ఒకరోజు ముందుగానే వస్తున్న పుష్ప2

ABN , Publish Date - Oct 25 , 2024 | 02:35 AM

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’. ఈ చిత్రానికి మొదట అనుకున్న విడుదల తేదీ డిసెంబర్‌ 6. అయితే ఒక రోజు ముందుగా.. అంటే.. డిసెంబరు 5నే థియేటర్లలో సందడి చేయనుంది. నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌...

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’. ఈ చిత్రానికి మొదట అనుకున్న విడుదల తేదీ డిసెంబర్‌ 6. అయితే ఒక రోజు ముందుగా.. అంటే.. డిసెంబరు 5నే థియేటర్లలో సందడి చేయనుంది. నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ ఈ విషయాన్ని ఓ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ ‘‘ఈ సినిమా యూఎస్‌ ప్రీమియర్స్‌ డిసెంబరు 4న ప్రారంభమవుతాయి. లాంగ్‌ వీకెండ్‌ కలిసొస్తుందనే ఉద్ధేశంతో ఇండియాలోనూ డిసెంబరు 5, గురువారం విడుదల చేస్తున్నాం. అందరి అంచనాలకు మించేలా సినిమా ఉండనుంది’’ అని చెప్పారు. ‘‘అల్లు అర్జున్‌ ఈ సినిమా కోసం.. తన వంద శాతం ఎఫర్ట్‌ పెడుతున్నారు. ఆయన బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ను ఈ చిత్రంలో చూస్తారు. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్‌ అందరికీ మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో జాతర ఎపిసోడ్‌ థియేటర్లో పూనకాలు తెప్పిస్తుంది’’ అని వై.రవిశంకర్‌ అన్నారు.


ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఇదీ

  • ‘పుష్ప2’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ సుమారు రూ.1000 కోట్లు. ఇందులో ఇప్పటి వరకు అయిన నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.420 కోట్లు

  • థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా ఏపీ, తెలంగాణ - రూ.220 కోట్లు, నార్త్‌ ఇండియా - రూ.200 కోట్లు, తమిళనాడు-రూ.30 కోట్లు, కర్ణాటక - రూ.30 కోట్లు, కేరళ- రూ.20 కోట్లు, విదేశీ మార్కెట్‌-140 కోట్లు బిజినెన్‌ అయ్యింది.


ఎన్ని థియేటర్లలో..

  • విదేశాల్లో అన్ని భారతీయ భాషల్లో కలిపి 3000 లోకేషన్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

  • కర్ణాటకలో 500 థియేటర్లలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. కేజీఎఫ్‌-2 350 సింగిల్‌ స్ర్కీన్స్‌, 80 మల్టీప్లెక్స్‌ థియేటర్లలో రిలీజ్‌ అయ్యింది. కర్ణాటకలో ఇప్పటి వరకు కేజీఎఫ్‌, కేజీఎఫ్‌-2 రూ.90 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించాయి. ఇక్కడ తెలుగు సినిమాల్లో బాహుబలి-1 దాదాపు రూ.30 కోట్లు, బాహుబలి-2 రూ.70 కోట్లు, పుష్ప-1 సుమారు రూ.20 కోట్లు వసూళ్లు చేశాయి. అయితే పుష్ప-2 రూ.80 నుంచి 100 కోట్ల వరకు వసూలు చేస్తుందన్న నమ్మకాన్ని కర్నాటక డిస్ట్రిబ్యూటర్‌ లక్ష్మీకాంత్‌ వ్యక్తం చేశారు.

  • తమిళనాడులో సాధారణంగా రజనీకాంత్‌, విజయ్‌, అజిత్‌ సినిమాలకు మాత్రమే ఒపెనింగ్‌ రోజు డబుల్‌ డిజిట్‌ కలెక్షన్లు వస్తుంటాయి. తాజా చిత్రం ‘గోట్‌’ని 800 స్ర్కీన్లలో రిలీజ్‌ చేశారు. పుష్ప-2ను 539 లోకేషన్లలో 806 స్ర్కీన్లలో విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్‌ మాలి ప్లాన్‌ చేశారు.


  • కేరళలో 24 గంటలూ ఏకధాటిగా షోలు వేయాలని కోరుతున్నామని, తద్వారా విజయ్‌ సినిమా లియో రికార్డులను బ్రేక్‌ చేసే అవకాశం ఉంటుందని కేరళ డిస్ట్రిబ్యూటర్‌ ముకేశ్‌ మెహతా తెలిపారు. లియో ఓపెనింగ్‌ డే రికార్డు రూ.12 కోట్లు. దీన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

  • నార్త్‌ ఇండియాతోపాటు పశ్చిమ బెంగాల్‌లో కూడా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి సుమారు రూ.450 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు వసూళ్లు వచ్చే అవకాశమున్నదని డిస్ట్రిబ్యూటర్‌ అనిల్‌ తడాని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 25 , 2024 | 02:35 AM