రజనీకి తీవ్ర అస్వస్థత
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:34 AM
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. సోమవారం అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకులు ఆయన్ని గ్రీమ్స్‌రోడ్డులో వున్న అపోలో ఆసుపత్రిలో చేర్పించారు...
రక్తనాళంలో వాపు
స్టెంట్ వేసిన వైద్య బృందం
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. సోమవారం అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకులు ఆయన్ని గ్రీమ్స్‌రోడ్డులో వున్న అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. రజనీ అనారోగ్యం గురించి తెలియగానే ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని, రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని మంగళవారం ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి. ‘గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళం (బృహద్దమని)లో వాపు వచ్చింది. దీనికి శస్త్రచికిత్స చేయకుండా ట్రాన్స్‌కాథెటర్ విధానం ద్వారా చికిత్స చేయడం జరిగింది. సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ సారథ్యంలోని వైద్య బృందం స్టెంట్ వేసి, వాపును సరిచేశారు. ఎండోవాస్కులర్ రిపేర్ ప్రణాళికాబద్ధంగా సాగిందని ఆయన శ్రేయోభిలాషులకు, అభిమానులకు తెలియజేయాలనుకుంటున్నాం. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళతారు’ అని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నాయి.
ఇదిలా వుండగా రజనీ త్వరగా కోలుకోవాలంటూ తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులు ఆకాంక్షించారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం స్వయంగా ఆసుపత్రికి వెళ్లి రజనీ ఆరోగ్యంపై వాకబు చేశారు. రజనీ క్షేమంగా వున్నారని, కోలుకుంటున్నారని మంత్రి ప్రకటించారు.
చెన్నై(ఆంధ్రజ్యోతి)