రీల్‌ లైఫ్‌ ప్రేమికులు.. రియల్‌ లైఫ్‌ దంపతులు..!

ABN , Publish Date - Oct 16 , 2024 | 06:24 AM

రీల్‌ లైఫ్‌లో ప్రేమికులుగా నటించారు. ప్రేక్షకులను మెప్పించారు. అంతేనా...అవే జంటలు రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమలో పడ్డాయి. ఆ ప్రేమను వివాహ బంధంతో పెనవేశారు. ఆదర్శవంతమైన జీవితం గడిపారు. అన్యోన్య దంపతులుగా...

రీల్‌ లైఫ్‌లో ప్రేమికులుగా నటించారు. ప్రేక్షకులను మెప్పించారు. అంతేనా...అవే జంటలు రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమలో పడ్డాయి. ఆ ప్రేమను వివాహ బంధంతో పెనవేశారు. ఆదర్శవంతమైన జీవితం గడిపారు. అన్యోన్య దంపతులుగా గుర్తింపు పొందారు. కృష్ణ- విజయ నిర్మల, రాజశేఖర్‌- జీవిత, నాగార్జున-అమల, శ్రీకాంత్‌-ఊహా, మహేశ్‌ బాబు- నమ్రత జంటలు ఈ కోవకే చెందుతాయి. వీరిని ఆదర్శంగా తీసుకున్నారు నేటి తరం టాలీవుడ్‌ హీరో- హీరోయిన్లు.

  • 2014లో విడుదలైన ‘ముకుంద’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు కొణిదెల సాయి వరుణ్‌ తేజ్‌. ఆ తరవాత కంచె, ఫిదా, లోఫర్‌, ఎఫ్‌3 వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించారు. 2012లో అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు లావణ్య త్రిపాఠి. 2017లో విడుదలైన మిస్టర్‌ సినిమాలో వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి తొలిసారిగా కలిసి నటించారు. ఆ తరవాత వచ్చిన ‘అంతరిక్షం’లోనూ ఈ జంట ప్రేక్షకులను మెప్పించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. గతేడాది నవంబరులో వీరిద్దరు వివాహం చేసుకున్నారు.


  • నాగ చైతన్య అక్కినేని, శోభిత ధూళిపాళ్ల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం ఇటీవల జరిగింది. 2017లో సమంతను నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత నాగ చైతన్య, శోభిత చాలా సార్లు కలిసి కనిపించారు. వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఎవరూ స్పందించకపోయినప్పటికీ నిశ్చితార్థంతో వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘మంకీ మ్యాన్‌’ హాలివుడ్‌ సినిమాలో శోభిత ధూళిపాళ్ల నటించారు. ప్రస్తుతం ‘సితార’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరి పెళ్లి ఎప్పుడనే విషయం తరవాత వెల్లడికానుంది.


  • ‘బాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నారా రోహిత్‌, ఆ తరవాత అసుర, సుందరకాండ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించారు. ‘ప్రతినిధి 2‘లో నారా రోహిత్‌ సరసన నటించారు సిరి లేళ్ల. ఈ సినిమా షూటింగ్‌ కొనసాగుతుండగానే వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. దాంతో ఇటీవల బంధు, మిత్రుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. సిరి లేళ్ల తెలుగమ్మాయే. ఏపీలోని రెంట చింతల ఆమె స్వగ్రామం. ఆస్ట్రేలియాలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఆమె నటనపై మక్కువతో ఇండియాకు తిరిగి వచ్చారు. వీరి వివాహం డిసెంబరులో జరగనుంది.

  • ‘రాజా వారు రాణిగారు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌. తొలి చిత్రంతోనే అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిజ జీవితంలోనూ ప్రేమికులుగా మారారు. అయితే ఐదేళ్లు ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన తమ నిశ్చితార్థంతో ప్రేమ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. ఈ ఏడాది ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్‌లో వివాహం చేసుకున్నారు. కాగా, కిరణ్‌, రహస్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే. సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం కిరణ్‌ నటిస్తున్న ‘క’ చిత్ర నిర్మాణ వ్యవహారాలను రహస్య పర్యవేక్షిస్తున్నారు.


  • ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఆది పినిశెట్టి. వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించాడు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా సపోర్టింగ్‌ రోల్స్‌ కూడా చేస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. 2016లో ‘కృష్ణాష్టమి’ లో సునీల్‌ సరసన నటించడం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు నిక్కీ గల్రానీ. ఆ తరవాత ఆది పినిశెట్టితో కలిసి ‘మలుపు, మరకతమణి’ చిత్రాల్లో నటించారు. ‘మలుపు’ సినిమా వీరిద్దరి జీవితాల్ని ప్రేమ వైపు మలుపు తిప్పింది. 2022 మే నెలలో వీరిద్దరి వివాహం జరిగింది.


  • 2007లో విడుదలైన ‘హ్యాపీడే్‌స’తో తెలుగు తెరపై అరంగేట్రం చేశారు వరుణ్‌ సందేశ్‌. ఆ చిత్ర విజయంతో వరుసగా అవకాశాలు చేజిక్కించుకుని నటునిగా స్థిరపడ్డాడు. 2025లో విడుదలైన ‘పడ్డామండి ప్రేమలో మరి’ సినిమాలో వరుణ్‌ సందేశ్‌ సరసన హీరోయిన్‌గా నటించారు వితిక షేరు. సినిమా షూటింగ్‌ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. 2016లో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

Updated Date - Oct 16 , 2024 | 06:24 AM