ఓ బాటసారి నిను మరువమోయి
ABN , Publish Date - Sep 20 , 2024 | 01:32 AM
Ō bāṭasāri ninu maruvamōyi
అనంత శూన్యం నుంచి ప్రారంభమై అన్నింటినీ తనలో ఇమడ్చుకున్న మహామనీషి అక్కినేని. తెలుగు అక్షరమాలలో మొదటి అక్షరంతో మొదలైన ఆయన పేరు మిగిలిన అక్షరాలకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, ఆయన జీవితాన్ని ఒక అందమైన కావ్యంగా తీర్చిదిద్దింది. మహానటుడిగా నిలబెట్టింది. దైవం, అదృష్టాల కన్నా కృషినే నమ్మారు అక్కినేని. ఆయన శతజయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రత్యేక స్టాంప్ విడుదల చేస్తోంది.
జననం - 20-09-1924
మరణం - 22-01-1914
భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక శిఖరంలాంటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు. 90 వసంతాల జీవితంలో 70 వసంతాలను అభినయ కళకు అర్పించిన అరుదైన నటుడు. రంగస్థలంపై ఆడవేషాలతో నటనను ఆరంభించి కాలక్రమంలో అభినయ కళాశాలగా, నట నిఘంటువుగా ఎదిగారాయన.
ప్రారంభంలో జానపద, పౌరాణిక చిత్రాల కథనాయకునిగా తన నటజీవితాన్ని ఆరంభించినప్పటికీ కాలక్రమంలో అనేకానేక ఆధ్యాత్మిక, సాంఘిక పాత్రల ద్వారా సమకాలీన జీవన సొబగులను అభినయించి సినీ మాధ్యమాన్ని జనజీవనంతో మమైకం చేసిన ప్రజానటుడు ఆయన.
వాల్మీకి, క్షేత్రయ్య, తుకారామ్, తెనాలి రామకృష్ణ, విప్రనారాయణ, జయదేవుడు, కబీరు, కాళిదాసు వంటి విభిన్న పాత్రలు పోషించి తనకు తానే సాటి అనిపించుకున్నారు. నటనకే పరిమితం అవకుండా నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. నాటకాల రోజుల నుంచి తనకు ఎంతో అండగా నిలిచిన దుక్కిపాటి మధుసూదనరావుతో కలసి అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై ఆణిముత్యాల లాంటి చిత్రాలు నిర్మించారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో కలసి చక్రవర్తి చిత్ర పతాకంపై ‘సుడిగుండాలు’, ‘మరో ప్రపంచం’ వంటి ప్రయోగాత్మక సినిమాలు తీశారు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఎన్నో చిత్రాలు అందించారు.
స్వరాష్ట్రంలో చిత్ర పరిశ్రమ
తెలుగు చిత్ర పరిశ్రమ మదరాసు నగరం నుంచి హైదరాబాద్‌కు తరలి రావడానికి తొలి రోజుల్లో ఎంతో కృషి చేసిన వ్యక్తి అక్కినేని. ‘నాతో సినిమా తీయాలనుకునే నిర్మాతలు హైదరాబాద్‌కు రండి’ అని కండీషన్ పెట్టి, దాని మీదే చివరి వరకూ నిలబడ్డారు అక్కినేని. ఆ రోజుల్లో భాగ్యనగరంలో చిత్ర నిర్మాణానికి అవసరమైన వసతులు అరకొరకుగానే ఉన్నా, వాటితోనే సరిపుచ్చుకుని అద్భుత చిత్రాలు తీయడానికి కారకులయ్యారు అక్కినేని.
మూడు పద్మాలూ ఆయనకే!
ఒక నటునిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, ఓ మహోన్నత వ్యక్తిగా అక్కినేని నాగేశ్వరరావు అందించిన విశిష్ట సేవ లను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమ అధికార పరిధిలోని సమస్త సినీ ఘన పురస్కారాలను ఆయనకు కట్టబెట్టి పట్టాభిషేకాలు చేశాయి. మూడు పద్మాలు.. పద్మశ్రీ పద్మభూషణ్, పద్మవిభూషణ్ పొందిన ఏకైక నటుడు అక్కినేని. అలాగే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో తెలుగు వెలుగుల్ని హస్తినాపురం వరకూ ప్రసరింపచేసిన తొలి దక్షిణాది కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు.
