Naa Samiranga : ‘నా సామిరంగ’ మరో ‘ప్రెసిడెంట్‌గారి పెళ్లాం’ అవుతుంది

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:23 AM

‘నాగార్జునకు సరిగ్గా సరిపోయే టైటిల్‌ ‘నా సామిరంగ’. 32ఏళ్ల క్రితం నాగార్జునతో నేను చేసిన ‘ప్రెసిడెంట్‌గారి పెళ్లాం’ ఎంతటి విజయాన్ని సాధించిందో.. సంక్రాంతికి రానున్న ‘నా సామిరంగ’ కూడా అంతటి విజయాన్ని...

Naa Samiranga : ‘నా సామిరంగ’ మరో ‘ప్రెసిడెంట్‌గారి పెళ్లాం’ అవుతుంది

‘నాగార్జునకు సరిగ్గా సరిపోయే టైటిల్‌ ‘నా సామిరంగ’. 32ఏళ్ల క్రితం నాగార్జునతో నేను చేసిన ‘ప్రెసిడెంట్‌గారి పెళ్లాం’ ఎంతటి విజయాన్ని సాధించిందో.. సంక్రాంతికి రానున్న ‘నా సామిరంగ’ కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందని నా నమ్మకం. ‘ప్రెసిడెంట్‌గారి పెళ్లాం’ పల్లెటూరి నేపథ్యంతో కూడిన వినోదాత్మక చిత్రం. ‘నా సామిరంగ’ కూడా సేమ్‌ టు సేమ్‌. కాబట్టి ఇది మరో ‘ప్రెసిడెంట్‌గారి పెళ్లాం’ అవుతుందని ఆశిస్తున్నా.’ అని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు. అక్కినేని నాగార్జున హీరోగా విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మించిన చిత్రం ‘నా సామిరంగ’. కీరవాణి స్వరాలందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా కీరవాణి విలేకరులతో మాట్లాడారు. ‘రీరికార్డింగ్‌ సమయంలో ఓ సందర్భం పాట రాయాలనే ఆలోచనకు దోహదం చేసింది. దాంతో ఇందులో ఓ పాట రాశాను. ఈ సినిమాలో సంగీతం స్వచ్ఛంగా ఉంటుంది. క్వాలిటీ తగ్గకుండా వేగంగా సినిమా తీయగలగడం దర్శకుడు విజయ్‌ బిన్నీ ప్రత్యేకత. అతను స్వతహాగా డాన్స్‌ మాస్టర్‌. కాబట్టి డాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ట్యూన్స్‌ తీసుకుంటాడనుకున్నాను. కానీ అద్భుతమైన మూడు మెలొడీస్‌ని నా నుంచి తీసుకున్నాడు. దర్శకుడిగా అతనిలోని పరిపక్వత నాకప్పుడు అర్థమైంది’ అని కీరవాణి అన్నారు. ఇటీవలి సినిమాల్లో జైలర్‌, యానిమల్‌ చిత్రాల సంగీతం బావుందని ఆయన చెప్పారు. ‘హరిహరవీరమల్లు’ సినిమాకు సంబంధించిన మూడు పాటల రీకార్డింగ్‌ పూర్తయిందని, అలాగే, చిరంజీవి ‘విశ్వంభర’ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా మొదలయ్యాయని అన్నారు. రాజమౌళి సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ పనులు ఇంకా మొదలవ్వలేదని కీరవాణి తెలిపారు.

Updated Date - Jan 09 , 2024 | 04:23 AM