అవును... మేం విడిపోయాం!

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:59 AM

‘పెళ్లి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు పృథ్వీరాజ్‌ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో, సీరియల్స్‌లో నటించారు. మంచి నటుడిగా గుర్తింపు పొందిన పృథ్వీ వ్యక్తిగత జీవితం...

అవును... మేం విడిపోయాం!

‘పెళ్లి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు పృథ్వీరాజ్‌ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో, సీరియల్స్‌లో నటించారు. మంచి నటుడిగా గుర్తింపు పొందిన పృథ్వీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన తన మొదటి భార్య బీనాకు 2022లో విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే శీతల్‌ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. పృథ్వీ కంటే వయసులో శీతల్‌ చాలా చిన్నది కావడంతో సోషల్‌ మీడియాలో అది వైరల్‌ అయింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ జంట కలసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. . వయసు రీత్యా తామిద్దరి మధ్య ఎంతో తేడా ఉన్నా, దీనికి అతీతమైన ప్రేమబంధం ఇద్దరిదీ అని వివరణ ఇచ్చారు పృథ్వీ, శీతల్‌. అయితే ఇంతలో ఏమైందో తెలియదు కానీ వారిద్దరూ విడిపోతున్నట్లు రూమర్స్‌ జోరుగా వినిపిస్తున్నాయి. శీతల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి పృథ్వీరాజ్‌ ప్రపోజ్‌ చేసిన వీడియోను తొలిగించడం కూడా ఈ వదంతులకు బలాన్ని ఇచ్చాయి. తాజాగా తమ ప్రేమ వ్యవహారం గురించి శీతల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో క్లారిటీ ఇచ్చారు. ‘‘ఈ మధ్య చాలా మంది నా జీవితంలో ఏం జరుగుతోందని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. నా పరిస్థితిని ఏ మాత్రం అర్థం చేసుకోకుండా ఏవేవో ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారు. అందరికీ చెప్పేదేంటంటే.. నేను, పృథ్వీరాజ్‌ పెళ్లి చేసుకోలేదు. కొన్నాళ్లు సహజీవనం చేశామంతే! మేము కలలు కన్న విధంగా మా బంధం ముందుకు సాగలేకపోయింది. అయితే, ఈ చిన్నపాటి బాంధవ్యంలో మేము ఎన్నో మధుర స్మృతులు పంచుకున్నాం. ఎన్నో సంతోష క్షణాలు కలసి అనుభవించాం. కొన్నివిషయాల్లో మా ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో కొద్ది నెలల క్రితమే విడిపోయాం. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా మా నిర్ణయాన్ని గౌరవిస్తూ.. మా పరిస్థితిని అర్థం చేసుకుని, వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలిగించరని ఆశిస్తున్నాను’’ అని శీతల్‌ పేర్కొంది. అయితే, తన ఖాతాలో స్టోరీ పెట్టిన కొద్దిసేపటికే శీతల్‌ ఆ పోస్ట్‌ను తొలగించడం గమనార్హం.

Updated Date - Mar 19 , 2024 | 03:59 AM