మమ్మల్ని సంప్రదించకుండానే చర్యలు తీసుకుంటారా?

ABN , Publish Date - Jul 31 , 2024 | 01:24 AM

వివిధ అంశాలపై తమిళ నిర్మాతల మండలి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందంటూ ‘నడిగర్‌ సంఘం’ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను సంప్రదించకుండా చర్యలు ఎలా తీసుకుంటారని...

నిర్మాతల మండలిపై నడిగర్‌ సంఘం ఆగ్రహం

వివిధ అంశాలపై తమిళ నిర్మాతల మండలి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందంటూ ‘నడిగర్‌ సంఘం’ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను సంప్రదించకుండా చర్యలు ఎలా తీసుకుంటారని నిలదీసింది. తమిళ నిర్మాతల మండలి సోమవారం సమావేశమై పలు తీర్మానాలు ఆమోదించిన విషయం తెలిసిందే. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు క్రమబద్ధీకరించాలని, ఆగస్టు 16 తర్వాత కొత్త సినిమాల షూటింగ్‌ చేపట్టకూడదని, నవంబరు ఒకటి నుంచి సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని.. ఇలా ఆరు తీర్మానాలు ఆమోదించింది. ఇలా ఏకపక్షంగా తమిళ నిర్మాత మండలి నిర్ణయాలను తీసుకోవడాన్ని నడిగర్‌ సంఘం తీవ్రంగా ఖండించింది. . సినీ రంగంపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా షూటింగులు నిలిపివేస్తామని తీర్మానం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.


పారితోషికాలు సహా ఇతర సమస్యలపై నడిగర్‌ సంఘం సహా మిగిలిన సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. అలాగే ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఈ వ్యవహారంపై తదుపరి చేపట్టాల్సిన చర్యలపై తమ సంఘం కార్యనిర్వాహకుల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నడిగర్‌ సంఘం ప్రకటించింది.

చెన్నై(ఆంధ్రజ్యోతి)

Updated Date - Jul 31 , 2024 | 01:24 AM