Theatres shut down in Hyd : వినోదానికి తెర

ABN , Publish Date - May 16 , 2024 | 05:32 AM

పరీక్షల సీజన్‌,. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, సార్వత్రిక ఎన్నికలు.. ఇలా అన్నీ ఒకేసారి రావడంతో థియేటర్లకు వెళ్లే జనమే కరువయ్యారు. మినిమం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడంతో నష్టాలను తట్టుకోలేక కొన్ని...

Theatres shut down in Hyd  : వినోదానికి తెర

  • నెలాఖరు దాకా సింగిల్‌ స్క్రీన్స్  థియేటర్ల మూత

పరీక్షల సీజన్‌,. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, సార్వత్రిక ఎన్నికలు.. ఇలా అన్నీ ఒకేసారి రావడంతో థియేటర్లకు వెళ్లే జనమే కరువయ్యారు. మినిమం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడంతో నష్టాలను తట్టుకోలేక కొన్ని సింగిల్‌ స్క్రీన్స్  థియేటర్లు దాదాపు రెండు వారాల పాటు మూతపడనున్నాయి. పెద్ద సినిమాలేవీ ఇప్పట్లో లేకపోవడం, చిన్న సినిమాలను చూసేందుకు ప్రేక్షకుడు ఆసక్తి చూపకపోవడం వల్ల రోజురోజుకీ థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోతోంది. ఈ కారణంగానే ఈనెల 17 నుంచి నెలాఖరు వరకూ థియేటర్లను స్వచ్చందంగా మూసేయ్యాలని కొంతమంది థియేటర్‌ యజమానులు నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌కు, ఈ నిర్ణయానికీ ఎలాంటి సంబంధం లేదని, ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ ఎగ్జిబిటర్‌ వెల్లడించారు. రోజువారీ ఖర్చులు కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో నష్టాలను తగ్గించుకోవడానికి థియేటర్‌ రన్‌ తాత్కాలికంగా ఆపడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని ఆయన వాపోయారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాఽధాకరమే అయినా తప్పడం లేదని మరికొంత మంది థియేటర్‌ యజమానులు చెప్పారు.


కారణాలు ఏమిటి?

కొత్తవారితో తీసే చిత్రాలను, లో బడ్జెట్‌ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడంతో సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లకు కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. తగినంత మంది ప్రేక్షకులు లేకపోవడం వల్ల షో నే కాన్సిల్‌ చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఇప్పటికే ఓటీటీల దెబ్బకు విలవిలలాడుతున్న సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లను ఈ పరిణామాలు మరింత నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. వారం వారం పెద్ద సంఖ్యలో చిన్న సినిమాలు విడుదలవుతున్నా ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలు వాటిల్లో ఉండకపోవడం వల్ల నిర్మాతలతో పాటు తాము కూడా నష్టపోవాల్సి వస్తోందని థియేటర్‌ యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతి సీజన్‌ తర్వాత విడుదలైన ఒకటి రెండు సినిమాలు తప్ప మిగిలినవేవీ ఆడక పోవడంతో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. పెద్ద హీరోలు రెండు మూడేళ్లకు ఓ సినిమా చేయడం ఆక్యపెన్సీ తగ్గడానికి ప్రధాన కారణమనీ, అభిమానుల కోసమన్నా టాప్‌ స్టార్స్‌ సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా చేయాలని ఈ సందర్భంగా థియేటర్‌ యజమానులు అభ్యర్ధిస్తున్నారు.


నష్టాలు వస్తున్నా మొండిగా నడుపుతున్నాం

అయితే తాము థియేటర్లను మూత వేయడం లేదని ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్‌ థియేటర్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు. నాలుగు షోలకు బదులుగా ఐదు షోలు వేయబోతున్నామని చెప్పారు. కొన్ని థియేటర్ల యజమానులు మాత్రమే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చన్నారు.

