రాజ్‌తరుణ్‌ మాస్‌ హీరోగా నిలబడతాడు

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:09 AM

ఇంతవరకూ వినోదభరితమైన పాత్రలతో అందరినీ నవ్వించిన యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ ఇప్పుడు పవర్‌పుల్‌ యాక్షన్‌ చిత్రం ‘తిరగబడరా సామీ’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు...

raj tharun

ఇంతవరకూ వినోదభరితమైన పాత్రలతో అందరినీ నవ్వించిన యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ ఇప్పుడు పవర్‌పుల్‌ యాక్షన్‌ చిత్రం ‘తిరగబడరా సామీ’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మాల్వీ మల్హోత్రా కథానాయికగా నటించారు. ఎ.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ ‘అందరం ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాం. ముఖ్యంగా డీవోపీ జవహర్‌రెడ్డి అద్బుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. సినిమాలో ఇంత యాక్షన్‌ పార్ట్‌ చేయడం నాకు కొత్త. అయినా దర్శకుడి ప్రోత్సాహంతో ఈజీగా చేశాను. ఇందులో ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా బాగుంటాయి. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత శివకుమార్‌కు నా ధన్యవాదాలు’ అని చెప్పారు. ‘నేను దర్శకత్వం వహించిన ‘యజ్ఞం’ చిత్రం ఇదే రోజున విడుదలై నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. అదే ఈ రోజున ‘తిరగబడరా సామీ’ ట్రైలర్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది. రాజ్‌తరుణ్‌ ఈ సినిమాతో మాస్‌ హీరోగా నిలబడతాడు. నిర్మాత చాలా గ్రాండ్‌గా సినిమాని తీశారు. అందరినీ ఆకట్టుకొనే చిత్రమిది’ అని చెప్పారు రవికుమార్‌.


‘ఇందులో బాలకృష్ణ అభిమానిగా నటించా. చాలా బ్యూటిఫుల్‌ కథ ఇది. సినిమాలో ఓ ఫైట్‌ కూడా చేశా. ఈ చిత్రంతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా ఉంది’ అన్నారు హీరోయిన్‌ మాల్వి. నిర్మాత శివకుమార్‌ మాట్లాడుతూ ‘రవికుమార్‌ చెప్పిన కథ బాగా నచ్చింది. ఇందులో రాజ్‌తరుణ్‌ హీరోగా నటిస్తే బాగుంటుందని ఆయన్ని అడిగితే వెంటనే అంగీకరించారు. యాక్షన్‌ పాత్రలో ఆయన కొత్తగా కనిపిస్తారు. ప్రతి సినిమాతో నేను కొత్తవారిని పరిచయం చేస్తుంటాను. ఈ సినిమాతో హీరోయిన్‌ మాల్వి పరిచయమవుతోంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పారు.

Updated Date - Jul 03 , 2024 | 08:38 AM