‘సంఘీ’ తప్పుడు పదమని నా కూతురు అనలేదు

ABN , Publish Date - Jan 31 , 2024 | 01:53 AM

‘‘సంఘీ’ అనేది ఎవరి వ్యక్తిత్వాన్నీ కించపరిచే పదం కాదు, ఎవరినో అవమానించాలనే ఆలోచన నా కూతురు ఐశ్వర్యకు లేదు’’ అని రజనీకాంత్‌ అన్నారు. ఇటీవలే జరిగిన ‘లాల్‌సలామ్‌’ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో ఐశ్వర్య ‘నా తండ్రి సంఘీ కాదు’ అంటూ...

‘సంఘీ’ తప్పుడు పదమని నా కూతురు అనలేదు

ఐశ్వర్య వ్యాఖ్యలపై స్పందించిన రజనీకాంత్‌

‘‘సంఘీ’ అనేది ఎవరి వ్యక్తిత్వాన్నీ కించపరిచే పదం కాదు, ఎవరినో అవమానించాలనే ఆలోచన నా కూతురు ఐశ్వర్యకు లేదు’’ అని రజనీకాంత్‌ అన్నారు. ఇటీవలే జరిగిన ‘లాల్‌సలామ్‌’ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో ఐశ్వర్య ‘నా తండ్రి సంఘీ కాదు’ అంటూ ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలను రజనీకాంత్‌ సమర్థించుకున్నారు. ఆ చిత్రం ఆడియో ఈవెంట్‌లో ఐశ్వర్య మాట్లాడుతూ ‘ఈ మధ్యకాలంలో మా నాన్నని కొందరు ‘సంఘీ’ అంటూ విమర్శిస్తున్నారు. నా తండ్రి సంఘీ అయి ఉంటే ‘లాల్‌సలామ్‌’ లాంటి సినిమా చేసుండేవారు కాదు. ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేవారిని ‘సంఘీ’ అంటారని తర్వాత తెలిసింది. ఈ వేదిక సాక్షిగా చెబుతున్నాను. మా నాన్న ‘సంఘీ’ కాదు. ఆయన అలాంటివారైతే నా ‘లాల్‌ సలామ్‌’లో నటించేవారే కాదు’ అని ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరుగుతోంది. హిందుత్వ వాదాన్ని బలపరచడం తప్పు ఎలా అవుతుంది అని నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కడప జిల్లాలో జరుగుతున్న ‘వేట్టైయాన్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న రజనీకాంత్‌ ఈ వివాదంపై మీడియా ముందు స్పందించారు. ‘నా కూతురు ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. ‘సంఘీ’ అనేది తప్పుడు పదం అని తను చెప్పలేదు. తన తండ్రిని ఆ ఉద్దేశంతో చూడొద్దు అని మాత్రమే చెప్పింది. ‘ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తిని అలాంటి దృష్టితో ఎందుకు చూస్తున్నారు’ అని ప్రశ్నించడం ఆమె ఉద్దేశం’అని చెప్పారు. ‘లాల్‌సలామ్‌’ సినిమాకు ఐశ్వర్య దర్శకురాలు కావడం వల్ల ఆ సినిమాకు ప్రచారం కల్పించేందుకే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని విలేకరులు అడగ్గా అలాంటి అవసరం తమకు లేదని కొట్టిపారేశారు. ఫిబ్రవరి 9న ‘లాల్‌ సలామ్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Updated Date - Jan 31 , 2024 | 01:53 AM