చరణ్‌తో మాట్లాడా.. ఇప్పుడంతా క్లియర్‌

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:56 AM

‘కీడా కోలా’ చిత్రంలో అనుమతి లేకుండా దివంగత గాయకుడు ఎస్పీ బాలు పాటను ఏఐ (కృత్రిమ మేథ)తో రీక్రియేట్‌ చేసినందుకు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌, చిత్ర యూనిట్‌పై బాలు తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్‌ లీగల్‌ నోటీసులు...

చరణ్‌తో మాట్లాడా.. ఇప్పుడంతా క్లియర్‌

‘కీడా కోలా’ చిత్రంలో అనుమతి లేకుండా దివంగత గాయకుడు ఎస్పీ బాలు పాటను ఏఐ (కృత్రిమ మేథ)తో రీక్రియేట్‌ చేసినందుకు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌, చిత్ర యూనిట్‌పై బాలు తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్‌ లీగల్‌ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో ఈ వివాదంపై తరుణ్‌ భాస్కర్‌ స్పందించారు. ‘‘ఈ సమస్యంతా గాయకుడు ఎస్పీ చరణ్‌, నాకూ మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్ల వచ్చిందే. ఒక ఫిల్మ్‌మేకర్‌గా ఎప్పుడూ కొత్తదనంతో ప్రేక్షకులను అలరించటానికే తాపత్రయపడుతుంటా. అందులో భాగంగానే లెజెండరీ కళాకారులను గౌరవించాలనే ఉద్దేశంతో ‘కీడాకోలా’లో దివంగత గాయకుడు. ఎస్పీ బాలు పాటను ఏఐ సాయంతో రీ క్రియేట్‌ చేశాం. ఈ ప్రయత్నం ఎవరినో కించపరచటానికో, అగౌరవపరచటానికో చేయలేదు. నేను ఎప్పుడూ కొత్త నటులతో చిన్న సినిమాలే చేస్తుంటాను. పేరుమోసిన బడా స్టార్స్‌తో సినిమాలు చేయాలని ప్రయత్నించట్లేదు, కోరుకోవట్లేదు. కొత్తగా ప్రయత్నించాం. ఏఐకు ఉన్న పరిమితులు తెలుసు. ప్రస్తుతం మన అందరి ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. ఏ క్షణం ఏమవుతుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో మనం చేయగలిగిందల్లా.. అన్నిటినీ గౌరవించటం.. ప్రయోగాలు చేయడం మాత్రమే. అలాంటి ప్రయత్నమే ‘కీడాకోలా’లో చేశాం. ఇది కమర్షియల్‌ అడ్వాంటేజ్‌ కోసం కాదు. ఒక్కోసారి కొత్తగా ప్రయత్నించేటప్పుడు పొరపాట్లు జరగటం సహజం. దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే ఎస్పీ చరణ్‌తో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఏర్పడింది. కానీ ఇప్పుడంతా క్లియర్‌. ఈ విషయంపై నేను ఆయనతో మాట్లాడా’’ అని వివరించారు.

Updated Date - Mar 19 , 2024 | 03:56 AM