TCCP : సమస్యలివి... పరిష్కారాలేవి?

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:00 AM

మన జీవితాల్లో సినిమాలు ఒక అంతర్భాగం. సినిమాలను.. వాటిలో నటించే నటీనటులను.. తీసే దర్శకులను విమర్శిస్తూ ఉంటాం. ప్రశంసిస్తూ ఉంటాం. మన ఇంట్లో మనుషులుగా చూసుకుంటూనే ఉంటాం. అలాంటి సినీ పరిశ్రమ పదేళ్లగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది....

మన జీవితాల్లో సినిమాలు ఒక అంతర్భాగం. సినిమాలను.. వాటిలో నటించే నటీనటులను.. తీసే దర్శకులను విమర్శిస్తూ ఉంటాం. ప్రశంసిస్తూ ఉంటాం. మన ఇంట్లో మనుషులుగా చూసుకుంటూనే ఉంటాం.

అలాంటి సినీ పరిశ్రమ పదేళ్లగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులదే! వీరిద్దరూ శుక్రవారం సమావేశమవుతున్న నేపథ్యంలో- దీర్ఘకాలంగా సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.

నంది అవార్డులు ఏవీ?

ఒకప్పుడు నంది అవార్డుల ఉత్సవమంటే సినిమావాళ్లకు ఓ పండుగ! అవార్డుల ప్రదానోత్సవాలు కూడా అంత ఘనంగా జరిగేవి. నటులకు ప్రోత్సాహకంగా ఉండేది. రెండు రాష్ట్రాలు విడిపడిన తర్వాత నంది అవార్డుల ప్రస్తావనే లేదు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ‘సింహ’ పేరుతో చిత్ర పరిశ్రమకు అవార్డులు ఇస్తామని ప్రకటించింది. అవార్డుల కోసం ఎంట్రీలు కూడా స్వీకరించింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ పదేళ్ల నుంచి తెలంగాణలో అవార్డుల ఊసే లేదు.


ఆంధ్రాలో పరిస్థితీ అంతే

ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో మూడేళ్ల కాలానికి సంబంధించి ఒకేసారి కమీటీలు వేసి, నంది అవార్డులు ప్రకటించింది. అంతకుముందు రెండేళ్లుగా కూడా నంది అవార్డులు ఇవ్వకపోవడంతో ఒకేసారి వేడుక నిర్వహించి మొత్తం ఐదేళ్ల కాలానికి ఒకేసారి నంది అవార్డులు ఇవ్వాలని ప్లాన్‌ చేసింది. ఇంతలో ఎన్నికలు జరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయి, జగన్‌ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. ఆయన నంది అవార్డుల గురించి పట్టించుకోనే లేదు. ఇటీవల తెలంగాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నంది అవార్డుల పేరు మార్చి.. గద్దర్‌ పేరిట సినిమాలకు అవార్డులు ఇస్తామని ప్రకటించింది. అయితే ఆ తర్వాత దీని గురించి ప్రాధమికంగా కూడా చర్చ జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కానీ, విడివిడిగా కానీ చిత్ర పరిశ్రమకు అవార్డులు ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చిత్ర పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.


పరిశ్రమగా గుర్తించాలి

సినిమాను ఒక పరిశ్రమగా గుర్తించాలనే డిమాండ్‌ చిరకాలంగా ఉంది. అలా చేయడం వల్ల అనేక రాయితీలు లభిస్తాయి. ఫలితంగా చిత్ర నిర్మాణ వ్యయం తగ్గుతుంది. థియేటర్లు నిర్వహించేవారికి వెసులుబాటు కలుగుతుంది. ఖర్చులు కలసి వస్తాయి. రాయితీల కారణంగా చిత్ర నిర్మాణాల సంఖ్య పెరిగి ప్రభుత్వానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదాయం పెరుగుతుంది.

