పీరియాడిక్ ఫిల్మ్స్... నయా ట్రెండ్!
ABN , Publish Date - Oct 17 , 2024 | 05:55 AM
సినిమాల్లో కొత్తదనం కనిపించేందుకు ఫిల్మ్ మేకర్స్ ఫాలో అవుతున్న నయా ఫార్ములా ‘పీరియాడిక్ నేపథ్యం’. పదులు, వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లి, చరిత్రకు ఆధునిక సాంకేతిక హంగులు జోడించి విజయాలు అందుకుంటున్నారు. గతంలో...
సినిమాల్లో కొత్తదనం కనిపించేందుకు ఫిల్మ్ మేకర్స్ ఫాలో అవుతున్న నయా ఫార్ములా ‘పీరియాడిక్ నేపథ్యం’. పదులు, వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లి, చరిత్రకు ఆధునిక సాంకేతిక హంగులు జోడించి విజయాలు అందుకుంటున్నారు. గతంలో జరిగిన సంఘటనలకు కొంత కల్పన జోడించి తీస్తున్న ఈ సినిమాలకు ప్రేక్షకుల స్పందన కూడా బాగుంది. అందుకే ఇప్పుడంతా ఈ నయా ట్రెండ్ నడుస్తోంది. ఇలా రూపుదిద్దుకుంటున్న చిత్రాలేమిటో ఒకసారి చూద్దాం.
ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. చారిత్రక అంశాలు కలిగిన ఈ పీరియాడిక్ లవ్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ‘సీతారామంతో’ సూపర్ హిట్ కొట్టిన హను, ‘సలార్’, ‘కల్కి 2898ఏ.డీ’లతో వసూళ్ల సునామీ సృష్టించిన ప్రభాస్ కలయికలో వస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘ఆర్‌సీ 16’. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రా్‌పలో జరిగే పీరియాడిక్ కథ ఇది. ఇందులో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది.
ప్రజానాయకుడిగా: నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’లో నటించి సూపర్‌హిట్ కొట్టారు. ఇప్పుడు ఆయన అదే దర్శకుడితో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది కూడా పొలిటకల్ టచ్‌తో సాగే పీరియాడికల్ చిత్రమట. ఇందులో ప్రజానాయకుడి పాత్రలో ఊర మాస్ లుక్‌లో నాని కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
వీరుడిగా విజయ్: రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలను ఆధారం చేసుకుని రూపొందుతున్న చిత్రమిది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్ వీరుడిగా అలరించనున్నారు.
యదార్థ సంఘటనలతో: ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘మట్కా’. 1950 నుంచి 1980ల మధ్య కాలంలో వైజాగ్ నేపథ్యంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది.
స్వాతంత్ర్యానికి పూర్వం: నూతన దర్శకుడు రోహిత్.కే.పీ దర్శకత్వంలో 1940 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో సాయి దుర్గాతేజ్ నటించనున్నారు. ‘ఎస్‌డీటీ 18’ వర్కింగ్ టైటిల్‌తో స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథతో తెరకెక్కుతోంది. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సాయి దుర్గాతేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో కూడుకున్నది. సాయి దుర్గాతేజ్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
అక్కినేని అఖిల్, దర్శకుడు అనిల్‌కుమార్ ఉపాధ్యాయుల దర్శకత్వంలో నటించే చిత్రం కూడా పీరియాడికల్ నేపథ్యం ఉన్నదే. ఈ సినిమాకు ‘థీర’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందీ చిత్రం.
చారిత్రక నేపథ్యంలో: పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను రెండు భాగాలుగా జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్నారు. బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రను పోషిస్తున్నారు.
తమిళ హీరో సూర్య పోరాట యోధుడిగా నటిస్తున్న చిత్రం ‘కంగువ’. ఈ సినిమా కథాంశం.. ఎక్కువ శాతం చారిత్రక నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా.. కొంత శాతం వర్తమానంలో సాగేలా ఉండనుంది. నవంబర్ 14న విడుదలవుతోంది. శివ దర్శకుడు. ఇందులో సూర్య చారిత్రక పోరాట యోధుడు ‘కంగువ’.. వినోదాలు పంచే ‘ఫ్రాన్సిస్’ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారు. మరోవైపు, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘సూర్య 44’ కూడా పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది.
నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ‘స్వయంభు’ చారిత్రక నేపథ్యంలో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. మరోవైపు నిఖిల్ స్వాతంత్ర్యానికి ముందు సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ద ఇండియా హౌస్’లోనూ నటిస్తున్నారు.