ప్లాన్ చేస్తే విజయాలు రావు
ABN , Publish Date - Nov 05 , 2024 | 06:49 AM
‘మనం ప్లాన్ చేస్తే విజయాలు రావు. మంచి సినిమాలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు. ‘మహానటి, సీతారామం’ చిత్రాల తర్వాత...
‘మనం ప్లాన్ చేస్తే విజయాలు రావు. మంచి సినిమాలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు. ‘మహానటి, సీతారామం’ చిత్రాల తర్వాత ఆయన నటించిన ‘లక్కీ భాస్కర్’ ఇటీవలే విడుదలై చక్కటి ఆదరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
దర్శకుడు వెంకీ అట్లూరి కథ చెబుతున్నప్పుడే మనసులో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. బ్యాంకింగ్ నేపథ్యాన్ని తీసుకొని మధ్య తరగతి కుటుంబాల కథ చెప్పడం కొత్తగా అనిపించింది. ఎప్పటి నుంచో వాస్తవానికి దగ్గరగా ఉండే ఓ మధ్యతరగతి తండ్రి పాత్ర చేయాలనుకుంటున్నాను. అది ఈ సినిమాతో నెరవేరింది. నా దృష్టిలో ఇది వాస్తవకథ. హర్షద్ మెహతా లాంటివాడు భారీ స్కాం చేస్తుంటే ఒక చిన్నబ్యాంక్ ఉద్యోగి తన పరిధిలో స్కాం చేయడం అనేది కొత్త పాయింట్. కథ పైన వెంకీ ఎంతో రీసెర్చి చేశాడు. ఈ సినిమా కథలో ఎలాంటి తప్పు లేదని బ్యాంకింగ్ నిపుణులు చెప్పారు. సినిమా ప్రతి దశలో ఎంజాయ్ చేశాను. సినిమా విజయం ఎంతో సంతృప్తిని ఇచ్చింది.
మమ్ముట్టి గారి అబ్బాయినే అయినా నేను కూడా అందరిలానే ఆలోచిస్తాను. కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు లాటరీ తగిలితే సొంతంగా నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అని కలలు కనేవాణ్ణి. నాన్నకు ‘లక్కీ భాస్కర్’ బాగా నచ్చింది. సినిమా చూశాక వెంకీతో మాట్లాడారు. ఎంతగానో మెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం చేస్తున్నాను.