సినీరంగంలోనూ రామోజీ రావుది ప్రత్యేక ముద్ర

ABN , Publish Date - Jun 09 , 2024 | 04:57 AM

పత్రికారంగంలోనే కాదు చిత్రనిర్మాణ రంగంలోకి ప్రవేశించి తనదైన ముద్ర వేశారు రామోజీరావు. ‘ఈ ఉషాకిరణాలు.. తిమిర సంహరణాలు’ అంటూ ఆణిముత్యాల వంటి సినిమాలను అందించారు. స్టార్స్‌ వెంట పరిగెత్తకుండా కథకు, కళకు...

సినీరంగంలోనూ రామోజీ రావుది ప్రత్యేక ముద్ర

సినీరంగంలోనూ రామోజీ రావుది ప్రత్యేక ముద్ర

పత్రికారంగంలోనే కాదు చిత్రనిర్మాణ రంగంలోకి ప్రవేశించి తనదైన ముద్ర వేశారు రామోజీరావు. ‘ఈ ఉషాకిరణాలు.. తిమిర సంహరణాలు’ అంటూ ఆణిముత్యాల వంటి సినిమాలను అందించారు. స్టార్స్‌ వెంట పరిగెత్తకుండా కథకు, కళకు ప్రాధాన్యం ఇస్తూ ఆయన నిర్మించిన పలు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ పేరుతో తొలిసారిగా కామెడీ ఎంటర్‌టైనర్‌ను అందించినా ఆ తర్వాత ఆయన మనసుని హత్తుకొనే కథలతో చిత్రాలు నిర్మించారు. వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించి, ఎందరో ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించారు. సినిమా నిర్మాణం వ్యాపారంగా ఆయన ఎప్పుడూ చూడలేదు. యథార్థ కథలను ఎన్నుకుని స్పూర్తివంతమైన చిత్రాలు నిర్మించారు.


నిర్మాతగా ఎందుకు మారారంటే..

అక్షర యోధుడిగా పేరు తెచ్చుకున్న రామోజీరావు నిర్మాతగా మారడానికి వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉంది. అదేమింటే.. 1976లో ‘సితార’ సినీ వార పత్రికను ప్రారంభించిన ఆయన ప్రతి ఏటా ఉత్తమ చిత్రాలను, ప్రతిభ ప్రదర్శించిన కళాకారులను ఎంపిక చేసి ‘సితార’ అవార్డులతో సత్కరించేవారు. ఎంతో ఘనంగా జరిగే ఈ అవార్డు వేడుకకి చిత్ర పరిశ్రమ యావత్తు హాజరయ్యేది. ఆ రోజుల్లో సితార అవార్డు అందుకోవడం ఒక గౌరవంగా భావించేవారు సినీ కళాకారులు. ఇలా మూడేళ్ల పాటు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అవార్డుల వేడుకలు నిర్వహించే వారు రామోజీరావు. ఇలా అవార్డు వేడుకలు కాకుండా మీరే నిర్మాతగా మారి సినిమాలు తీయవచ్చు కదా అని సినీ ప్రముఖులు చెప్పిన మాటతో ఉత్తేజం పొందిన రామోజీరావు చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు.

పంపిణీరంగంలోనూ..

తను తీసే సినిమాలను ప్రేక్షకులకు అందించడానికి సరైన పంపిణీదారుడు కావాలని గుర్తించిన రామోజీరావు ఆ రంగంలోకి కూడా ప్రవేశించారు. మయూరి పేరుతో ఆయన ఏర్పాటు చేసిన పంపిణీ సంస్థ ఉషాకిరణ్‌ మూవీస్‌ చిత్రాలనే కాదు బయటి సినిమాలనూ పంపిణీ చేసింది. అలాగే ‘మయూరి’ పేరుతో ఆడియో సంస్థను కూడా నెలకొల్పి ఆడియో రంగంలోనూ రాణించారు రామోజీరావు.