టికెట్‌ ధరల తికమక

సినిమా టికెట్‌ ధరలు పెంచే అధికారం ప్రభుత్వాలకు ఉంది. చిత్ర నిర్మాణ వ్యయం అంచనాలకు మించి పెరిగిన నేపథ్యంలో పెట్టిన ఖర్చు తిరిగి రాబట్టుకోవడానికి టికెట్‌ ధరలు పెంచుకోవడానికి భారీ చిత్ర నిర్మాతలు విడుదలకు ముందు ప్రభుత్వాలను అభ్యర్ధించడం ఇటీవలి కాలంలో ఓ అలవాటుగా మారింది. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం- రూ. వంద కోట్ల బడ్జెట్‌ దాటిన సినిమాలకు ధరలు పెంచుకోవటానికి అనుమతి ఇస్తామని ప్రకటించింది. అయితే కొన్ని సార్లు బడ్జెట్‌ ఎక్కువ అయినా నిర్మాతలు ఖర్చును తక్కువగా చూపిస్తారు. దీని వల్ల గత ఏడాది రెండు పెద్ద సినిమాలు తీవ్రంగా నష్టపోయాయి. అంతే కాకుండా ఎంత కాలం సినిమా టికెట్‌ ధరలు పెంచుకోవచ్చనే విషయంపై కూడా అస్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా కల్కి సినిమాకు 14 రోజులు ధర పెంచటానికి ఇచ్చిన జీఓపై కేసు ప్రస్తుతం హైకోర్టులో ఉంది. కొన్ని సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం టికెట్‌ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినా , ఆంధ్రా ప్రభుత్వం మొండిచేయి చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల రెండు రాష్ట్రాలు కలిపి టిక్కెట్ల ధర విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తే బావుంటుందని సినీ వర్గాలు కోరుకుంటున్నాయి. ఇదే విధంగా బుక్‌మై షో వంటి యాప్‌లకు ప్రేక్షకులు అదనంగా సర్వీస్‌ టాక్స్‌ చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు 250 రూపాయల టికెట్‌ ధరకు అదనంగా సుమారు 49 రూపాయలు బుక్‌మై షో కు చెల్లించాల్సి వస్తోంది. ఇలా కాకుండా ప్రభుత్వమే టికెట్లు విక్రయించే విధంగా యాప్‌లను అభివృద్ధి చేస్తే బావుంటుందంటున్నారు. జగన్‌ ప్రభుత్వం ఈ తరహా యాప్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటన చేసింది. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు.


చిన్న సినిమాలూ బతకాలి!

ప్రతి ఏడాది తెలుగులో సుమారు 100 సినిమాలు విడుదల అవుతుంటాయి. వాటిల్లో పది నుంచి పదిహేను మాత్రమే పెద్ద సినిమాలు ఉంటాయి. అందుకే చిన్న సినిమాలు బతకాలంటే వాటికి ప్రత్యేకంగా రాయితీలు ప్రభుత్వ పరంగా ప్రకటించాలనే డిమాండ్‌ చిరకాలంగా ఉంది. ఈ విషయమై ప్రభుత్వంతో చర్చలు కూడా జరిగాయి. కానీ వాటిల్లో పురోగతి లేదు. థియేటర్లు దొరక్క ఇబ్బంది పడుతున్న చిన్న చిత్రాల నిర్మాతలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి ఐదో ఆటగా చిన్న సినిమాను ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇస్తామని ప్రకటించింది. కానీ అది అమలుకు నోచుకోలేదు. ఈ విషయం మీద కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అలాగే రాష్ట్రం విడిపోక ముందు సందేశాత్మక, ప్రయోగాత్మక చిత్రాలకు పది లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందించేది. ఆ తరహా చిత్రాలు నిర్మించే నిర్మాతలకు ఇది ఉపయుక్తంగా ఉండేది. అటువంటి విధానాన్ని మళ్లీ చేపట్టాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.

డిజిటల్‌ చార్జీలు కంట్రోల్‌ చేయలేమా?

ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే క్యూబ్‌(డిజిటల్‌ ఫార్మాట్‌లో చిత్రాల ప్రదర్శన) చార్జీలు ఎక్కువ. గతంలో ప్రింట్ల విధానం ఉండేది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఽథియేటర్లు డిజిటలైజ్‌ అయ్యాయి. దీని వల్ల ప్రేక్షకుల సంఖ్యతో నిమిత్తం లేకుండా- ఒక షో వేస్తే క్యూబ్‌కు కూ. 6500 చెల్లించాల్సిందే. ముఖ్యంగా సింగిల్‌ థియేటర్‌ యజమానులు ఈ పద్ధతి వల్ల చాలా నష్టపోతున్నారు. డిజిటల్‌ ఛార్జీల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే సింగిల్‌ థియేటర్లకు మేలు జరుగుతుంది. . లేకపోతే నష్టాలు భరించలేక ఎక్కువ థియేటర్లు కల్యాణ మండపాలుగానో.. షాపింగ్‌ మాల్స్‌గానో మారిపోయే అవకాశముంది.


‘జాయింట్‌ నంది అవార్డ్స్‌’...

తెలుగు సినీ రంగానికి సంబంధించి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో పైరసీ సమస్య ఒకటి. మరొకటి టికెట్‌ రేట్లు. అలాగే విద్యుత్‌ చార్జీలు కూడా తగ్గిస్తే.. పరిశ్రమకు మేలు జరుగుతుంది. తెలుగు సినీ రంగానికి తోడ్పడేలా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిపి ‘జాయింట్‌ నంది అవార్డ్స్‌’ ప్రకటిస్తే బాగుంటుంది. ఒక సంవత్సరం హైదరాబాద్‌లో, ఇంకో సంవత్సరం అమరావతిలో ఆ వేడుకలను జరపాలి. ఇలా చేస్తే తెలుగు సినిమాకు.. తెలుగు వారికి మరింత ప్లస్‌ అవుతుంది.

డి.సురేశ్‌బాబు, నిర్మాత

నంది అవార్డులను పునరుద్ధరిస్తే బాగుంటుంది

రాష్ట్రాలు రెండే కాని.. తెలుగు సినిమా రెండు రాష్ట్రాల్లోనూ ఆడుతోంది. గత ప్రభుత్వాలతో పోల్చితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు సినీరంగ అభివృద్దికి, తోడ్పాటుకు సుముఖంగా ఉన్నారు. ఇద్దరు ముఖ్యముంత్రులు కలసి మళ్లీ నంది అవార్డులను పునరుద్ధరిస్తే బాగుంటుంది. ఈ నిర్ణయం తెలుగు ప్రజలకు ఆనందం కలిగిస్తుంది. రేపు ముఖ్యమంత్రులిద్దరూ కలసి చర్చలు జరిపే నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులకు ఏదో ఒక పేరుతో అవార్డులు ప్రకటిస్తే బాగుంటుంది.

ఎస్‌.వీ.రామారావు, సినీ చరిత్రకారుడు

ప్రభుత్వానికి అండగా నిలుస్తాం

సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్‌, సైబర్‌ నేరాల నియంత్రణలో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ అన్ని వేళలా తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని టీఎఫ్‌సీసీ (తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌) తెలిపింది. ఈ మేరకు టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు దిల్‌రాజు, కార్యదర్శి కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌, కే శివప్రసాదరావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలోనూ పలు సందర్భాల్లో చిత్ర పరిశ్రమ ప్రభుత్వానికి అండగా నిలిచింది, ఇకపైనా తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలిపింది. డ్రగ్స్‌, సైబర్‌ నేరాల కట్టడిలో నటీనటులు, దర్శక నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్స్‌ యాజమాన్యాలు తమవంతు సహకారాన్ని అందిస్తారు, దీనిపై త్వరలో ముఖ్యమంత్రిని కలసి చర్చిస్తాం’ అని టీఎఫ్‌సీసీ తెలిపింది.

Updated Date - Jul 05 , 2024 | 01:03 AM