రాజేంద్రప్రసాద్‌ ఇంట విషాదం

ABN , Publish Date - Oct 06 , 2024 | 03:09 AM

సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి (38) హఠాన్మరణమే ఇందుక్కారణం. శుక్రవారం రాత్రి ఛాతీలో నొప్పితో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో....

గుండెపోటుతో కూతురు గాయత్రి మృతి

సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి (38) హఠాన్మరణమే ఇందుక్కారణం. శుక్రవారం రాత్రి ఛాతీలో నొప్పితో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆమె.. చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. మరణానికి కారణం గుండెపోటని డాక్టర్లు తెలిపారు. సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేశ్‌, అల్లుఅర్జున్‌, సాయికుమార్‌, ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌తో పాటు కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.


కూతురిలో తల్లిని చూసుకుంటూ...

2018లో ‘బేవర్స్‌’ అనే సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో భావోద్వేగానికి గురయ్యారు రాజేంద్ర ప్రసాద్‌. ఆ వేడుకలో ఆయన మాట్లాడుతూ ‘‘నా పదవ ఏట అమ్మను కోల్పోయాను. అమ్మ నన్ను వదిలివెళ్లడంతో తట్టుకోలేకపోయాను. నా జీవితమంతా అమ్మ లేని లోటు నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ గాయత్రి పుట్టాక.. తనలోనే అమ్మను చూసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు, నా కూతురికి మాటలు లేవు. నా అంగీకారం లేకుండానే తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుంచి తనతో మాట్లాడటం మానేశాను. ఈ సినిమా కోసం సుద్దాల అశోక్‌ తేజ రాసిన పాట ‘తల్లీ తల్లీ నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా.. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా’ విన్నాను. విన్న వెంటనే నా కళ్ల నిండా కన్నీళ్లొచ్చాయి. ఆ రోజు సాయంత్రం నా కూతురిని ఇంటికి పిలిపించి ఈ పాటను నాలుగు సార్లు తనకి వినిపించాను. ఆ పాట విన్నాక నా కూతురిపై కోపం పోయింది. అమ్మ చనిపోయినప్పుడు ఎలా అయితే ఏడ్చానో.. అలా ఏడ్చేశా’’ అని అన్నారు. కాగా, రాజేంద్రప్రసాద్‌కు తన కూతురు గాయత్రి అంటే పంచప్రాణాలు.


ఈ మధ్యనే తనకు ఓ ఖరీదైన కారు, విలాసవంతమైన భవంతిని బహుమతిగా ఇచ్చారు. గాయత్రి న్యూట్రీషియని్‌ష్టగా పనిచేసేవారు. కే.పీ.హెచ్‌.బీలోని తన భర్త రాజ్‌ కుమార్‌, కూతురు సాయితేజస్వినితో ఉండేవారు. సాయితేజస్విని 2018లో విడుదలైన ‘మహానటి’ సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రతో బాలనటిగా వెండితెరపై అరంగేట్రం చేసింది. ఆ తర్వాత మూడు సినిమాల్లో నటించింది. కేపిహెచ్‌బీలోని ఇందు ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ విల్లా నెంబర్‌ 266లో ఉన్న రాజేంద్రప్రసాద్‌ నివాసానికి గాయత్రి పార్థీవ దేహాన్ని తీసుకొచ్చారు. అక్కడకు రాజకీయ సినీ ప్రముఖులు వచ్చి పార్థీవ దేహానికి నివాళులర్పించారు. కేపీహెచ్‌బీ ఏడో పేజ్‌లోనీ హిందూ స్మశాన వాటికలో నేడు ఉదయం పది గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Oct 06 , 2024 | 03:09 AM