అరవై మంది భద్రతా సిబ్బంది రక్షణలో సల్మాన్
ABN , Publish Date - Oct 19 , 2024 | 06:28 AM
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఆయన తన భద్రతను కట్టుదిట్టం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఆయన తన భద్రతను కట్టుదిట్టం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా రూ.రెండు కోట్లు వెచ్చించి దుబాయ్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారు ‘నిస్సాన్ పెట్రోల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్’ని దిగుమతి చేసుకున్నారు. సల్మాన్‌కు ఇదివరకే ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు ఉండగా, ఇది రెండోది. ఖరీదుకు తగ్గట్టుగానే ఈ కారులో అధునాతన సౌకర్యాలతోపాటు ప్రత్యేకించి ప్రమాదాల నుంచి గట్టెక్కించే రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. అంటే.. బాంబు అలెర్ట్ ఇండికేటర్స్, అతి సమీపం నుంచి కాల్పులు జరిపినా తట్టుకునే బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, కారులో ప్రయాణిస్తున్న వారిని బయటి వారు గుర్తించకుండా ఉండేలా టింటెడ్ విండోస్ వంటివి. ప్రస్తుతం ఈ కారు ఇండియాలో లభించడం లేదు.
రూ. ఐదు కోట్లు చెల్లిస్తే...
ఇదిలా ఉండగా.... ‘ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తే సల్మాన్‌ని క్షమించి విడిచి పెడతాం, లేదంటే బాబా సిద్దీఖికి పట్టిన గతే పడుతుంది’ అని హెచ్చరిస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముంబై పోలీసులకు వచ్చిన తాజా బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం సల్మాన్‌కు ఉన్న గన్‌మెన్‌ల సంఖ్యను ఎనిమిది నుంచి పదికి పెంచారు. 24 గంటలు సల్మాన్ భద్రతను పర్యవేక్షించేందుకు ఆయన నివాసమైన గెలక్సీ అపార్ట్‌మెంట్‌లో ప్రత్యేకంగా కమాండ్ సెంటర్‌ను ముంబై పోలీసులు ఏర్పాటు చేశారు.
‘బిగ్ బాస్’ హౌస్‌లో...
మరో వైపు... సల్మాన్ కొంత కాలం పాటు ‘బిగ్ బాస్ షో’ హోస్టింగ్‌కు దూరంగా ఉంటారనే వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ ‘బిగ్ బాస్ 18’ షూటింగ్ కోసం సల్మాన్ సన్నద్దమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ముంబై పోలీసులు షూటింగ్ సెట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 60 మంది భద్రతా సిబ్బంది సెట్‌లో ఉంటూ సల్మాన్‌ను నిరంతరం పర్యవేక్షించనున్నారు. బయటి వారికి సెట్‌లోకి అనుమతి లేదని, షోకు సంబంధించిన సిబ్బంది సైతం గుర్తింపు కార్డు చూపించిన తరవాతే లోనికి అడుగు పెట్టేలా పోలీసులు చర్యలు చేపట్టారు.