Payal Rajput : పాత సినిమా.. కొత్త వివాదం

ABN , Publish Date - May 21 , 2024 | 06:21 AM

పాయల్‌ రాజ్‌పుత్‌ నాలుగేళ్ల క్రితం నటించిన ‘రక్షణ’ చిత్రం విషయంలో మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లిస్తేనే సినిమా ప్రమోషన్స్‌కు వస్తానని పాయల్‌,...

Payal Rajput : పాత సినిమా.. కొత్త వివాదం

పాయల్‌ రాజ్‌పుత్‌ నాలుగేళ్ల క్రితం నటించిన ‘రక్షణ’ చిత్రం విషయంలో మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లిస్తేనే సినిమా ప్రమోషన్స్‌కు వస్తానని పాయల్‌, ఆమె ప్రమోషన్స్‌కు వచ్చిన తర్వాతే డబ్బు ఇస్తానని దర్శకనిర్మాత ప్రణదీప్‌ ఠాకూర్‌.. అంటూ మెట్టు దిగక పోవడంతో వివాదం మరింత జటిలమైంది. ఈ విషయంలో ప్రణదీప్‌ ఠాకూర్‌ మార్చి 28న తెలుగు నిర్మాతలమండలిని ఆశ్రయించారు. ‘పాయల్‌ రాజ్‌పుత్‌ మా సినిమా కోసం 50 కాల్షీట్లు ఇచ్చింది. అందులో 47 రోజులు వర్క్‌ చేసింది. మిగిలిన ఆ మూడు రోజులు ప్రమోషన్స్‌ కోసం రమ్మని అడుగుతుంటే ఆమె సహకరించడం లేదు’ అని ఆయన తెలుగునిర్మాతలమండలికి ఫిర్యాదు చేశారు. పాయల్‌ రాజ్‌పుత్‌కు ఇవ్వాల్సిన రూ. ఆరు లక్షలు ఇవ్వడానికి తను సిద్ధమేనని ఆయన వెల్లడించారు. నిర్మాత ఫిర్యాదును తెలుగు నిర్మాతలమండలి మూవీ ఆర్టిస్ట్‌ అసోనియేషన్‌కు పంపించింది.


అయితే ఆమె అందులో సభ్యురాలు కాకపోవడంతో తమ పరిధిలో లేని వ్యవహారమని ‘మా’ స్పష్టం చేయడంతో ఈ వ్యవహారాన్ని ముంబైలో ఉన్న ఫిల్మ్‌ ఫెడరేషన్‌కు దృష్టికి తీసుకెళ్లింది తెలుగు నిర్మాతలమండలి. ఈ లోగానే ‘నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ‘రక్షణ’ చిత్ర నిర్మాత వేఽథిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నన్ను బ్యాన్‌ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు’ అంటూ పాయల్‌ రాజ్‌పుత్‌ రెండు రోజుల క్రితం సోషల్‌ మీడియా ద్వారా ఆరోపించి, వివాదాన్ని సరికొత్త మలుపు తిప్పారు. దీనిపై తెలుగు నిర్మాతలమండలి స్పందిస్తూ పాయల్‌ను బ్యాన్‌ చేసే ఆలోచన తమకి లేదని ఏ సమస్యనైనా శాంతియుతంగా పరిష్కరించడమే తమ ఉద్ధేశమని స్పష్టం చేసింది. తెలుగు నిర్మాతలమండలి జోక్యంతో పాయల్‌ కొంత దారికి వచ్చిందని చెప్పాలి. ఆమె స్వరం కూడా మారింది.


వివాదం పెద్దగా చేయడం ఎందుకని ఆమె అనుకున్నారో ఏమో ఈ విషయంపై వివరణ ఇస్తూ గంటల వ్యవధిలోనే మరో పోస్టింగ్‌ పెట్టారు. ‘రక్షణ’ సినిమా కోసం చిత్ర బృందం ఎంత కష్టపడ్డారో తెలుసు. ఈ సినిమాకు పనిచేసిన వారెవరికీ నష్టాలు రాకూడదనేది నా తాపత్రయం. 2020లో ఈ సినిమాకు ఎలా సపోర్ట్‌ చేశానో ఇప్పుడూ అంతే సహకారం అందిస్తాను. నా విన్నపం ఒకటే.. నాతో సంప్రదింపులు జరిపాకే ఈ సినిమా విషయంలో ఎటువంటి నిర్ణయమైనా తీసుకోండి. నేను ఎవరికీ హాని తలపెట్టాలని చూడటం లేదు. చిత్ర బృందం నుంచి పిలుపు కోసం.. ఈ సమస్యను పరిష్కరించడానికి నా టీమ్‌ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది’’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Updated Date - May 21 , 2024 | 06:22 AM