పవన్‌ను విమర్శించేవాళ్లు సూడో సెక్యులరిస్ట్‌లు

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:12 AM

‘పవన్‌ కల్యాణ్‌ అసలైన సెక్యులరిస్ట్‌. ఆయన్ను విమర్శించేవాళ్లంతా సూడో సెక్యులరిస్ట్‌లు’ అని నటుడు నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై....

‘పవన్‌ కల్యాణ్‌ అసలైన సెక్యులరిస్ట్‌. ఆయన్ను విమర్శించేవాళ్లంతా సూడో సెక్యులరిస్ట్‌లు’ అని నటుడు నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై స్పందించారు. ‘వైకాపా నాయకుల విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. లడ్డూ కల్తీకి పాల్పడిన వారు ఎవరనేది విచారణలో తేలుతుంది. ప్రభుత్వాల అవినీతి వల్ల హిందూ ధర్మానికి ఆపద వాటిల్లుతోంది అనేదే పవన్‌ ఆవేదన. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంతో హిందూ ధర్మంపై జరుగుతున్న కుట్రలు పతాక స్థాయికి చేరాయి. హిందూ ధర్మ రక్షణ మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’ అని నాగబాబు అన్నారు.


ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన తెలుగు రాష్ట్రాల్లోని శ్రీవారి భక్తులకు మద్దతుగా సంగీత దర్శకుడు కీరవాణి ‘ఓం నమో నారాయణాయ’ పేరుతో ఓ ఆడియో రికార్డును విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో కీరవాణికి, ఆయన బృందానికి అభినందనలు తెలిపారు.

దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు : ప్రకాశ్‌ రాజ్‌

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వరుస ట్వీట్లతో తన అభిప్రాయాలను తెలుపుతూ వార్తల్లో నిలుస్తున్నారు నటుడు ప్రకాశ్‌రాజ్‌. లడ్డూ కల్తీ అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాశ్‌ రాజ్‌ మరోసారి సోషల్‌ మీడియా వేదికగా ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ తనదైన శైలిలో స్పందించారు. ‘దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి’ అంటూ దండం పెడుతున్న ఎమోజీలను ఆయన పోస్ట్‌ చేశారు.

Updated Date - Oct 01 , 2024 | 04:12 AM