విజేతలకు జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం

ABN , Publish Date - Oct 09 , 2024 | 01:08 AM

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా జరిగింది. 2022 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసిన విషయం విదితమే. ఉత్తమ నటుడిగా రిషబ్‌ శెట్టి (కాంతార)....

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా జరిగింది. 2022 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసిన విషయం విదితమే. ఉత్తమ నటుడిగా రిషబ్‌ శెట్టి (కాంతార), ఉత్తమ నటి అవార్డును నిత్యా మీనన్‌ (తిరుచిత్రంబలం), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌) సంయుక్తంగా రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా నిత్యా మాట్లాడుతూ ‘దాదాపు పదిహేనేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం ఇది. నా సహ నటీనటులు, ‘తిరుచిత్రంబలం’ యూనిట్‌కు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా’ అన్నారు.


ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘ఎన్నికైన ‘కార్తికేయ 2’ చిత్రానికి దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ అవార్డులు స్వీకరించారు. ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్యం) అవార్డును పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ చిత్రానికి గాను అందుకొన్నారు. ‘నేను అందుకొన్న ఏడవ జాతీయ అవార్డ్‌ ఇది. ఇన్ని అవార్డులు తీసుకోవడానికి కారణమైన ఆ భగవంతుడికి, దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు’ అన్నారు రెహమాన్‌. అలాగే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా మిథున్‌ చక్రవర్తి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ ‘ఈ రోజు దాదాపు 85 మంది అవార్డులు స్వీకరించారు. కానీ వాళ్లలో మహిళలు కేవలం 15 మందే ఉండడం విచారకం. మహిళలు కూడా తమ ప్రతిభను ప్రదర్శించి చిత్ర పరిశ్రమలో తమ స్థానాన్ని బలపర్చుకోవాలి. సినిమాలు, సోషల్‌ మీడియా సమాజంలో మార్పు తీసుకువచ్చే మంచి సాధనాలుగా ఉపయోగపడాలి’ అని అన్నారు.

Updated Date - Oct 09 , 2024 | 01:08 AM