నటనకే అంకితమైన కుటుంబం
ఏయన్నార్‌తో పాటు ఆయన కుటుంబం కూడా చిత్రపరిశ్రమకే అంకితమైంది. నాగేశ్వరరావు పెద్ద కుమారుడు వెంకట్ నిర్మాతగా కొనసాగారు. రెండో కుమారుడు నాగార్జున నటుడిగా, ఆయన కుమారుడు నాగచైతన్య, అఖిల్ హీరోలుగా ఉన్నారు. అక్కినేని పెద్ద అల్లుడు సురేంద్ర నిర్మాత కాగా, ఆయన కుమారుడు సుమంత్ నటుడిగా, కుమార్తె సుప్రియ కూడా ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు. అన్నపూర్ణ స్టూడియో బాధ్యతల్ని సుప్రియ నిర్వర్తిస్తున్నారు. ఇక అక్కినేని చిన్న కుమార్తె సుశీల కూడా నిర్మాతగా ఉన్నారు. ఆమె కుమారుడు సుశాంత్ నటుడిగా కొనసాగుతున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, రణధీర్ కపూర్ కలసి హిందీలో ‘కల్ ఆజ్ ఔర్ కల్’ (నిన్న నేడు రేపు) అనే చిత్రంలో కలిసి నటించారు. అది 1971లో విడుదలైంది. దాని తర్వాత మూడు తరాల కథానాయకులు కలిసి నటించిన చిత్రం ‘మనం’. నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య అందులో ప్రధాన పాత్రధారులు. అఖిల్ ఈ సినిమా పతాక సన్నివేశంలో కనిపిస్తారు. మూడు తరాలకు సంబంధించి ఆసక్తికరమైన కథను తయారు చేసి, విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు.
తొలి సినిమా
‘శ్రీసీతారామ జననం’
మొదటి చిత్రం ‘శ్రీసీతారామ జననం’లో శ్రీరాముడి పాత్రను అక్కినేని పోషించారు. 1944లో విడుదలైన ఈ చిత్రానికి ఘంటసాల బలరామయ్య నిర్మాత, దర్శకుడు.
సాధారణంగా ప్రేక్షకులెప్పుడూ హీరో పాత్ర మరణించడాన్ని జీర్ణించుకోలేరు. కానీ, అక్కినేని నటించిన దేవదాసు, ప్రేమాభిషేకం సినిమాల్లో హీరో మరణించినా ప్రేక్షకులు వాటికి బ్రహ్మరథం పట్టారు. ప్రణయ భావాల్ని, విషాదాల్నీ పలికించడం ఎవరికైనా సులువే. కానీ, వైరాగ్యాన్నీ, వేదాంతాన్నీ కలగలిపి పలికించడం అంత సులువేం కాదు. కళ్లు ఏడుస్తుంటే, పెదాలు నవ్వడం ఏకకాలంలో జరగాలి మరి! అలాంటి కష్టసాధ్యమైన హావభావాల్ని అలవోకగా, అద్భుత ంగా పండించిన అసామాన్యుడు అక్కినేని. అందుకే భగ్న ప్రేమికుడి పాత్రలకు ఆలంబనగా, తాగుబోతు పాత్రలకు చిరునామాగా నిలిచారు అక్కినేని
‘స్వీయ లోపంబు లెరుగుట పెద్ద విద్య’.. ..అక్కినేని తరుచుగా చెప్పే మాట ఇది. చెప్పడమే కాదు ఆచరణలో కూడా చూపించారు. తన లోపాలను ఇతరులకంటే ముందు గ్రహించి, దానికి అనుగుణంగానే పాత్రలు ఎంపిక చేసుకోవడం అక్కినేని విజయరహస్యం. మనిషి అందగాడు కాదు, అరడుగుల ఆజానబాహు కాదు. మరో వైపు ఎన్టీఆర్ వంటి సర్వాంగ సుందరుడు, ఆజానుబాహుడు తన పోటీగా, సమవుజ్జీగా ఎదుగుతుండగా తన అనర్హతల లేమిని కప్పిపుచ్చుకుంటూ, తన మనోబలాన్ని పెంచుకుంటూ అక్కినేని సాగించిన ఆరోగ్యకరమైన వృత్తిపోటీ ఈ నాటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పాలి
అక్కినేని పోషించిన దసరా బుల్లోడు పాత్ర ఒక సంచలనం. అతను టిప్‌టాప్‌గా రంగురంగుల బట్టలు వేస్తాడు. హీరోయిన్‌తో షికార్లు చేస్తాడు. ‘పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్.. నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా’ అని ఆమెని టీజ్ చేస్తాడు. డాన్సులు వేస్తాడు. తమ కుటుంబానికి అపకారం తలపెట్టిన దుష్టుల తాట వలిచేస్తాడు. ఆ పాత్రను సృష్టించింది వి.బి. రాజేంద్రప్రసాద్. ఆ సినిమాకి ఆయనే నిర్మాత, అంతేకాదు, ఆ సినిమాతోటే ఆయన దర్శకుడి అవతారమెత్తారు. అలా ‘దసరా బుల్లోడు’గా అక్కినేని వీరంగం ఆడేశారు. ఆయన స్టెప్పుల్లో జనం స్టెప్పులేశారు. ఆ సినిమా నుంచే ‘డాన్సింగ్ ఐకాన్’గా రూపు దాల్చారు.