జంట నగరాల్లో, ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఇలా థియేటర్లు మూత వేస్తున్న వారు ఎవరూ లేరన్నారు. నగర శివార్లు, తాలూకాలలో కొన్ని చోట్ల ఇలా చేస్తుండవచ్చన్నారు. సినిమాలు లేవని థియేటర్‌ మూత వేస్తే అది థియేటర్‌ రన్‌పై నెగిటివ్‌ ప్రభావం చూపే అవకాశాలు లేక పోలేదు, అందుకే మూతేయడం ఇష్టం లేక, కష్టమైనా నడుపుతున్నాం అని సంధ్య ధియేటర్‌ మేనేజర్‌ మధుసూదన్‌ తెలిపారు. వీరి బాటలోనే మరి కొంతమంది ధియేటర్ల యజమానులు కూడా తమ నిర్ణయాన్ని మార్చుకొని ప్రదర్శనలను కొన సాగించనున్నట్లు తెలిపారు. పెద్ద సినిమాలు రిలీజ్‌ అవ్వకపోయినా ప్రస్తుతానికి చిన్న సినిమాలనే ప్రదర్శిస్తామని చెబుతున్నారు.


సింగిల్‌ స్ర్కీన్స్‌లోనే కాదు.. మల్టీప్లెక్స్‌లో కూడా

ప్రేక్షకులు లేక షోలు రద్దు చేయడం, థియేటర్లు మూసెయ్యడం తెలుగు రాష్ట్రాల్లో చాలాకాలంగా జరుగుతున్నదే. థియేటర్‌ను క్లోజ్‌ చేయడం కంటే నడిపిస్తేనే ఎక్కువ నష్టం వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్‌ నిర్వహణ గుదిబండగా మారింది. థియేటర్‌ రన్‌ చేయడానికి రోజుకి రూ 12 వేలు ఖర్చవుతుంటే, ఆదాయం మాత్రం నాలుగైదు వేలకి మించి రావడం లేదు.. సినిమా వేస్తే రూ. 7 వేలు నష్టం. అలా కాకుండా థియేటర్‌ మూసేస్తే రూ. 4 వేలు నష్టం. ఇది బాదాకరం అయినా థియేటర్లను మూసెయ్యక తప్పడం లేదు. సింగిల్‌ థియేటర్ల పరిస్థితి ఇలా ఉంటే మల్టీప్లెక్స్‌కు కూడా ఈ కష్టాలు తప్పడం లేదు. అక్కడ గతంలో వారానికి 80 షోలు ఉండేవి. ఇప్పుడు 20 షోలు వేయడం గగనమవుతోంది. ఇక సింగిల్‌ స్ర్కీన్లలో ఇంతకుముందు వారానికి 28 షోలు వేసే వాళ్లం. కానీ ఇప్పుడు 15 మాత్రమే ఉంటున్నాయి. విద్యుత్‌, జీతాలు, యూఎఫ్‌వో ఛార్జీలు, జీఎస్టీ అన్నీ కలిపి ఎగ్జిబిటర్లకు తడిసి మోపెడవుతోంది.


కనీసం పదిమంది ఉండడం లేదు

కనీసం పదిమంది అయినా వస్తేనే షో వేస్తున్నాం. ఇటీవలే విడుదలైన ఒక సినిమాకు మూడు షోలు అలాగే వేశాం. నాలుగో షోకు అంతమంది జనం లేకపోవడంతో రద్దు చేశాం. మల్టీప్లెక్స్‌ల్లో కూడా ఇదే జరుగుతోంది. థియేటర్‌ దగ్గరకొచ్చాక షో బంద్‌ అనడంతో కొన్నిసార్లు ప్రేక్షకులతో గొడవలు అవుతున్నాయి. తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని థియేటర్లను రెండు వారాల కిందే మూసేశారు.. మళ్లీ పూర్తి స్థాయిలో ఎప్పుడు తెరుచుకుంటాయి అనేది ఇప్పుడు చెప్పలేం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్‌లతో కలిపి 1900 స్ర్కీన్లు ఉన్నాయి. దాదాపు అన్నింటిలోనూ ఇదే పరిస్థితి. మిడ్‌రేంజ్‌ సినిమాలకు కూడా నిర్మాతలు షేర్‌ గ్యారంటీలు, అడ్వాన్స్‌లు అడుగుతున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య మేం రిస్క్‌ చేయాలని అనుకోవడం లేదు. నిర్మాతలు ముందుకు వచ్చి తగిన సహకారం అందిస్తే సినిమాలు ప్రదర్శిస్తాం.

-విజయేందర్‌ రెడ్డి,

తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌.

Updated Date - May 16 , 2024 | 10:26 AM