తారల కథలు తెరపైకి

ABN , Publish Date - Mar 21 , 2024 | 05:58 AM

చిత్రసీమలో ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. అసామాన్య విజయాలు సాధించిన సామాన్యుల గాథల నుంచి క్రీడా, రాజకీయ దురంధరుల బయోపిక్‌లు తెరకెక్కించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది...

తారల కథలు తెరపైకి

చిత్రసీమలో ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. అసామాన్య విజయాలు సాధించిన సామాన్యుల గాథల నుంచి క్రీడా, రాజకీయ దురంధరుల బయోపిక్‌లు తెరకెక్కించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఇవన్నీ ఒకెత్తయితే సినీ రంగానికే చెందిన పలువురు ప్రముఖుల జీవితాలను వెండితెరపైకి తేవడం కొంతకాలంగా జరుగుతోంది. తెలుగులో నటి సావిత్రి జీవితం ఆధారంగా వచ్చిన ‘మహానటి’ ఏ స్థాయి విజయాన్ని అందుకొందో చూశాం. ఆ కోవలోనే ఇప్పుడు పలువురు సినీ తారల జీవితాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.

ట్రాజెడీ క్వీన్‌ బయోపిక్‌

తనదైన అందం, అభినయంతో కథానాయికగా ఒక తరం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు మీనాకుమారి. కథానాయుకగానే కాదు, తన సుమధుర గానంతోనూ మెప్పించారు. కవయిత్రిగానూ రాణించారు. ఆమెను బాలీవుడ్‌ ట్రాజెడీ క్వీన్‌గా విశ్లేషకులు వర్ణిస్తారు. బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 90కు పైగా సినిమాల్లో ఆమె నటించారు. ‘పాకీజా, సాహిబ్‌ బీబీ ఔర్‌ గులాం, మేరే అప్నే’ లాంటి ఎన్నో చిత్రాలు క్లాసిక్స్‌గా మిగిలాయి. 1972లో ఆమె చనిపోయారు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఆమె బయోపిక్‌ తెరకెక్కుతోంది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. స్ర్కిప్ట్‌ దశలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీనాకుమారి కుటుంబ సభ్యులను కలసి ఆమె జీవిత విశేషాలను సేకరించారు. అయితే ఈ చిత్రంలో నటించే కథానాయిక ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. కృతీసనన్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నట్లు కొన్నాళ్లుగా బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కృతీ కూడా మీనాకుమారి పాత్రను పోషించేందుకు ఆసక్తిగా ఉన్నారనీ, ఇప్పటికే తను ఆ పాత్ర కోసం సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మధుబాలగా మెప్పించేదెవరు?

ఆ కాలంలో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకొన్న కథానాయికగా ఖ్యాతి గడించారు మధుబాల. రెండు దశాబ్దాల కెరీర్‌లో 1969లో తను కన్నుమూసేనాటికి 60కు పైగా చిత్రాల్లో నటించారు. ‘నీల్‌కమల్‌, అమర్‌, మహల్‌, బర్సాత్‌ కీ రాత్‌’ ఆమె నటించిన చిత్రాల్లో కొన్ని. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ‘మొఘల్‌ ఈ ఆజమ్‌’ చిత్రంలో అనార్కలి పాత్ర ఆమె నటనలో కలికితురాయిగా నిలిచిపోయింది. త్వరలోనే ఆమె జీవితకథ వెండితెరపైకి వస్తోంది. ‘డార్లింగ్స్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన జస్మీత్‌ కే రీన్‌ మెగాఫోన్‌ చేపట్టనున్నట్లు స్వయంగా ప్రకటించారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తోంది. మీనాకుమారి పాత్ర ఎవర్ని వరించనుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అలియాభట్‌, మాధురీ దీక్షిత్‌, కంగనా రనౌత్‌లో ఒకరికి దక్కే అవకాశముందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఇద్దరు నాయికలతో

ప్రముఖ బాలీవుడ్‌ నృత్య దర్శకులు దివంగత సరోజ్‌ఖాన్‌ బయోపిక్‌కు గతేడాది చివరలో సన్నాహాలు మొదలయ్యాయి. పలు బాలీవుడ్‌ హిట్‌ చిత్రాలకు ఆమె కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఎంతోమంది నృత్యదర్శకులను బాలీవుడ్‌కు అందించారు. టీ సిరీస్‌ భూషణ్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ బయోపిక్‌కు హన్సల్‌ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రసుతం స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఇద్దరు నాయికలు నటిస్తారు’ అని హన్సల్‌ మెహతా చెప్పారు. మాధురీ దీక్షిత్‌ సరోజ్‌ఖాన్‌ పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. మాధురీ నటించిన పలు హిట్‌ గీతాలకు సరోజ్‌ఖాన్‌ నృత్యరీతులు సమకూర్చారు.

మరోసారి తెరపైకి

టాలీవుడ్‌లోనూ కొందరు సినీ ప్రముఖల జీవితం ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా 2011లో బాలీవుడ్‌లో వచ్చిన ‘డర్టీ పిక్చర్‌’ ఘన విజయం అందుకొంది. విద్యాబాలన్‌ టైటిల్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొంది. ఇప్పుడు మరోసారి ఆమె జీవిత కథ వెండితెరపైకి వస్తోంది. 80, 90 దశకాల్లో ప్రత్యేక గీతాల్లో ప్రేక్షకులను అలరించారు స్మిత. ప్రతి సినిమాలోనూ ఆమె ప్రత్యేకగీతం ఉండి తీరాలనే పరిస్థితి అప్పట్లో ఉండేది. తెలుగుతో పాటు పలు భాషల్లో 400 వరకూ చిత్రాల్లో నటించారు. 1996లో ఆమె ఆత్మహత్య చేసుకొన్నారు. సిల్క్‌ మరణం ఇప్పటికీ మిస్టరీనే. ‘సిల్క్‌ స్మిత - ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి జయరాం శంకరన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సిల్మ్‌ స్మిత గురించి ఎవరూ చెప్పని విషయాలను ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు. ధనంజయన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చంద్రిక రవి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు.

కథానాయికగా తెలుగుదనం ఉట్టిపడే పాత్రలతో సౌందర్య ఇంటిల్లిపాదికి గుర్తుండిపోయారు. ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకున్నారు. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండేవారు. ‘అమ్మోరు, రాజా, జయం మనదే రా, అంతఃపురం’ లాంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి పేరొచ్చింది. 2004లో బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో సౌందర్య మరణించారు. ఆమె బయెపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు మూడేళ్ల క్రితం పరిశ్రమలో వార్తలు వచ్చాయి. అయితే అవేవీ నిజం కాలేదు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో కథానాయిక రష్మిక మందన్న మాట్లాడుతూ ‘‘నువ్వు సౌందర్య గారిలా ఉన్నావు’ అని చాలా మంది అన్నారు. ఆమె నటన, వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. ఎవరైనా ఆమె బయోపిక్‌ను తెరకెక్కిస్తే సౌందర్య పాత్రను పోషించాల్సి ఉంది’ అని మనసులో మాట బయటపెట్టారు. స్టార్‌ హీరోయిన్‌ కోరిక కాబట్టి రష్మిక డేట్స్‌ ఇస్తే సౌందర్య బయోపిక్‌ను నిర్మించడానికి ఏ నిర్మాతైనా ముందుకు రాకపోతాడా వేచి చూడాలి.

Updated Date - Mar 21 , 2024 | 09:23 AM