ఇప్పటికైనా త్రివిక్రమ్‌ను ప్రశ్నించండి
ABN , Publish Date - Sep 18 , 2024 | 04:52 AM
కొరియోగ్రాఫర్ షైక్ జానీ భాష (జానీ మాస్టర్)పై అత్యాచార కేసు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ సోషల్‌మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘నేను గతంలో...
కొరియోగ్రాఫర్ షైక్ జానీ భాష (జానీ మాస్టర్)పై అత్యాచార కేసు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ సోషల్‌మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘నేను గతంలో దర్శకుడు త్రివిక్రమ్‌పై మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (మా)కు ఫిర్యాదు చేశాను. నా ఫిర్యాదుపై ‘మా’ చర్యలు తీసుకోలేదు. ‘మా’ గనక నా ఫిర్యాదును పరిశీలించి ఉంటే.. నాకూ... మరికొంత మందికి ఇబ్బందులు తప్పేవి. రాజకీయంగా కూడా నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ప్రశ్నించాలని కోరుకుంటున్నాను’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
‘మా’లో ఎప్పుడు ఫిర్యాదు చేసిందో తెలీదు
పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ‘‘పూనమ్ కౌర్ ‘మా’లో ఫిర్యాదు ఎందుకు చేశారో.. ఎప్పుడు చేశారో మాకు తెలియదు. అప్పటికి కమిటీ ఏర్పాటై ఉంటే .. ఫిర్యాదు బాక్స్‌లో ఆమె తన కంప్లైంట్‌ను వేసి ఉంటే సరిపోయేది. ఫిర్యాదు లేకుండా ముందుకెళ్లలేం. ‘మా’ వాళ్లు ఆ ఫిర్యాదును మాకు పంపించి ఉన్నా.. చర్యలు తీసుకునేవాళ్లం. ఇప్పటికైనా ఫిర్యాదు అందిస్తే ముందుకు వెళ్తాం’’ అని పేర్కొన్నారు.