నిజం తెలియాలంటే చూడండి

ABN , Publish Date - Apr 01 , 2024 | 01:47 AM

అగ్రతారలు లేరు, దర్శకుడి పేరు కూడా తెలియదు, ప్రచారం కోసం పైసా ఖర్చు లేదు... అయితేనేం ఆ సినిమా ఏకంగా అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సోషల్‌ మీడియాతో పాటు సామాన్య జనాల...

నిజం తెలియాలంటే చూడండి

  • యూట్యూబ్‌లో సెన్షేషన్‌గా వైఎస్‌ వివేకానందరెడ్డి బయోపిక్‌ - ‘వివేకం’

  • స్ట్రీమింగ్‌ అయిన తొలిరోజే పది లక్షల వ్యూస్‌

అగ్రతారలు లేరు, దర్శకుడి పేరు కూడా తెలియదు, ప్రచారం కోసం పైసా ఖర్చు లేదు... అయితేనేం ఆ సినిమా ఏకంగా అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సోషల్‌ మీడియాతో పాటు సామాన్య జనాల చర్చల్లో భాగమైన ఆ చిత్రం మాజీ ఎంపీ దివంగత వైఎస్‌ వివేకానంద రెడ్డి బయోపిక్‌ - ‘వివేకం’. యూట్యూబ్‌లో ఈ చిత్రం సన్సేషన్‌ సృష్టిస్తోంది. స్ట్రీమింగ్‌ మొదలైన తొలి రోజే పది లక్షలకు పైగా వ్యూస్‌ సాధించి అగ్రహీరోల చిత్రాలను సైతం వెనక్కి నెట్టింది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ నెటిజన్లు ‘వివేకం’ సినిమాలోని సీన్లను వైరల్‌ చేస్తున్నారు. మేధావులనే కాదు సామాన్య జనాలను సైతం ఈ సినిమా ఇంతలా ఆకర్షించడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ఓటీటీ విడుదలను అడ్డుకోవడంతో మేకర్స్‌ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌ చేశారు. అక్కడా లక్షల్లో వ్యూస్‌ను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. యూట్యూబ్‌తో పాటు డబ్లూడబ్ల్యూడబ్లూ.వివేకా బయోపిక్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌లోనూ ఈ చిత్రాన్ని లైవ్‌ స్ట్రీమింగ్‌కు ఉంచారు. పే ఫర్‌ వ్యూ పద్ధతిలో వీక్షించవచ్చు. రోజు రోజుకూ ఈ చిత్రాన్ని చూసే వారి సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఇది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి లాభించేలా ఉండడంతో వైఎస్సార్‌ సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం ఈ సినిమా కంటెంట్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నా నెటిజన్లు పైరసీ లింకుల ద్వారా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో వీక్షకులకు అందుబాటులో ఉంచుతున్నారు.

రామ్‌గోపాల్‌ వర్మ రాజకీయ ప్రేరేపిత సినిమాలు ‘వ్యూహం, శపథం’ లాంటి సినిమాలు సైతం తుస్సుమన్న తరుణంలో ‘వివేకం’ ప్రజలను ఇంతలా కదిలించడానికి సినిమాను తెరకెక్కించిన తీరే కారణం అని చెప్పాలి. ఇది వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య చుట్టూ అల్లుకున్న కథ అని మేకర్స్‌ సినిమా ప్రారంభంలోనే కుండబద్దలు కొట్టారు. వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ తన ఛార్జిషీట్‌లో పొందుపొరచిన అంశాలే కథకు ఆధారమని తెలిపారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతీరెడ్డి, తల్లి విజయమ్మ, సోదరి సునీతారెడ్డి, అవినాష్‌రెడ్డి సహా ఇతర పాత్రల పేర్లను కూడా నేరుగానే వాడేశారు. ఆ పాత్రలు పోషించిన నటీనటుల రూపురేఖలు, వారి హావభావాలు సైతం అచ్చు గుద్దినట్లు దించడం ప్రేక్షకులను మెప్పించింది. ‘హూ కిల్డ్‌ బాబాయ్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ సినిమాలో వివేకా హత్యలో పాత్రధారులు, సూత్రధారులతో పాటు పథక రచన నుంచి అమలు వరకూ ప్రతి పాయింట్‌ను సాధికారికంగా చూపించిన తీరు బాగుందని నెటిజన్లు దర్శకుణ్ణి ప్రశంసిస్తున్నారు. ‘దస్తగిరి కదిరికి పోయినాడు... గొడ్డలి తీసుకొస్తున్నాడు’ లాంటి డైలాగ్‌లు జనం నోళ్లలో నానుతున్నాయి. ‘నిజం తెలియాలంటే చూడండి’ అంటూ నెటిజన్లు ‘వివేకం’ సినిమా లింకులను షేర్‌ చేస్తున్నారు. ‘ప్రతి ఒక్కరూ వివేకంతో ఆలోచించి ‘వివేకం’ చిత్రం చూడాలని ప్రజలను కోరుతున్నారు. దీంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రామ్‌గోపాల్‌ వర్మ లాంటి వాళ్లు ఈ సినిమా టేకింగ్‌ను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు ఓ సలహా పడేస్తున్నారు.

Updated Date - Apr 01 , 2024 | 01:47 AM