తన పేరుతో ఫిల్మ్‌ సిటీ

అంతవరకూ ఏ సంస్థకూ తన పేరు పెట్టుకోని రామోజీరావు తొలిసారిగా ‘రామోజీ ఫిల్మ్‌ సిటీ’ అంటూ తన పేరుతో ఓ సినీ నగరాన్ని నిర్మించి అభిరుచిని చాటుకున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ ఫిల్మ్‌ సిటిలో వివిధ భాషల షూటింగ్స్‌కు నిలయంగా మారింది.

నేడు షూటింగ్స్‌ బంద్‌

రామోజీ రావు మృతికి సంతాపం ప్రకటిస్తూ తెలుగు చిత్ర సీమ ఆదివారం జరిగే సినిమా షూటింగులన్నింటిని కాన్సిల్‌ చేసింది. ఈ మేరకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ ప్రకటనను విడుదల చేసింది.

నందమూరి హీరోల పరిచయం

స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా 2001లో పరిచయం చేశారు రామోజీరావు. అలాగే నందమూరి కల్యాణ్‌రామ్‌ను కూడా 2003లో ‘తొలి చూపులోనే’ చిత్రంతో హీరోగా పరిచయం చేశారు రామోజీరావు. నందమూరి హరికృష్ణ తనయులైన వీరిద్దరూ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్‌ను కూడా ‘నీతో’ సినిమాతో హీరోగా పరిచయం చేశారు. శ్రీకాంత్‌, తరుణ్‌, వినోద్‌కుమార్‌ కూడా ఉషాకిరణ్‌ మూవీస్‌ చిత్రాల ద్వారానే హీరోలుగా పరిచయమయ్యారు.


వేటూరి మాట.. బాలు పాట

సాధారణంగా ప్రతి సినిమా బ్యానర్‌ లోగోకు ఓ సిగ్నేచర్‌ మ్యూజిక్‌ ఉంటుంది. కానీ నలుగురి కంటే భిన్నంగా ఆలోచించే రామోజీరావు వేటూరితో ‘ఈ ఉషాకిరణాలు.. తిమిర సంహరణాలు’ అంటూ లోగో సాంగ్‌ను రాయించి, బాలుతో పాడించారు. అందుకే రామోజీరావు చిత్రాలలాగానే ఆయన బ్యానర్‌ లోగో సిగ్నేచర్‌ ట్యూన్‌ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రంతో మొదలైన రామోజీరావు సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుత చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. ప్రమాదంలో కాలు పోగొట్టుకుని, కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధాచంద్రన్‌ జీవిత కథనే ‘మయూరి’ చిత్రంగా మలిచారు. ఇందులో సుధాచంద్రనే నటించడం గమనార్హం. అలాగే రౌడీయిజం, గుండాయిజంపై తిరగబడిన ఓ యువతి స్ఫూర్తివంతమైన కథతో ‘ప్రతిఘటన’ చిత్రాన్నీ, ఒడిశాలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ‘మౌన పోరాటం’ చిత్రాన్ని, పరుగుల రాణి అశ్వనీ నాచప్పను నటిగా పరిచయం చేస్తూ ‘అశ్వని’ చిత్రాన్ని నిర్మించి తన ప్రత్యేకత చాటుకున్నారు రామోజీరావు. వీటితో పాటు ‘నువ్వే కావాలి’, ‘నచ్చావులే’, ‘నువ్విలా’ వంటి యూత్‌ఫుల్‌ సినిమాలనూ రూపొందించి అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించారు రామోజీరావు.


నటుడిగా ఓ చిత్రంలో

సినిమా అంటే ఆసక్తి కలిగిన రామోజీరావు 1978లో వచ్చిన ‘మార్పు’ చిత్రంలో న్యాయ మూర్తిగా అతిధి పాత్రను పోషించారు. యు.విశ్వేశ్వరరావు స్యీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో రామోజీరావుది చిన్న పాత్రే. అయినా పత్రికాధిపతిగా ఆయనకి ఉన్న ఇమేజ్‌ వల్ల సినిమా పోస్టర్స్‌లో ఆయన ఫొటోను కూడా ప్రముఖంగా వాడారు.

Updated Date - Jun 10 , 2024 | 10:31 AM