బెంగాల్ టైగర్‌కు ఫాల్కే పురస్కారం
ABN , Publish Date - Oct 01 , 2024 | 04:14 AM
బాలీవుడ్‌లో ‘బెంగాల్ టైగర్’గా పేరొందిన నటుడు మిథున్ చక్రవర్తికి 2022 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇస్తున్నట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఎక్స్ వేదికగా...
బాలీవుడ్‌లో ‘బెంగాల్ టైగర్’గా పేరొందిన నటుడు మిథున్ చక్రవర్తికి 2022 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇస్తున్నట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆశా పరేఖ్, కుష్బూ, విపుల్ అమృత్‌లాల్ షా సభ్యులుగా ఉన్న జ్యూరీ కమిటీ ఈ అవార్డ్‌కు మిథున్ పేరుని ఎన్నిక చేసిందని మంత్రి వెల్లడించారు. దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో మూడోది అయిన పద్మభూషణ్ పొందిన ఆరు నెలల కాలంలో భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించడంతో బెంగాలీబాబు మిథున్ చక్రవర్తి నట జీవితానికి ఓ సార్థకత లభించిందని చెప్పాలి. మిగతా హీరోల్లా ఆయన కెరీర్ మొదటి నుంచీ అంత సాఫీగా సాగలేదు. ప్రతి దశలోనూ పోరాటమే. విద్యార్థి దశలోనే కాదు చిత్ర పరిశ్రమలోనూ ఆయనది పోరుబాటే. పోరాడి అన్నీ సాధించుకున్నారు మిథున్. అయితే ఆయన అసలు పేరు అది కాదు.. గౌరంగ చక్రవర్తి. 1950 జూన్ 16న కోల్‌కతాలో పుట్టిన గౌరంగ బి.ఎస్సీ చదివారు. వామపక్ష భావజాలం కలిగి ఉండడంతో సమాజంలో పెట్టుబడిదారీ వ్యవస్థ చేస్తున్న దోపిడి చూసి తట్టుకోలేకపోయేవారు. నక్సలిజం ఉద్యమం పట్ల ఆకర్షితుడై సోదరుడితో కలసి అందులో చేరి ఉద్యమకారుడిగా పీడిత ప్రజల్ని ఆకట్టుకున్నారు. అయితే తన సోదరుడు మరణించిన తర్వాత ఉద్యమ బాట వదిలి జనంలోకి వచ్చారు. బెంగాల్‌లో ఇక ఉండలేక ముంబైకి వెళ్లిపోయారు. మొదట్లో సినిమాల మీద ఆసక్తి ఉండేది కాదు.
బతకడం కోసం ఏదన్నా ఉద్యోగం చేయాలనుకుని ఓ నైట్ క్లబ్‌లో డాన్సర్‌గా చేరారు. ఆ క్లబ్‌కు వచ్చిన సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ ‘మృగయా’(1976) చిత్రంలో మిథున్‌కు అవకాశం ఇచ్చారు. అవార్డ్ వచ్చిన సందర్భంగా మిథున్ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ముంబైకి వచ్చిన తొలి రోజుల్లో తినడానికి తిండి దొరికేది కాదు. గార్డెన్‌లో పడుకున్న రోజులు ఉన్నాయి. ఆ కష్టాలు తట్టుకోలేక చచ్చిపోదామని ఎన్నోసార్లు అనిపించేది. కానీ నాకు నేనే ధైర్యం చెప్పుకొన్నా. మంచి రోజులు వస్తాయని నమ్మా. ఆ నమ్మకమే నన్ను నిలబెట్టింది’ అని చెప్పారు 74 ఏళ్ల మిథున్.
బాలీవుడ్‌పై బలమైన ముద్ర
తొలి చిత్రంతోనే జాతీయ అవార్డ్ పొందిన మిథున్ చక్రవర్తి నట జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా ‘డిస్కో డాన్సర్’. అందులో ‘ఐయామే డిస్కో డాన్సర్’ అంటూ ఆయన తెరపై డాన్స్ చేస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులు ఆనందంతో గంతులు వేశారు. అమ్మాయిలు వెర్రెత్తి పోయేవారు. 80ల దశకంలో హిందీ సినిమాపై ఎంతో ప్రభావం చూపిన నటుడాయన. హీరో అనే పదానికి అర్థం మార్చేసిన మిథున్ 1989లో 19 చిత్రాల్లో నటించి రికార్డ్ నెలకొల్పారు. బాలీవుడ్‌లో ‘బెంగాల్ టైగర్’గా పేరు తెచ్చుకోవడమే కాదు రెండు సార్లు ఉత్తమ నటుడిగా, ఒకసారి సహాయ నటుడిగా మిథున్ జాతీయ అవార్డులు అందుకొన్నారు. హిందీలోనే కాకుండా బెంగాలీ, ఒరియా, భోజ్‌పురి భాషల్లో 370 పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో పవన్‌కల్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’లో విలన్‌గా ఆకట్టుకొన్నారు. ఆమధ్య వచ్చిన ‘కశ్మీరీ ఫైల్స్’ చిత్రంలో మిథున్ నటనని ప్రేక్షకులు మరువలేరు.
మంచి పాత్రల కోసం ఇప్పటికీ పరితపించే ఈ నటుడు తనకు వచ్చిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను తన కుటుంబానికి, అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 8న జరిగే జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మిథున్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందజేస్తారు.