అనుకున్న సమయానికే..

ABN , Publish Date - Mar 15 , 2024 | 05:09 AM

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌...

అనుకున్న సమయానికే..

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్ర ప్రసాద్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి భారీ తారాగణం ఇందులో నటిస్తున్నారు. అశ్వినీదత్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా మే 9న ప్రేక్షకులను కనువిందు చేస్తుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ కావచ్చని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ తన బ్లాగులో ఈ చిత్రం గురించి రాశారు. ‘‘కల్కి మూవీ షూటింగ్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి మళ్లీ ఆలస్యమైంది. చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. ముందుగా అనుకున్న సమయానికే మే 9నే ఈ చిత్రం వస్తోంది. ప్రేక్షకులకు అనిర్వచనీయమైన అనుభూతిని అందించే విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చిత్ర బృందం అహర్నిశలు శ్రమిస్తోంది’’ అని తన బ్లాగులో పేర్కొన్నారు. దీంతో ఈ చిత్రం విడుదలపై వస్తున్న అసత్య ప్రచారాలకు చెక్‌ పడినట్లైంది.

Updated Date - Mar 15 , 2024 | 05:09 AM