ఆ నేపథ్యంలో ఎవరూ చేయని సినిమా

ABN , Publish Date - Oct 03 , 2024 | 02:48 AM

‘కరోనా సమయంలో ఆత్మహత్యలు చేసుకొనే వారి సంఖ్య పెరిగింది. అలాంటి ప్రయత్నం చేసినప్పుడు ఎవరైనా అడ్డుకుని వారిని ఆ ఆలోచనకు దూరం చేస్తే బాగుంటుంది.. అనే పాయింట్‌తో...

‘కరోనా సమయంలో ఆత్మహత్యలు చేసుకొనే వారి సంఖ్య పెరిగింది. అలాంటి ప్రయత్నం చేసినప్పుడు ఎవరైనా అడ్డుకుని వారిని ఆ ఆలోచనకు దూరం చేస్తే బాగుంటుంది.. అనే పాయింట్‌తో దర్శకుడు శివశేషు రాసుకున్న కథ విన్నప్పుడు నాకు కొత్తగా అనిపించింది. ఇలాంటి నేపథ్యంలో ఎవరూ సినిమా చేయలేదనిపించి, నా సమర్పణలో ‘కలి’ చిత్రాన్ని నిర్మించాం’ అన్నారు సీనియర్‌ జర్నలిస్టు రాఘవేంద్రరెడ్డి. ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య హీరోలుగా నటించిన ‘కలి’ చిత్రం ఈ నెల నాలుగున విడుదల కానుంది. లీలా గౌతమ్‌ నిర్మాత. ఈ నేపథ్యంలో రాఘవేంద్రరెడ్డి చిత్ర విశేషాలను మీడియాకు వెల్లడిస్తూ ‘శివరామ్‌ అనే మంచి వ్యక్తి తన జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఆ సమయంలో ఒక అపరిచిత వ్యక్తి అతని ఇంటికి వస్తాడు. ఆతని రాకతో శివరామ్‌ జీవితం ఎలా మారింది అనేది ‘కలి’ కథ. ఎలాంటి సందేశాలు, ఉపోద్ఘాతాలు లేకుండా సినిమా తీశాం.


నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడలేదు.. ఇందులో బల్లి పాత్రకు ప్రియదర్శి, గోడ గడియారంకు అయ్యప్ప పి.శర్మ డబ్బింగ్‌ చెప్పారు’ అని చెప్పారు రాఘవేంద్రరెడ్డి. దర్శకుడు శివ శేషు ప్రతిభావంతుడనీ, పురాణాల మీద మంచి పట్టు ఉందని తెలిపారు. సినిమా మేకింగ్‌ మీద ఫ్యాషన్‌తో లీలా గౌతమ్‌ వర్మ నిర్మాణరంగంలోకి వచ్చారనీ, నిర్మాతగా అతనికి మంచి భవిష్యత్‌ ఉంటుందని రాఘవేంద్రరెడ్డి చెప్పారు.

Updated Date - Oct 03 , 2024 | 02:48 AM