దర్శకుడిగా సంతృప్తినిచ్చింది

ABN , Publish Date - Jul 22 , 2024 | 03:39 AM

‘నటుడిగా నన్ను మీ గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ‘రాయన్‌’ చిత్రంతో దర్శకుడిగా మీ ముందుకు వస్తున్నాను. సినిమా చూసి నచ్చితే తెలుగు ప్రేక్షకులు అంతా మీ ఆశీస్సులు అందించాలి’ అని హీరో ధనుష్‌ కోరారు...

‘నటుడిగా నన్ను మీ గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ‘రాయన్‌’ చిత్రంతో దర్శకుడిగా మీ ముందుకు వస్తున్నాను. సినిమా చూసి నచ్చితే తెలుగు ప్రేక్షకులు అంతా మీ ఆశీస్సులు అందించాలి’ అని హీరో ధనుష్‌ కోరారు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్‌’. ఈ నెల 26న విడుదలవుతోంది. సన్‌పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రాని ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ధనుష్‌ మాట్లాడుతూ ‘‘నేను అదృష్టవంతుణ్ణి. సినిమాల్లోకి వచ్చాక నాకు అన్నీ కలసి వచ్చాయి. మంచి దర్శకులు, నిర్మాతలతో పనిచేసే అవకాశం నాకు దక్కింది. వారందరి కృషి వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నాను. దర్శకుడిగా నాకు సంతృప్తిని ఇచ్చిన చిత్రం ‘రాయన్‌’ అన్నారు. సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘ధనుష్‌ అన్న నన్ను పిలిచి ఈ సినిమా చేయమన్నాడు. ఆయన మీద నమ్మకంతో కథ కూడా వినకుండా ఈ సినిమా అంగీకరించాను.


ధనుష్‌ తన కోసం రాసుకున్న పాత్రను నాకు ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో నటించడం నా అదృష్టం’ అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న నటుడు ధనుష్‌. ఆయనకు ‘రాయన్‌’ చిత్రంతో మరో ఘన విజయం దక్కాలి. ‘గేమ్‌ఛేంజర్‌’ సినిమాతో క్రిస్మస్‌కు కలుద్దాం’ అన్నారు. సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘ధనుష్‌ చిన్నప్పటి నుంచే నాకు తెలుసు. రాయన్‌లో ఒక పాటకు లిరిక్స్‌ కూడా అందించాడు. ఆయనకు సినిమాపై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం. ‘రాయన్‌’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అన్నారు.

ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నటించినవాళ్లందరిలో ఓ ఆకలి కనిపిస్తోంది. గొప్ప నటులను ఒకతాటిపైకి తెచ్చాడు ధనుష్‌. ఆయన ఇప్పుడు ఒక దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తనలో క్లారిటీ ఉంది. కొన్ని తరాలకు అతనో స్ఫూర్తి’ అని చెప్పారు.

Updated Date - Jul 22 , 2024 | 03:41 AM