‘ఢిల్లీలో మీ స్నేహితులు...’ అనకుండా ఉండాల్సింది’

ABN , Publish Date - Sep 28 , 2024 | 05:50 AM

‘ప్రకాశ్‌రాజ్‌ సోషల్‌ మీడియా ద్వారా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు సరిగానే అర్థమైంది’ అని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో పెట్టిన ఓ పోస్ట్‌లో పవన్‌

ప్రకాశ్‌రాజ్‌ ఉద్దేశం నాకు అర్థమైంది - ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

‘ప్రకాశ్‌రాజ్‌ సోషల్‌ మీడియా ద్వారా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు సరిగానే అర్థమైంది’ అని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో పెట్టిన ఓ పోస్ట్‌లో పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి ‘మీ వ్యాఖ్యలు మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉన్నాయి... కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు’ అని ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ చేయడం దుమారం రేపింది. దీనిపై తాజా ఇంటర్వ్యూలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ‘భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో నేను స్పందిస్తే... ‘దిల్లీలో మీ స్నేహితులు...’ అంటూ కామెంట్‌ చేయాల్సిన అవసరం ప్రకాశ్‌రాజ్‌కు లేదు. ఆయన పోస్ట్‌ను నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు సరిగానే అర్థమైంది’ అని చెప్పారు. ‘ప్రకాశ్‌రాజ్‌ నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా దారులు వేరైనా మా మధ్యన ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. ఆయనతో కలసి పనిచేయడం ఇష్టం’ అని కూడా పవన్‌ చెప్పారు.


మనకేం కావాలి.... ప్రకాశ్‌రాజ్‌ తాజా ట్వీట్‌

తిరుపతి లడ్డూ కల్తీ వివాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకున్న ప్రకాశ్‌రాజ్‌ శుక్రవారం మరోసారి సోషల్‌ మీడియా వేదికగా విమర్శలకు దిగారు. అందులో ‘మనకేం కావాలి... ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి... తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా...పరిపాలనా సంబంధమైన... అవసరమైన తీవ్రమైన చర్యలతో... సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా?’ అంటూ పవన్‌ కల్యాణ్‌ పేరును ప్రస్తావించకుండా ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు.

మూల్యం చెల్లించుకోకతప్పదు - ఖుష్బూ

లడ్డూ వివాదంపై నటి ఖుష్బూ స్పందించారు. తిరుముల లడ్డూను కల్తీ చేసినవాళ్లు ఎవరైనా మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ‘ఆ వేంకటేశ్వర స్వామి అంతా చూస్తున్నాడు. లడ్డూను కల్లీ చేయడం అంటే కోట్లాది మంది ప్రజల విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతీయడమే. అని ఖుష్బూ చెప్పారు.

Updated Date - Sep 28 , 2024 | 05:50 AM