ’ మూవీతో పోల్చి సజెషన్స్ ఇచ్చేవాడిని. నా మీద నమ్మకంతో సినిమా ఇచ్చిన నిర్మాత జ్ఞాన్‌వేల్ రాజాకు కృతజ్ఙతలు’ అన్నారు దర్శకుడు శామ్.
హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘టెడ్డీ బేర్‌తో అడ్వెంచర్ యాక్షన్ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని మొదట కొంత డౌట్ ఉండేది. కానీ ట్రైలర్ చూశాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది కొత్త తరహా సినిమా ఇందులో హీరో నేను కాదు.. టెడ్డీ బేర్. ఆ క్యారెక్టర్‌కు ఇంప్రెస్ అయి ఈ సినిమా ఒప్పుకొన్నా. మా నాన్న కూడా నా మీద ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు. భారీ ఖర్చుతో నాతో యాక్షన్ అడ్వెంచర్ తీసిన జ్ఞానవేల్ రాజాగారికి కృతజ్ఞతలు’ అని చెప్పారు.