Tollywood to Bollywood: బాలీవుడ్ లో దక్షిణాది దర్శకుల హవా

ABN , Publish Date - May 17 , 2024 | 04:54 PM

'బాహుబలి'తో దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమా ప్రభావం ప్రపంచం అంతటా వ్యాప్తి చేస్తే, ఇప్పుడు బాలీవుడ్ నటులు దక్షిణాది దర్శకులతో పని చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. సందీప్ వంగా 'యానిమల్' తో సంచలనం సృష్టించాడు, ప్రశాంత్ వర్మ 'హనుమాన్' హిందీలో ఘన విజయం సాధించింది. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ అగ్రనటులు ఇప్పుడు తెలుగు, తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు మన దర్శకుల హవా బాలీవుడ్ లో కొనసాగుతోంది.

Tollywood to Bollywood: బాలీవుడ్ లో దక్షిణాది దర్శకుల హవా
South directors big demand in Bollywood

తెలుగు సినిమా ప్రపంచ ఎల్లలు దాటి ఎక్కడికో వెళ్ళింది. తెలుగు సినిమా గురించి ప్రపంచంలో ఎంతోమంది ఇప్పుడు గొప్పగా మాట్లాడుతున్నారు. రాజమౌళి 'బాహుబలి' సినిమా తరువాత తెలుగు సినిమా రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పుడు కె రాఘవేంద్ర రావు, కె విశ్వనాధ్, బాపు, దాసరి నారాయణరావు లాంటి దర్శకులు హిందీలో సినిమాలు తీశారు, విజయవంతం అయ్యారు, కానీ తరువాత తెలుగుకి మాత్రమే పరిమితం అయ్యారు. అప్పట్లోనే మన తెలుగు దర్శకులకి డిమాండ్ వున్నా, మన దర్శకులు కారణాలు ఏమైనా హిందీవేపు అంతగా మొగ్గు చూపలేదు, తెలుగు సినిమానే మేలనుకున్నారు.

salmankhan-tiger3.jpg

ఆ తరువాత వచ్చిన వాళ్ళు ఒకటి ఆరా హిందీ సినిమాలు చేశారు కానీ, మొదటి తరంలా ఎక్కువగా చెయ్యలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రముఖ హిందీ నటులు అందరూ ఇప్పుడు దక్షిణాది దర్శకులవేపే చూస్తున్నారు, ఆ దర్శకులతో పని చెయ్యాలని అనుకుంటున్నారు. ఆమధ్య షా రుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి దర్శకుడు దక్షిణాదికి చెందిన అట్లీ అవటం ఆసక్తికరం. అంతకు ముందు మురుగుదాస్ బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ తో 'ఘజిని' తీసి విజయవంతం అయిన సంగతి కూడా తెలిసిందే.

తెలుగులో 'అర్జున్ రెడ్డి' సినిమా ఒక సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిన విషయం. ఆ సినిమాకి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఆ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండకి ఆ సినిమాతో స్టార్ స్టేటస్ వచ్చినట్టు చేసాడు దర్శకుడు సందీప్ వంగా. అదే సినిమాని హిందీలో 'కబీర్ సింగ్' పేరిట షాహిద్ కపూర్ తో రీమేక్ చేసాడు సందీప్ వంగా. హిందీలో కూడా ఘన విజయం సాధించింది. ఆ విజయంతో సందీప్ వంగా తన రెండో హిందీ సినిమా 'యానిమల్' రణబీర్ కపూర్ తో తీసాడు. ఆ సినిమా ఒక సంచలనం అనే చెప్పాలి.

ranveersinghnew.jpg

ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా, మిగతా అన్ని భాషల్లో ఆ సినిమా ఘన విజయం సాధించటమే కాకుండా, రణబీర్ కపూర్ కెరీర్ లో ఆ 'యానిమల్' సినిమా బెస్ట్ సినిమాగా అయింది. అంతే కాకుండా బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇలా దక్షిణాది దర్శకులు బాలీవుడ్ లో విజయకేతనం ఎగురవేస్తుంటే, ఇక అక్కడ అగ్ర నటులు అందరూ ఇప్పుడు దక్షిణాది దర్శకులపై దృష్టి పెట్టారు.

తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమా దర్శకుడు మురుగుదాస్ తో చెయ్యబోతున్నారు. ఈ సినిమాలోనే దక్షిణాదికి చెందిన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఇదొక్కటే కాదు సంక్రాంతికి విడుదలైన 'హనుమాన్' చిత్రం ఒక్క తెలుగులోనే కాకుండా, మిగతా అన్ని భాషల్లో, ముఖ్యంగా హిందీలో చాలా పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాకి దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ప్రశాంత్ బాలీవుడ్ లో అగ్రనటుల్లో ఒకరైన రణవీర్ సింగ్ తో సినిమా చేస్తున్నాడు అని వార్తలు. ఈరోజు ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ హైదరాబాదు విమానాశ్రయంలో కలిసి రావటం ఈ వార్తలకి మరింత బలాన్ని ఇస్తోంది.

shahidkapoornew.jpg

అలాగే తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. మహేష్ బాబుతో 'మహర్షి', విజయ్ తో 'వారిసు' లాంటి సినిమాలు చేసి హిట్ కొట్టిన తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తన తదుపరి ప్రాజెక్ట్ షాహిద్ కపూర్ తో హిందీ సినిమా చేయనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇక 'యానిమల్' లాంటి హిట్ ఇచ్చిన సందీప్ వంగా తదుపరి సినిమా ప్రభాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత మళ్ళీ అతను 'యానిమల్' హిందీ సినిమాకి సీక్వెల్ అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిన విషయమే.

ఇలా దక్షిణాదికి చెందిన దర్శకులే కాకుండా చాలామంది హిందీ నటులు ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ తెలుగులో 'కన్నప్ప' సినిమాతో ఆరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. అతనికన్న ముందు సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్, సంజయ్ దత్, నవాజుద్దీన్ సిద్దిఖ్ లాంటి నటులు తెలుగులో నటించారు. 'కల్కి 2898 ఏడి' సినిమాతో అమితాబ్ బచ్చన్ కూడా తెలుగులో ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు దర్శకుల హవా నడవటమే కాకుండా, తెలుగు సినిమాలో నటించడానికి హిందీ నటుల ఆసక్తి చూపుతున్నారన్న సంగతి కూడా అర్థం అవుతోంది.

Updated Date - May 17 , 2024 | 04:54 PM