యానిమల్‌ లాంటి సినిమాలు సమాజానికి ప్రమాదకరం

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:02 AM

సందీప్‌రెడ్డి వంగా లేటెస్ట్‌ బ్లాక్‌బాస్టర్‌ ‘యానిమల్‌’ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అలాగే.. గత ఏడాది అత్యంత చర్చనీయాంశమైన సినిమాగా ‘యానిమల్‌’ నిలిచింది. ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత జావెద్‌ అక్తర్‌...

యానిమల్‌ లాంటి సినిమాలు సమాజానికి ప్రమాదకరం

సందీప్‌రెడ్డి వంగా లేటెస్ట్‌ బ్లాక్‌బాస్టర్‌ ‘యానిమల్‌’ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అలాగే.. గత ఏడాది అత్యంత చర్చనీయాంశమైన సినిమాగా ‘యానిమల్‌’ నిలిచింది. ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత జావెద్‌ అక్తర్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివెల్‌కి హాజరైన ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘యానిమల్‌’ లాంటి సినిమా విజయాన్ని సాధించడం సమాజానికి ప్రమాదకరం. ఓ విధంగా ఆ సినిమా తీసిన వాళ్లే కాదు, చూసినవాళ్లూ దోషులే. సినిమా చాలా శక్తిమంతమైంది. సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి సినిమాకుంది. ఇలాంటి సినిమాల వల్ల సమాజంలో నైతికత లోపిస్తే.. అందుకుచూసిన ప్రేక్షకులు కూడా బాధ్యులే అవుతారు. ఓ స్త్రీని ఓ పురుషుడు తన షూ నాకమనడం. స్త్రీ అని కూడా చూడకుండా చెంప ఛెళ్లుమనిపించడం.. ఇలాంటి సన్నివేశాలున్న సినిమా బాక్సాఫీస్‌ దగ్గర విజయం సాధించిందంటే చూస్తున్న ప్రేక్షకుల మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అక్తర్‌. ఇంకా మాట్లాడుతూ ‘జనంలో ఈ జాడ్యం నేటిది కాదు. ఏనాటిదో.. ముప్పైఏళ్ల క్రితమే ‘చోలీకే పీచే క్యాహై..’ అంటూ సాగే పాటను విపరీతంగా ఆదరించారు. సృజనాత్మకరంగంలో ఎలాంటి వాటిని ఆదరించాలి.. ఎలాంటివాటిని తిప్పికొట్టాలి అనే విషయాలపై ప్రేక్షకులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అన్నారు జావెద్‌ అక్తర్‌. ఇదిలావుంటే సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్‌కపూర్‌ హీరోగా నటించిన ‘యానిమల్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 896కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టింది.

Updated Date - Jan 09 , 2024 | 04:02 AM