తెలుగు డబ్బింగ్‌లకు తమిళ టైటిల్సా?
ABN , Publish Date - Oct 08 , 2024 | 02:09 AM
‘బొమ్మరిల్లు’, ‘కిక్’, ‘ఎవడు’ సినిమాలతో సినీ రచయితగా మంచి గుర్తింపు పొందారు అబ్బూరి రవి. ప్రస్తుతం ‘డెకాయిట్’ సినిమాకు పని చేస్తున్న ఆయన.. ఎక్స్ వేదికగా తెలుగులో రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమా టైటిల్స్‌పై ...
‘బొమ్మరిల్లు’, ‘కిక్’, ‘ఎవడు’ సినిమాలతో సినీ రచయితగా మంచి గుర్తింపు పొందారు అబ్బూరి రవి. ప్రస్తుతం ‘డెకాయిట్’ సినిమాకు పని చేస్తున్న ఆయన.. ఎక్స్ వేదికగా తెలుగులో రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమా టైటిల్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగువారికి సుపరిచితం కాని పేర్లతో సినిమాల టైటిల్స్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘తెలుగు ప్రేక్షకులని అగౌరవపరుస్తున్నారు. ఒకప్పుడు ‘డబ్బింగ్’ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేవారు. ఇతర భాషలలో ఉండే బోర్డులని చక్కగా తెలుగులోకి మార్చేవారు. ఇప్పుడు అదంతా మానేసి విడుదల చేస్తున్నారు. ఆయా భాషల గొప్పతనాన్ని.. వారి కళాత్మకతని గౌరవిస్తాను. కానీ తెలుగు ప్రేక్షకులని ఇంత తేలికగా తీసుకోవటం నచ్చట్లేదు. తెలుగుని గౌరవించని వాళ్లని కూడా తెలుగువారు గౌరవించడం, ఆదరించడం.. ఆ సినిమాలను చూడటం కోసం మన డబ్బులు ఖర్చుపెట్టడం గొప్పతనమని నేను మాత్రం అనుకోవట్లేదు’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
మంచి పాయింట్‌ను లేవనెత్తారు అంటూ నెటిజన్లు రవి పోస్ట్‌కు మద్దతు పలుకుతున్నారు. ‘కంగువ’, ‘వేట్టయాన్’, ‘తంగలాన్’, ‘రాయన్’ ‘వలిమై’, లాంటి పేర్లు పలకడానికే కష్టంగా ఉన్నాయి.. అయినా అటువంటి టైటిల్స్ బదులు చక్కగా తెలుగు టైటిల్స్ పెట్టొచ్చు కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.