రజనీ.. ఓ సుప్రీమ్‌ స్టార్‌

ABN , Publish Date - Sep 22 , 2024 | 02:38 AM

రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ 33 ఏళ్ల తర్వాత కలసి నటించిన సినిమా ‘వేట్టయాన్‌’. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌ గురించి రజనీకాంత్‌...

రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ 33 ఏళ్ల తర్వాత కలసి నటించిన సినిమా ‘వేట్టయాన్‌’. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌ గురించి రజనీకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఒకానొక సమయంలో అమితాబ్‌ బచ్చన్‌ సినీ నిర్మాతగా భారీ అర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. తన దగ్గర పనిచేసే వాచ్‌మెన్‌కు కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాక తనకు ఎంతో ఇష్టమైన జూహూ ఇంటిని వేలానికి పెట్టారు. అప్పడు బాలీవుడ్‌ మొత్తం ఆయన్ను చూసి నవ్వింది. కానీ ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి కోలుకుని.. మరో మూడేళ్లలో.. వరుస సినిమాలు..‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షోతో మళ్లీ నిలదొక్కుకున్నారు. జూహూలోని తన ఇంటితో పాటు మరో మూడు ఇళ్లను అమితాబ్‌ తిరిగి కొనుగోలు చేశారు’’ అని రజనీ చెప్పారు. ఈ వేడుకకు హాజరు కాలేకపోయినా.. అమితాబ్‌ ఓ వీడియో పంపి అభిమానులను ఖుషీ చేశారు. ఆ వీడియోలో అమితాబ్‌ మాట్లాడుతూ ‘‘ఇది నా తొలి తమిళ చిత్రం.


రజనీకాంత్‌.. అందరిలో ఓ సుప్రీమ్‌ స్టార్‌. 1991లో రజనీ, నేను కలసి నటించిన చిత్రం ‘హమ్‌’. ఇందులో రజనీ నా సోదరుడిగా నటించారు. షూటింగ్‌ విరామంలో నేను ఏ.సీ కార్‌లో విశ్రాంతి తీసుకునే సమయంలో.. రజనీ ఫిల్మ్‌ సెట్స్‌లో కింద పడుకునేవారు. ఈ చిన్న ఉదాహరణ చాలు ఆయన ఎంత సింపుల్‌గా ఉంటారో చెప్పడానికి’’ అని అన్నారు.

అమితాబ్‌ కోసం ప్రకాశ్‌రాజ్‌...

ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ పాత్ర తమిళ్‌ వెర్షన్‌కు నటుడు ప్రకాశ్‌రాజ్‌ డబ్బింగ్‌ చెప్పడం విశేషం. సినిమాలో రజనీ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా కనిపించనున్నారు. అమితాబ్‌, రజనీకి సీనియర్‌గా సత్యదేవ్‌ అనే పాత్రలో నటిస్తున్నారు. టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్‌ 10న విడుదలవుతోంది.

Updated Date - Sep 22 , 2024 | 02:38 AM