మాస్టర్స్‌ పట్టా అందుకున్న అనా కొణిదెల

ABN , Publish Date - Jul 21 , 2024 | 01:48 AM

ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సతీమణి అనా కొణిదెల సింగపూర్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. ఆమెకు ఇది రెండో మాస్టర్స్‌ డిగ్రీ. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లో శనివారం వైభవంగా జరిగిన స్నాతకోత్సవంలో...

స్నాతకోత్సవానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సతీమణి అనా కొణిదెల సింగపూర్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. ఆమెకు ఇది రెండో మాస్టర్స్‌ డిగ్రీ. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లో శనివారం వైభవంగా జరిగిన స్నాతకోత్సవంలో ఆమె పట్టా స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానంలో ఆమె ఈ మాస్టర్స్‌ చేశారు. స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు భార్యతో కలిసి వెళ్లిన పవన్‌.. మాస్టర్స్‌ పట్టా పొందిన సందర్భంగా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. అనా కొణిదెల రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ స్టేట్‌ యూనివర్సిటీలో చదివారు. అక్కడ ఓరియంటల్‌ స్టడీస్‌లో హానర్స్‌ పట్టా పొందారు. ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై అధ్యయనానికి తొలుత డిగ్రీ పొందారు. ఆ అధ్యయనంలో థాయిలాండ్‌ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్‌గా ఉంది.


సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఉండగానే ఆమె మూడు భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్‌ యూనివర్సిటీ నుంచి థాయ్‌ స్టడీస్‌లో అనా మొదటి మాస్టర్స్‌ డిగ్రీ సాధించారు. కాగా, పవన్‌ దంపతులు సింగపూర్‌ నుంచి నేడు విజయవాడ రానున్నారు.

అమరావతి, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jul 21 , 2024 | 01:48 AM